న్యూఢిల్లీ: ‘వందేమాతరం అనేది ఒక మంత్రం.. నినాదం.. ఇది స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తిని, ప్రేరణను ఇచ్చింది. త్యాగానికి, తపనకు మార్గాన్ని చూపింది. వందేమాతర గీతం 150 సంవత్సరాల వేడుకకు మనం సాక్షులుగా మారడం గర్వకారణం. ఇది ఒక చారిత్రక క్షణం. పలు చారిత్రక సంఘటనలను మైలురాళ్లుగా జరుపుకుంటున్న కాలం ఇది. ఇటీవలే మనం 75 ఏళ్ల రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకున్నాం. దేశం.. సర్దార్ పటేల్, బిర్సా ముండా 150వ జయంతిని జరుపుకుంటోంది. గురు తేజ్ బహదూర్ 350వ అమరవీరుల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మనం వందేమాతరం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకుంటున్నాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో వందేమాతర గీతంపై చర్చను ప్రారంభిస్తూ పేర్కొన్నారు.
#WATCH | PM Narendra Modi says, "There is no leadership and opposition here. We are here to appreciate and accept the debt of Vande Mataram collectively. It is because of this song that we are all here together. It is a sacred occasion for all of us to acknowledge the debt of… pic.twitter.com/B4KvoXd5Wn
— ANI (@ANI) December 8, 2025
వలస పాలనలో బ్రిటిష్ వారు భారతీయులు ‘గాడ్ సేవ్ ది క్వీన్’ను పాడాలని ఆశించారు. కానీ దేశం ‘వందేమాతరం’ ద్వారా తన సొంత గొంతును వినిపించిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన దేశభక్తి గీతం బ్రిటిష్ ఆధిపత్యానికి శక్తివంతమైన ప్రతిస్పందన అని ఆయన అభివర్ణించారు. భవిష్యత్ తరం ఈ చర్చ నుండి ఎంతో నేర్చుకోవచ్చని అన్నారు. బ్రిటిష్ వారు తమ విభజించు-పాలించు విధానాన్ని బెంగాల్ నుండి ప్రారంభించారని, కానీ ‘వందేమాతరం’ స్ఫూర్తి వారి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసిందన్నారు.
‘వందేమాతరం’ బ్రిటిష్ పాలనకు తగిన సమాధానంగా మారింది. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని, ఆత్మవిశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. వందేమాతరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం వలస పాలనలో ఉంది. 100వ వార్షికోత్సవంలో దేశం అత్యవసర పరిస్థితిలో ఉంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 2025లో జాతీయ గీతం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. వందేమాతర గీతాన్ని 1870లలో బంకిం చంద్ర ఛటర్జీ సంస్కృతీకరించిన బెంగాలీలో రాశారు. ఇది తొలుత 1882లో ఛటర్జీ బెంగాలీ నవల ఆనంద్‌మఠ్‌లో భాగంగా ప్రచురితమయ్యింది. లక్షలాది మంది వందేమాతరం జపిస్తూ, స్వాతంత్ర్యం కోసం పోరాడినందునే మనం ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని ప్రధాని పేర్కొనన్నారు. ఈరోజు మనం జాతీయ గీతాన్ని గుర్తు చేసుకోవడం ఈ సభలో మనందరికీ గర్వకారణం అని ప్రధాని పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకులు తమ ‘గాడ్ సేవ్ ది క్వీన్’ అనే గీతాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ‘వందేమాతరం’ రాశారని ప్రధాని తెలిపారు.
‘వందేమాతరం’ దేశభక్తి నినాదం కంటే మించినదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇది స్వాతంత్ర్య పోరాట సమయంలో శక్తివంతమైన యుద్ధ నినాదంగా పనిచేసిందని, ఈ నినాదం భారతీయులలో ధైర్యం, ఐక్యత, ధిక్కారాన్ని రేకెత్తించిందని, వలస పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేసే ర్యాలీలకు పిలుపుగా మారిందని ప్రధాని పేర్కొన్నారు. ‘వందేమాతరం’ దేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. దానిలోని భావోద్వేగ, సాంస్కృతిక ప్రభావానికి ప్రపంచంలో మరొకటి సాటిలేదని ప్రధాని పేర్కొన్నారు. గాంధీజీ ‘వందేమాతరం’ను జాతీయ గీతంతో సమానం చేశారని, నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దీనిని వ్యతిరేకించారని, ముహమ్మద్ అలీ జిన్నా అభిప్రాయాలతో ఏకీభవించారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ వందేమాతరంను రాజీ పడటం కింద భావించిందని ఆరోపించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం 150 వసంతాల వందేమాతర గీతంపై ప్రత్యేక చర్చను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ చర్చ లోక్‌సభలో 10 గంటలపాటు సాగనుంది. ఈ పాట మూలాలు, స్వాతంత్ర్య పోరాట సమయంలో దాని ప్రాముఖ్యత, భారతదేశ సాంస్కృతిక, జాతీయ గుర్తింపుపై వందేమాతర గీతం ప్రభావాన్ని మరోమారు పరిశీలించనున్నారు.


