Teesta river
-
తారిఖ్ రహ్మాన్ రాక.. భారత్‌కు బంగ్లా టెన్షన్!
తారిఖ్ రహ్మాన్.. బంగ్లా ప్రధాని కాబోతున్న నాయకుడు. ‘డార్క్ ప్రిన్స్’గా ఇంటాబయటా అప్రతిష్టపాలైన నేపథ్యం నుంచి ప్రధాని పీఠాన్ని అందిపుచ్చుకునే దాకా 60 ఏళ్ల రహ్మాన్ ప్రస్థానం బంగ్లాదేశ్ సరికొత్త రాజకీయానికి నాంది పలికింది. ఆయనపై లెక్కకు మించి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక కేసులో రహ్మాన్ అరెస్టయ్యారు. అమెరికా కూడా రహ్మాన్‌ను ‘డార్క్ ప్రిన్స్’గా అభివర్ణించింది. బెయిల్‌పై విడుదలైన అనంతరం వైద్యచికిత్స పేరుతో 2008లో లండన్ వెళ్లారు. నాటి నుంచీ కుటుంబంతో పాటు అక్కడే ప్రవాసంలో గడుపుతూ వచ్చారు. లండన్ నుంచే పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించారు.గతేడాది డిసెంబరులో తల్లి ఖాలిదా జియా అనారోగ్యానికి గురి కావడంతో 17 ఏళ్ల తర్వాత మళ్లీ సొంతగడ్డపై అడుగుపెట్టారు. తల్లి మరణానంతరం పార్టీ పగ్గాలు అందుకున్నారు. నిరసనలు, హింసాత్మక ఘటనలతో అస్థిరంగా మారిన దేశంలో మళ్లీ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసుకొచ్చే దిశగా విస్తృత ప్రచారం చేపట్టారు. ‘బంగ్లా ఫస్ట్’ నినాదంతో యువతను ఆకర్షించారు. కట్ చేస్తే 2026 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. మరి ఆయన గెలుపు భారత్‌కు లాభమేనా? రహ్మాన్ రాక మనకు ఏ మేరకు ఉపయోగపడనుంది?బంగ్లాదేశ్ ఎన్నికలను భారత్ ముందు నుంచీ నిశితంగా గమనించింది. ఇదే సమయంలో భారత్ ప్రయోజనాలను గౌరవిస్తామని స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను ‘రీసెట్’ కోరుకుంటున్నానని, అయితే, అది రెండు దేశాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని అన్నారు. అలాగే, ఉగ్రవాదంపై భారత్ పోరుకు సహకరిస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. తీస్థా నదీజలాల విషయంలో నెలకొన్న వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటామని చెప్పారు. హిందూ మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని ఎన్నికల ముందు ఆయన హామీ ఇచ్చారు. భారత్, బంగ్లా సంబంధాలు మెరుగుపడే దిశగా ఇవన్నీ సానుకూల సంకేతాలేనని భావిస్తున్నారు. దీనికితోడు 2001–06 మధ్య బీఎన్పీతో అధికారాన్ని పంచుకున్న రాడికల్ పార్టీ జమాతే ఇస్లామీని ఈసారి రహ్మాన్ దూరం పెట్టారు. ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించారు. ఇది కూడా భారత్‌కు కలిసొచ్చే అంశమే. ఆయన పగ్గాలు చేపట్టాక ఇరుదేశాల నడుమ వాణిజ్యంతో పాటు అన్ని రంగాల్లోనూ సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇరు దేశాల వాణిజ్యం ఇలా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఏటా 14 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరుగుతోంది. అయితే, ఇందులో దాదాపు 10 బిలియన్ డాలర్ల వరకు మనకు వాణిజ్య మిగులే ఉంటోంది. మన దేశం నుంచి బంగ్లాదేశ్ టీ, కాఫీ, ఆటో విడిభాగాలు, విద్యుత్, ఉక్కు, స్టీల్, ప్లాస్టిక్, పత్తి వంటివి దిగుమతి చేసుకుంటోంది. బంగ్లా పత్తి దిగుమతుల్లో 80శాతం మన దేశం నుంచే వెళ్తోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. కాబట్టి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని భారత్‌తో రహ్మాన్ దౌత్య సంబంధాలు నెరిపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సరిహద్దు భద్రత.. అయితే, సరిహద్దు నియంత్రణ విషయంలో రహ్మాన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై భారత్ దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే, పశ్చిమబెంగాల్, అస్సాంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో అక్రమ వలసదారుల అంశమే ఎన్నికల్లో కీలకంగా మారింది. భారత్, బంగ్లాదేశ్ 4,100 కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. 