తారిఖ్‌ రహ్మాన్‌ రాక.. భారత్‌కు బంగ్లా టెన్షన్‌! | What Bangladesh Tarique Rahman Plan for India And China Issue | Sakshi
Sakshi News home page

తారిఖ్‌ రహ్మాన్‌ రాక.. భారత్‌కు బంగ్లా టెన్షన్‌!

Feb 14 2026 11:21 AM | Updated on Feb 14 2026 12:07 PM

What Bangladesh Tarique Rahman Plan for India And China Issue

తారిఖ్‌ రహ్మాన్‌.. బంగ్లా ప్రధాని కాబోతున్న నాయకుడు. ‘డార్క్‌ ప్రిన్స్‌’గా ఇంటాబయటా అప్రతిష్టపాలైన నేపథ్యం నుంచి ప్రధాని పీఠాన్ని అందిపుచ్చుకునే దాకా 60 ఏళ్ల రహ్మాన్‌ ప్రస్థానం బంగ్లాదేశ్‌ సరికొత్త రాజకీయానికి నాంది పలికింది. ఆయనపై లెక్కకు మించి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక కేసులో  రహ్మాన్‌ అరెస్టయ్యారు. అమెరికా కూడా రహ్మాన్‌ను ‘డార్క్‌ ప్రిన్స్‌’గా అభివర్ణించింది. బెయిల్‌పై విడుదలైన అనంతరం వైద్యచికిత్స పేరుతో 2008లో లండన్‌ వెళ్లారు. నాటి నుంచీ కుటుంబంతో పాటు అక్కడే ప్రవాసంలో గడుపుతూ వచ్చారు. లండన్‌ నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించారు.

గతేడాది డిసెంబరులో తల్లి ఖాలిదా జియా అనారోగ్యానికి గురి కావడంతో 17 ఏళ్ల తర్వాత మళ్లీ సొంతగడ్డపై అడుగుపెట్టారు. తల్లి మరణానంతరం పార్టీ పగ్గాలు అందుకున్నారు. నిరసనలు, హింసాత్మక ఘటనలతో అస్థిరంగా మారిన దేశంలో మళ్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా విస్తృత ప్రచారం చేపట్టారు. ‘బంగ్లా ఫస్ట్‌’ నినాదంతో యువతను ఆకర్షించారు. కట్‌ చేస్తే 2026 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మరి ఆయన గెలుపు భారత్‌కు లాభమేనా? రహ్మాన్‌ రాక మనకు ఏ మేరకు ఉపయోగపడనుంది?

బంగ్లాదేశ్‌ ఎన్నికలను భారత్‌ ముందు నుంచీ నిశితంగా గమనించింది. ఇదే సమయంలో భారత్‌ ప్రయోజనాలను గౌరవిస్తామని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ‘రీసెట్‌’ కోరుకుంటున్నానని, అయితే, అది రెండు దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అలాగే, ఉగ్రవాదంపై భారత్‌ పోరుకు సహకరిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. తీస్థా నదీజలాల విషయంలో నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. హిందూ మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు. భారత్, బంగ్లా సంబంధాలు మెరుగుపడే దిశగా ఇవన్నీ సానుకూల సంకేతాలేనని భావిస్తున్నారు. దీనికితోడు 2001–06 మధ్య బీఎన్‌పీతో అధికారాన్ని పంచుకున్న రాడికల్‌ పార్టీ జమాతే ఇస్లామీని ఈసారి రహ్మాన్‌ దూరం పెట్టారు. ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించారు. ఇది కూడా భారత్‌కు కలిసొచ్చే అంశమే. ఆయన పగ్గాలు చేపట్టాక ఇరుదేశాల నడుమ వాణిజ్యంతో పాటు అన్ని రంగాల్లోనూ సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.  

ఇరు దేశాల వాణిజ్యం ఇలా.. 
భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య ఏటా 14 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. అయితే, ఇందులో దాదాపు 10 బిలియన్‌ డాలర్ల వరకు మనకు వాణిజ్య మిగులే ఉంటోంది. మన దేశం నుంచి బంగ్లాదేశ్‌ టీ, కాఫీ, ఆటో విడిభాగాలు, విద్యుత్‌, ఉక్కు, స్టీల్‌, ప్లాస్టిక్‌, పత్తి వంటివి దిగుమతి చేసుకుంటోంది. బంగ్లా పత్తి దిగుమతుల్లో 80శాతం మన దేశం నుంచే వెళ్తోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కాబట్టి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్‌తో రహ్మాన్‌ దౌత్య సంబంధాలు నెరిపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సరిహద్దు భద్రత.. 
అయితే, సరిహద్దు నియంత్రణ విషయంలో రహ్మాన్‌ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై భారత్‌ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, పశ్చిమబెంగాల్‌, అస్సాంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అక్రమ వలసదారుల అంశమే ఎన్నికల్లో కీలకంగా మారింది. భారత్‌, బంగ్లాదేశ్‌ 4,100 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. 2024 జూన్‌ తర్వాత నుంచి దాదాపు 1000కి పైగా చొరబాటు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు చొరబాట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాల్సి ఉంది.

తీస్తా నది జలాల సమస్య.. 
తీస్తా నది సిక్కిం నుంచి ఉద్భవించి పశ్చిమ బెంగాల్‌ గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. మొత్తం పొడవు సుమారు 414 కిలోమీటర్లు. ఉత్తర బంగ్లాదేశ్‌లో వ్యవసాయం, సాగు నీటి అవసరాలకు ఇది కీలకంగా ఉంది. అయితే, తీస్తా నదీ జలాలను భారత్‌ ఎక్కువగా వినియోగిస్తోందని బంగ్లా ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్‌కి తక్కువ వాటా రావడం వల్ల అక్కడి రైతులు, పంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ఎక్కువ వాటా కోరుతోంది. కానీ, భారత్‌ (ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం) దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

ఒప్పందం ఇలా.. 
2011లో తీస్తా జలాలపై ఒప్పందం కుదరబోతుందని భావించారు. కానీ పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం వ్యతిరేకించింది. అప్పటి నుంచి ఒప్పందం నిలిచిపోయింది. 2025లో నాటి బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా భారత్‌ పర్యటన సందర్బంగా ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. భారత్‌ టెక్నికల్‌ టీమ్‌ను పంపి నది నిర్వహణపై చర్చిస్తామని తెలిపింది. కానీ, తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చర్చలు జరగలేదు. మరోవైపు.. తాత్కాలిక యూనస్‌ ప్రభుత్వం ఇలా పద్మానదిపై ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ప్లాన్‌ చేసింది. ఈ నేపథ్యంలో పద్మానది ప్రాజెక్ట్‌పై రెహ్మాన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కీలకంగా మారనుంది.

భారత్‌ ముందున్న సవాళ్లు.. 
తారిఖ్‌ రెహ్మాన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో అధికారంలోకి రావడం భారత్‌కి కొత్త అవకాశాలు, అలాగే కొన్ని సవాళ్లను తెస్తోంది. రెహ్మాన్‌ ప్రభుత్వం కనుక చైనాతో​ సంబంధాలను బలోపేతం చేసుకుంటే భారత్‌ మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. కాబట్టి కొత్త ప్రభుత్వంతో భారత్‌ వెంటనే ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించడం మంచిదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, భారత్‌ విషయంలో చైనా ఎప్పుడూ కయ్యానికి దిగే తరహాలోనే వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో బంగ్లా ప్రభుత్వంతో చైనా వ్యూహరచన చేస్తుందోననే టెన్షన్‌ కూడా భారత్‌కు ఉన్నట్టు సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement