సొరంగం పనులు పునఃప్రారంభించకపోతే ఊరుకోమని హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు ప్రతిష్టాత్మకమైనది కాబట్టే ఇంత కాలం ఓపిక పట్టామని, సొరంగం తవ్వకాలను తక్షణమే పునః ప్రారంభించకపోతే తీవ్ర పరిణామాలుంటాయని నిర్మాణ సంస్థ జేపీ అసోసియేట్స్‌ను నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. గురు వారం సచివాలయంలో ప్రాజెక్టుపై సమీక్షించారు. ఒప్పందం ప్రకారం ఎస్క్రో ఖాతాను తెరవాలని, పనులు పూర్తి చేసి బిల్లులు సమర్పిస్తే యుద్ధప్రాతిపదికన చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
అడ్వాన్స్‌గా బిల్లులు చెల్లిస్తే పనులు ప్రారంభిస్తామని జేపీ అసోసియేట్స్ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తులను మంత్రి ఉత్తమ్ తోసిపుచ్చారు. తమ మంచితనాన్ని బలహీనతగా భావించొద్దని..ఒప్పందం ప్రకారమే చెల్లింపులు చేస్తామన్నారు. ఇన్నాళ్లు నిర్మాణ సంస్థ ఏం అన్నా భరించామని, ఇకపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. వారం రోజుల్లో డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పద్ధతిలో పనులు ప్రారంభించాలని తేల్చి చెప్పారు. సమీక్షలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ (జనరల్) అంజాద్ హుస్సేన్, సొరంగాల నిపుణుడు కల్నల్ పరీక్షిత్ మెహ్రా పాల్గొన్నారు.