2024 జూన్ తర్వాత నుంచి దాదాపు 1000కి పైగా చొరబాటు ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు చొరబాట్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో తెలియాల్సి ఉంది.తీస్తా నది జలాల సమస్య.. తీస్తా నది సిక్కిం నుంచి ఉద్భవించి పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. మొత్తం పొడవు సుమారు 414 కిలోమీటర్లు. ఉత్తర బంగ్లాదేశ్‌లో వ్యవసాయం, సాగు నీటి అవసరాలకు ఇది కీలకంగా ఉంది. అయితే, తీస్తా నదీ జలాలను భారత్ ఎక్కువగా వినియోగిస్తోందని బంగ్లా ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్‌కి తక్కువ వాటా రావడం వల్ల అక్కడి రైతులు, పంటలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని చెబుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఎక్కువ వాటా కోరుతోంది. కానీ, భారత్ (ప్రత్యేకంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం) దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.ఒప్పందం ఇలా.. 2011లో తీస్తా జలాలపై ఒప్పందం కుదరబోతుందని భావించారు. కానీ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వ్యతిరేకించింది. అప్పటి నుంచి ఒప్పందం నిలిచిపోయింది. 2025లో నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత్ పర్యటన సందర్బంగా ఈ అంశం మళ్లీ చర్చకు వచ్చింది. భారత్ టెక్నికల్ టీమ్‌ను పంపి నది నిర్వహణపై చర్చిస్తామని తెలిపింది. కానీ, తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో చర్చలు జరగలేదు. మరోవైపు.. తాత్కాలిక యూనస్ ప్రభుత్వం ఇలా పద్మానదిపై ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో పద్మానది ప్రాజెక్ట్‌పై రెహ్మాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కీలకంగా మారనుంది.భారత్ ముందున్న సవాళ్లు.. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో అధికారంలోకి రావడం భారత్‌కి కొత్త అవకాశాలు, అలాగే కొన్ని సవాళ్లను తెస్తోంది. రెహ్మాన్ ప్రభుత్వం కనుక చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకుంటే భారత్ మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. కాబట్టి కొత్త ప్రభుత్వంతో భారత్ వెంటనే ఉన్నత స్థాయి చర్చలు ప్రారంభించడం మంచిదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, భారత్ విషయంలో చైనా ఎప్పుడూ కయ్యానికి దిగే తరహాలోనే వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో బంగ్లా ప్రభుత్వంతో చైనా వ్యూహరచన చేస్తుందోననే టెన్షన్ కూడా భారత్‌కు ఉన్నట్టు సమాచారం. -
ఎన్నాళ్లీ తీస్తా వివాదం!
నదీజలాల విషయంలో ఆచితూచి అడుగేయకపోతే ఆ నీళ్లల్లోనే నిప్పులు పుట్టుకొస్తాయి. అంతర్గతంగా ప్రాంతాల మధ్యనే తరచు చిచ్చు రేపే నదీజలాలు... పొరుగునున్న దేశంతో పంచుకోవాల్సి వచ్చినప్పుడు సమస్యగా మారటంలో వింతేమీ లేదు. ఈమధ్యే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మన దేశాన్ని సందర్శించారు. ఈ పర్యటనలో రెండు దేశాలమధ్యా పలు ద్వైపాక్షిక ఒప్పందాలు కుదరటంతోపాటు తీస్తా నదీజలాల పంపకంపై చర్చలు జరపాలనీ, ఫరక్కా జలాలపై తాజా ఒప్పందం కుదుర్చుకోవాలనీ ఇరు దేశాధినేతలూ నిర్ణయించారు. సరిగ్గా ఇదే ఇప్పుడు వివాదాన్ని రగిల్చింది. నదీజలాల విషయంలో ఉభయులకూ అంగీకారయోగ్యమైన పరిష్కారం కోసం కృషిచేయాలని భారత్, బంగ్లాదేశ్‌లు నిర్ణయించుకున్నాయని మంగళవారం ఢాకాలో హసీనా ప్రకటించిన వెంటనే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చురుగ్గా స్పందించారు. ఈ అంశంలో తమను ఎందుకు సంప్రదించలేదంటూ కేంద్రంపై భగ్గుమన్నారు. ఇది సరికాదని అభ్యంతరం చెబుతూ ఆమె మోదీకి లేఖ రాశారు. మమత ఇలా స్పందించటం ఇది మొదటిసారేమీ కాదు. ప్రజానీకానికి గుక్కెడు నీళ్లందించాలన్నా, పచ్చటి పైర్లతో పొలాలు కళకళలాడాలన్నా బంగ్లాదేశ్‌కు ఈ నదీజలాలపై భారత్‌తో ఒప్పందం కుదరటం, ప్రాజెక్టు నిర్మాణం పూర్తికావటం ఎంతో అవసరం. 