ఇస్లామాబాద్: మోదీ జీ.. ప్లీజ్ నాకు న్యాయం చేయండి.. అంటూ ఓ పాకిస్తానీ మహిళ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. తన భర్త తనను పాకిస్తాన్‌లో వదిలేసి.. భారత్‌లో రహస్యంగా మరో పెళ్లికి సిద్దమవుతున్నాడని వీడియోలో పేర్కొంది. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని ఆమె అభ్యర్థించింది. బాధితురాలు నిఖితా నాగ్‌దేవ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. పాకిస్తాన్ మూలాలున్న విక్రమ్ నాగ్‌దేవ్ దీర్ఘకాలిక వీసాపై మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా, పాక్‌లోని కరాచీకి చెందిన నిఖితతో విక్రమ్‌కు 2020 జనవరి 26న హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. అయితే, వివాహం జరిగిన నెల తర్వాత, ఫిబ్రవరి 26న ఆమెను భారత్‌కు తీసుకొచ్చారు. అనంతరం, కొన్ని నెలలకే వీసాలో సాంకేతిక సమస్య ఉందని చెప్పి, 2020 జూలై 9న అటారీ సరిహద్దు వద్ద నుంచి విక్రమ్.. నిఖితను బలవంతంగా పాకిస్తాన్‌కు పంపించేశాడు. అప్పటి నుంచి ఆమెను తిరిగి భారత్‌కు తీసుకువెళ్లలేదని నిఖిత తెలిపారు.
అంతేకాకుండా.. అత్తారింటికి వచ్చిన కొద్ది రోజులకే వారి ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు తన బంధువుల్లో ఒకరితో వివాహేతర సంబంధం ఉందని తెలిసి కన్నీరు పెట్టుకుంది. ఈ విషయం తన మామకు చెబితే.. అబ్బాయిలకు ఇలాంటివి సహజం, ఏమీ చేయలేం అని అన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తాజాగా తన భర్త మరో యువతిని పెళ్లి చేసుకోబోతున్నాడని నిఖిత ఆరోపించారు. ఢిల్లీకి చెందిన మరో మహిళను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారని తెలిపారు. ఈ విషయం తనకు తెలియడంతో 2025 జనవరి 27న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు నిఖిత చెప్పుకొచ్చారు.
ఈ కేసు మధ్యప్రదేశ్ హైకోర్టుచే అధికారం పొందిన సింధీ పంచ్ మధ్యవర్తిత్వ, న్యాయ సలహా కేంద్రం ముందుకు వచ్చింది. విచారణ అనంతరం మధ్యవర్తిత్వం విఫలమైంది. భార్యాభర్తలిద్దరూ భారత పౌరులు కాకపోవడంతో ఈ కేసు పాకిస్తాన్ పరిధిలోకి వస్తుందని పేర్కొంటూ, విక్రమ్‌ను పాక్‌కు బహిష్కరించాలని ఆ కేంద్రం 2025 ఏప్రిల్ 30న సిఫార్సు చేసింది. అలాగే, 2025 మే నెలలో ఇండోర్ సోషల్ పంచాయితీ కూడా విక్రమ్‌ను దేశం విడిచి పంపాలని సిఫార్సు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో, ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ ఈ విషయంపై విచారణకు ఆదేశించినట్లు ధృవీకరించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ తనకు న్యాయం చేయాలని నిఖిత వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనకు న్యాయం జరగకపోతే, న్యాయవ్యవస్థపై మహిళలకు నమ్మకం పోతుంది. దయచేసి తనకు అండగా నిలవండి అని ఆమె అభ్యర్థించారు.


