పాకిస్తాన్ క్రికెటర్‌కు సంబంధించి ఆలస్యంగా వెలుగు చూసిన ఓ ఘటన ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా ఓ పాక్ క్రికెటర్ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని తెలుస్తోంది. సూపర్-8 దశలో శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు ఈ ఘటన జరిగిందని సమాచారం.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పాక్ జట్టు ఫిబ్రవరి 28న పల్లెకెలెలో శ్రీలంకతో తమ చివరి సూపర్-8 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌కు ముందు, కాండీ (శ్రీలంక)లోని గోల్డెన్ క్రౌన్ హోటల్‌లో ఓ పాక్ ఆటగాడు మహిళా హౌస్‌కీపింగ్ సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.
సదరు మహిళ సాయం కోసం కేకలు వేయగా, ఇతర హోటల్ సిబ్బంది వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారని తెలుస్తుంది. ఈ విషయం పాక్ మేనేజర్ నవీద్ చీమాకు తెలియజేయగా.. ఆయన హోటల్ మేనేజ్‌మెంట్‌కు క్షమాపణ చెప్పి సమస్యను అంతర్గతంగా పరిష్కరించాడని సమాచారం.
మహిళను వేధించిన ఆ పాక్ ఆటగాడి పేరు బహిరంగంగా వెల్లడించకపోయినా, జట్టు మేనేజ్‌మెంట్ అతనిపై కఠన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా భారీ జరిమానా విధించినట్లు సమాచారం. ఈ ఘటనపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సదరు ఆటగాడిపై నక్వీ అదనపు చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.
కాగా, పాక్ ఆటగాళ్లపై, సపోర్ట్ స్టాఫ్‌పై గతంలో ఇలాంటి ఆరోపణలు చాలానే వచ్చాయి. పాక్ బృందం దురుసు ప్రవర్తనకు మారు పేరని ప్రపంచ క్రికెట్ దేశాల హోటల్ యాజమాన్యాలన్నీ ముక్తకంఠంతో చెబుతాయి. పాక్ ఆటగాళ్లకు ఇలాంటి అనుభవాలు షరామామూలే.
ఇదిలా ఉంటే, ప్రపంచకప్‌లో పాక్ ఘోర ప్రదర్శనలు చేసి సూపర్-8 దశలోనే నిష్క్రమించింది. చివరి సూపర్-8 మ్యాచ్‌లో శ్రీలంకపై భారీ తేడాతో గెలుచుంటే, న్యూజిలాండ్ కంటే మెరుగైన రన్‌రేట్ సాధించి సెమీస్‌కు అర్హత సాధించి ఉండేది.
అయితే లంక ఆటగాళ్లు అద్భుతంగా ప్రతిఘటించి పాక్‌కు సెమీస్ బెర్త్ దక్కనీయకుండా చేశారు. లంకపై భారీ స్కోర్ చేసినా గెలిచినా, పాక్ ఇంటిముఖం పట్టక తప్పలేదు. పాక్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న కారణంగా గ్రూప్-2 నుంచి ఇంగ్లండ్‌తో పాటు న్యూజిలాండ్ సెమీస్‌కు చేరింది. ఇదే న్యూజిలాండ్ జట్టు సెమీస్‌లో గ్రూప్-1 టాపర్ సౌతాఫ్రికాకు ఊహించని షాకిచ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.