2011లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తీస్తాపై ఒప్పందం దాదాపు ఖరారైంది. కానీ ఆ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తృణమూల్ అధినేత మమత అలకబూనటంతో అది ఆఖరు నిమిషంలో ఆగిపోయింది. రాజకీయంగా యూపీఏకు ఉన్న పరిమితులేమిటో, మమత స్వభావమేమిటో తెలిసిన హసీనా దానిపై పట్టుబట్టకుండా ఉండిపోయారు. ఈ నేపథ్యం తెలిసినందువల్లే ప్రధాని నరేంద్ర మోదీ 2015లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినప్పుడు తన ప్రతినిధి బృందంలో ఆమెను కూడా చేర్చారు. ఒప్పందం కుదరకపోవటం వల్ల తమ దేశానికి ఎదురవుతున్న సమస్యలను హసీనా ఆమెకు వివరించగా, రాష్ట్రంలో తనకెదురయ్యే ప్రతిబంధకాలను మమత తెలిపారని కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కాలంలో తీస్తా ప్రాజెక్టు గురించి బంగ్లాదేశ్ ప్రస్తావించకపోలేదు. కానీ బెంగాల్ అభ్యంతరాలు ఎప్పటిలాగే ఉండటం ఈ సమస్యకు శాపంగా మారింది. నిజానికి చారిత్రకంగా, సాంస్కృతికంగా పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ ఎంతో సన్నిహితమైనవి. దేశంలో జాతీయవాదం అంతకంతకు విస్తరించటానికి ఈ ప్రాంతమే కారణమని భావించిన బ్రిటిష్ వలసపాలకులు 1905లో బెంగాల్ విభజన చట్టం తీసుకొచ్చినప్పుడు నిరసనలు పెల్లుబికాయి. చివరకు 1911లో దాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ ప్రయత్నం హిందూ ముస్లింల మధ్య పొరపొచ్చాలను పెంచింది. స్వాతంత్య్రానంతరం దేశ విభజన జరిగినప్పుడు అది పాకిస్తాన్లో భాగంగా మారింది. పాకిస్తాన్ చెరలో తమ అస్తిత్వాన్ని కోల్పోతున్న తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించటానికి 1971లో మన దేశం అందించిన తోడ్పాటును బంగ్లా ప్రజలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. కానీ బంగ్లాదేశ్ తన సమస్యలను వాయిదా వేస్తూ పోలేదు. తమ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా బంగ్లా చిరకాల ఆకాంక్ష నెరవేర్చటం ఎలాగో మమతా బెనర్జీ ఆలోచించాలి. అవసరమైతే ఒక మెట్టు దిగేందుకు కూడా సిద్ధపడాలి. గంగానదిపై బెంగాల్లో నిర్మించిన ఫరక్కా బరాజ్ నుంచి బంగ్లాకు నదీజలాలు అందించటంపై 1996లో 30 ఏళ్లకు ఒప్పందం కుదిరింది.అది మరో రెండేళ్లలో పూర్తికావాల్సి వుంది. కనుక దానిపై కొత్తగా ఒప్పందం అవసరం. 1996లో తమకిచ్చిన హామీలను నెరవేర్చని కేంద్రం ఇప్పుడు మరోసారి తీస్తా, గంగా జలాలపై బంగ్లాతో చర్చించిందని మమత ఆరోపణ. అయితే అప్పుడూ ఇప్పుడూ కూడా బెంగాల్‌తో చర్చిస్తూనే ఉన్నామన్నది కేంద్రం జవాబు. 1996లో ఆ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న నీటిపారుదల శాఖ ప్రతినిధితో మాట్లాడారనీ, నిరుడు జూలై 24న కూడా ఫరక్కా జలాల అంశంపై ఏర్పడిన కమిటీలో బెంగాల్ నీటిపారుదల రంగం నిపుణుడు పాల్గొన్నారనీ కేంద్రం చెబుతోంది. మొన్న 14న ఆ కమిటీ నివేదిక కూడా సమర్పించిందని వివరించింది. అయితే ఇదంతా కేంద్ర ప్రభుత్వం అనధికారికంగా చేసిందే తప్ప విధానపరమైన చర్చలు కాదని మమత సర్కారు జవాబు. తమ అధికారులు కేవలం కేంద్రం అడిగిన సాంకేతిక వివరాలు మాత్రమే అందించారని తెలిపింది. దక్షిణాసియాపైనా, మరీ ముఖ్యంగా ఈ ప్రాంత దేశాలతో భారత్‌కున్న సంబంధాలపైనా చైనా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇలాంటి సమయంలో పట్టుదలకు పోయి నదీజలాలపై వివాదం రాజేయటం మంచిది కాదు. తీస్తా ప్రాజెక్టుపై అటు చైనా, ఇటు భారత్ ప్రతిపాదనలిచ్చాయనీ, ఎవరి ప్రతిపాదన బాగుందో చూసి నిర్ణయిస్తామనీ మంగళవారం హసీనా తెలిపారు. ఇది ఒక రకంగా భారత్ ముందుకు రాకపోతే