
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో ఇవాళ (అక్టోబర్ 7) ప్రారంభమైన రెండో యూత్ టెస్ట్‌లో (IND U19 Vs AUS U19) యువ భారత్ బౌలర్లు చెలరేగిపోయారు. హెనిల్ పటేల్ (9-3-21-3), ఖిలన్ పటేల్ (12-5-23-3), ఉధవ్ మోహన్ (6-0-23-2), దీపేశ్ దేవేంద్రన్ (7.3-2-22-1) ధాటికి ఆస్ట్రేలియా 43.3 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో వికెట్ కీపర్ లీ యంగ్ (66) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. మరో ఇద్దరు (యశ్ దేశ్‌ముఖ్ (22), కెప్టెన్ విల్ మలాజ్‌చుక్ (10)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. అలెక్స్ టర్నర్ (6), జెడ్ హోల్లిక్ (7), జేడన్ డ్రేపర్ (2), కేసీ బార్టన్ (9), ఛార్లెస్ లచ్‌మండ్ (1) అతి కష్టం మీద సింగిల్ డిజిట్ స్కోర్లు చేయగా.. సైమన్ బడ్జ్, విల్ బైరోమ్ డకౌట్లయ్యారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కూడా తడబడుతుంది. వైభవ్ సూర్యవంశీ స్థానంలో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన విహాన్ మల్హోత్రా 11 పరుగులకే ఔట్ కాగా.. మరో ఓపెనర్, టీమిండియా కెప్టెన్ అయిన ఆయుశ్ మాత్రే (4) వైఫల్యాల పరంపరను కొనసాగించాడు.
ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) వచ్చీ రాగానే ఎదురుదాడికి దిగినా ఎంతో సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు. వైభవ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు.
తొలి రోజు టీ విరామం సమయానికి భారత స్కోర్ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులుగా ఉంది. వేదాంత్ త్రివేది (11), రాహుల్ కుమార్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో విల్ బైరోమ్ (5-0-22-2), ఛార్లెస్ లచ్‌మండ్ (6-0-33-1) భారత బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 76 పరుగులు వెనుకపడి ఉంది.
కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ల కోసం భారత అండర్ 19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. టెస్ట్ సిరీస్‌లోనూ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌ను కూడా గెలిస్తే భారత్ ఆసీస్‌ను వారి సొంత ఇలాకాలో పూర్తిగా క్వీన్ స్వీప్ చేసినట్లవుతుంది.
చదవండి: భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. నిప్పులు చెరిగే బౌలర్ వచ్చేశాడు..!