భారత్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో బద్దలయ్యే అవకాశమున్న 3 రికార్డులు ఇవే..! | T20 World Cup 2026: 3 records that can be broken in today India vs England match | Sakshi
Sakshi News home page

భారత్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో బద్దలయ్యే అవకాశమున్న 3 రికార్డులు ఇవే..!

Mar 5 2026 12:47 PM | Updated on Mar 5 2026 1:01 PM

T20 World Cup 2026: 3 records that can be broken in today India vs England match

టీ20 ప్రపంచకప్‌ 2026లో ఇవాళ (మార్చి 5) అ‍త్యంత​ కీలకమైన సమరం జరుగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో భారత్‌-ఇంగ్లండ్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ కోసం యావత్‌ క్రికెట్‌ ప్రపంచం​ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

ఇరు జట్లు సమవుజ్జీలు కావడంతో హోరీహోరీ తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీమిండియాకు హోం అడ్వాంటేజ్‌ ఉన్నా, ఇంగ్లండ్‌ను తక్కువ అంచనా వేయకూడదని హెచ్చరిస్తున్నారు. 

ఇరు జట్లు సెమీస్‌లో ఎదురెదురుపడటం ఇది వరుసగా మూడోసారి. 2022 ఎడిషన్‌లో ఇంగ్లండ్‌ భారత్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, ఆతర్వాత టైటిల్‌ను కూడా ఎగరేసుకుపోగా.. 2024 ఎడిషన్‌లో భారత్‌ ఇంగ్లండ్‌ను 68 పరుగుల తేడాతో చిత్తు చేసి, ఆతర్వాత టైటిల్‌ను కూడా సొంతం చేసుకుంది. 

గత రెండు ఎడిషన్లలో ఇరు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్స్‌లో గెలిచిన జట్లు ఆతర్వాత టైటిల్‌ను కూడా ఎగరేసుకుపోవడంతో ఇవాల్టి మ్యాచ్‌కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్స్‌కు చేరడమే కాకుండా, ఆతర్వాత టైటిల్‌ కూడా ఎగరేసుకుపోతుందని సెంటిమెంట్లను ఫాలో అయ్యే వారు నమ్ముతున్నారు.

గెలుపోటముల విషయం పక్కన పెడితే, నేటి మ్యాచ్‌లో మూడు భారీ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది.

అత్యధిక టీమ్‌ టోటల్‌
నేటి మ్యాచ్‌లో భారత్‌ టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లో అత్యధిక టీమ్‌ టోటల్‌ను నమోదు చేసే అవకాశం ఉంది. 2016 ఎడిషన్‌లో వాంఖడే మైదానంలోనే విండీస్‌పై చేసిన 192 పరుగులే ఇప్పటివరకు అత్యధికంగా ఉంది. 

ప్రస్తుత భారత జట్టు బ్యాటింగ్‌ విభాగం గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో ఈ రికార్డు బద్దలవడం ఖాయంగా కనిపిస్తుంది. వాంఖడే వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో తొలుత బ్యాటింగ్‌ చేస్తే టీమిండియా 200 పైచిలుకు పరుగులు సాధిస్తుందనే అంచనా ఉంది.

డేంజర్‌లో విరాట్‌ రికార్డు
నేటి మ్యాచ్‌లో బద్దలయ్యే అవకాశమున్న మరో రికార్డు టీ20 వరల్డ్‌కప్‌ నాకౌట్స్‌లో భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు విరాట్‌ కోహ్లి పేరిట ఉంది. 2016 ఎడిషన్‌ సెమీఫైనల్లో విండీస్‌పై విరాట్‌ చేసిన 89 పరుగులకే (47 బంతుల్లో 11 ఫోర్లు, సిక్స్‌, నాటౌట్‌) నేటి వరకు టీ20 ప్రపంచకప్‌ నాకౌట్స్‌లో భారత్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. 

నేటి మ్యాచ్‌లో ఈ రికార్డు కూడా బద్దలయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌లో అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ నుంచి ఈ రికార్డుకు ముప్పు పొంచి ఉంది.

ఎవరు గెలిచినా రికార్డే
నేటి మ్యాచ్‌లో బద్దలయ్యే అవకాశమున్న మరో రికార్డు టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో అత్యధిక సార్లు ఫైనల్స్‌కు చేరిన రికార్డు. ప్రస్తుతం ఈ రికార్డు భారత్‌, ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక పేరిట సంయుక్తంగా ఉంది. ఈ నాలుగు జట్లు తలో మూడు సార్లు ఫైనల్స్‌కు చేరాయి. నేటి మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా చరిత్ర అవుతుంది. భారత్‌ 2007, 2014, 2024 ఎడిషన్లలో ఫైనల్స్‌కు చేరగా.. ఇంగ్లండ్‌ 2010, 2016, 2022 ఎడిషన్లలో తుది పోరుకు అర్హత సాధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement