ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా, ఆ జట్టు ఎంపిక చేసుకున్న ఆటగాళ్లు ఇప్పటినుంచే ప్రత్యర్థులను భయపెడుతున్నారు. ఈ సీజన్ మినీ వేలంలో కేకేఆర్ ఫ్రాంచైజీ టిమ్ సీఫర్ట్ (రూ. 1.5 కోట్లు), ఫిన్ అల్లెన్ (రూ. 2 కోట్లు)ను రూ. 3.5 కోట్లకు సొంతం చేసుకుంది.
ఈ న్యూజిలాండ్ ఓపెనింగ్ ద్వయం నిన్న (మార్చి 4) జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై పేట్రేగిపోయింది. ముఖ్యంగా అల్లెన్ ఆకాశమే హద్దుగా విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం (100 నాటౌట్) బాది తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు.
మరో ఎండ్‌లో సీఫర్ట్ తానేమీ తక్కువ కాదు అన్నట్లు 33 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేసి గెలుపుకు గట్టి పునాది వేశాడు. అల్లెన్, సీఫర్ట్ ఇంతలా విరుచుకుపడింది తమ ఐపీఎల్ హోం గ్రౌండ్ అయిన ఈడెన్ గార్డన్స్‌లో కావడం విశేషం.
అల్లెన్, సీఫర్ట్ విధ్వంసకాండ చూశాక కేకేఆర్ అభిమానుల్లో ఎక్కడలేని జోష్ వచ్చింది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శనలతో చివరి స్థానాల్లో నిలిచిన కేకేఆర్‌కు అల్లెన్, సీఫర్ట్ కొత్త ఊపునిచ్చారు. వీరిద్దరిని కేకేఆర్ వచ్చే సీజన్‌లో ఓపెనర్లుగా ప్రవేశపెట్టవచ్చు. వీరు మెరుపు విన్యాసాలకు పెట్టింది పేరు. ఇదే జోరును వీరు రానున్న ఐపీఎల్ సీజన్‌లోనూ కొనసాగిస్తే.. కేకేఆర్ మరోసారి టైటిల్ ఎగరేసుకుపోవడం ఖాయం.
దీనికంటే ముందు ఈ ఇద్దరిపై మరో పెద్ద బాధ్యత ఉంది. న్యూజిలాండ్‌ను రెండో సారి టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేర్చిన వీరు.. ఈసారి ఎలాగైనా టైటిల్ సాధించాలని కసిగా ఉన్నారు. ఈ ప్రపంచకప్‌లో వీరిద్దరి ఫామ్ అమోఘంగా ఉంది. ఇప్పటికే 463 పరుగులు జోడించి, టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగులు జోడిగా రికార్డు నెలకొల్పారు.
తాజాగా సౌతాఫ్రికాపై తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించిన అల్లెన్-సీఫర్ట్ జోడి.. ఈ ఎడిషన్లో 100 ప్లస్ భాగస్వామ్యం నమోదు చేయడం ఇది రెండోసారి. గ్రూప్ దశలో యూఏఈపై ఈ జోడీ అజేయమైన 175 పరుగులు జోడించి ప్రపంచకప్ రికార్డు నెలకొల్పింది.
మొత్తంగా అల్లెన్-సీఫర్ట్ జోడీ అటు స్వదేశ అభిమానులతో పాటు కేకేఆర్ అభిమానుల్లోనూ సరికొత్త ఆశలు చిగురింపజేస్తుంది. ఈ జోడీ ప్రపంచకప్ ఫైనల్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలని యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇవాళ (మార్చి 5) భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. ఈ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగనుంది.