చైనావైపు చూస్తామని చెప్పటమే. ఎగుమతుల ద్వారా బంగ్లా సమకూర్చుకుంటున్న ఆదాయంలో 80 శాతం వాటావున్న దుస్తుల తయారీ ముడిసరుకంతా చైనాయే సరఫరా చేస్తోంది. పైగా బంగ్లా వాణిజ్యంలో చైనా అతి పెద్ద భాగస్వామి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బెంగాల్ వ్యవహరించాలి. విదేశాంగ విధాన నిర్ణయాలపై రాష్ట్రాల ప్రమేయం ఉండటం మంచిదికాదు. అదే సమయంలో బెంగాల్ ప్రయోజనాలు కాపాడటం కేంద్రం బాధ్యత. గత హామీలు నెరవేర్చలేకపోతే కారణాలేమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దాలి. చిరకాల సమస్య అయిన తీస్తా వివాదంపై బెంగాల్‌ను ఒప్పించి బంగ్లా ఆకాంక్ష నెరవేర్చటం ఎలాగో కేంద్రం ఆలోచించాలి. -
‘నేనలిగా!’.. ప్రధానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ!
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అలకబూనారు. తనని సంప్రదించకుండా తమ రాష్ట్రం గుండా ప్రవహించే తీస్తా నది నీటిని బంగ్లాదేశ్‌కు ఇచ్చేందుకు ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ మమతా బెనర్జీ ప్రధాని మోదీకి మూడు పేజీల లేఖ రాశారు. ఇకపై నీటి పంపిణీల విషయంలో బంగ్లాదేశ్‌తో కేంద్రం జరిపే ముఖ్య సమావేశాలకు తమకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. మూడవసారి ప్రధానిగా మోదీ బాధ్యతులు స్వీకరించే సమయంలో భారత్‌కు తొలిసారి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా హాజరయ్యారు. ఆ తర్వాత భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల ప్రధానుల భేటీలో తీస్తా సహా నదీ జలాల పంపిణీపై రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగింది.సిక్కింలో పుట్టిన తీస్తానది భారత్‌లో దాదాపూ 320 కిలోమీటర్లు ప్రవహించాకా.. బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి అక్కడ బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. అయితే తీస్తా నదీ జలాల పంపకం భారత్-బంగ్లాల మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్-బంగ్లాలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ అవి కొలిక్కి రావడం లేదు. అందుకు పశ్చిమ బెంగాల్ కారణమని తెలుస్తోంది. ఒక్క తీస్తానే కాదు..రెండు దేశాల మధ్య దాదాపూ 53 (తీస్తా నదిని కలుపుకుని 54) నదీ జలాల పంపంకంపై ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. కనీసం సూత్ర ప్రాయంగానైనా ఒప్పందం చేసుకోవాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. అయితే తీస్తా నదిలో నీటి లభ్యత చాలా తక్కువగా ఉందంటూ పశ్చిమ బెంగాల్ అందుకు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. తీస్తా నది నీటి పంపకాల వల్ల పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆ రాష్ట్ర సీఎం దీదీ ఆరోపిస్తున్నారు. 2011లోనే నాటి సీఎం మమతా బెనర్జీ ఇదే తీస్తా నది నీటిని బంగ్లాదేశ్‌కు తరలించడంపై అభ్యంతరం చెప్పడంతో ఒప్పందం ఆగిపోయింది. తాజాగా, బంగ్లా ప్రధాని షేక్ హసీనా మోదీతో జరిపిన చర్చల్లో తీస్తా నది పంపిణీ ఒప్పందం జరిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి.ఇదే అంశంపై దీదీ.. ప్రధాని మోదీకి లేఖ రాశారు. సంప్రదింపులు, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం లేకుండా ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు ఆమోదయోగ్యం కాదు’ అని మోదీకి రాసిన మూడు పేజీల లేఖలో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ప్రజలంటే మాకు గౌరవం. వారి క్షేమం కోరుకుంటాం. కానీ భారత్-బంగ్లాదేశ్ ఫార్కా నీటి ఒప్పందం పశ్చిమ బెంగాల్ ప్రమేయం లేకుండా జరిగింది. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న మేం ఎట్టి పరిస్థితుల్లో నీటి పంపిణీ విషయంలో రాజీ పడబోమని దీదీ తెలిపారు.


