
అక్టోబర్ 19 నుంచి స్వదేశంలో భారత్‌తో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యుల ఆస్ట్రేలియా జట్టును (Australia) ఇవాళ (అక్టోబర్ 7) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా మిచెల్ మార్ష్ (Mitchell March) ఎంపిక కాగా.. పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చారు.
ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఈ సిరీస్‌లో బరిలోకి దిగనుండగా.. గాయాల నుంచి కోలుకొని మాథ్యూ షార్ట్, మిచెల్ ఓవెన్ రీఎంట్రీ ఇచ్చారు. ఓపెనింగ్ బ్యాటర్ మ్యాట్ రెన్‌షా 2022 తర్వాత తొలిసారి వన్డే జట్టుకు ఎంపికయ్యాడు.
నవంబర్‌లో ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్‌కు సన్నద్దమయ్యేందుకు పాట్ కమిన్స్ ఈ సిరీస్‌కు దూరంగా ఉండగా.. సౌతాఫ్రికాతో ఇటీవల ఆడిన సిరీస్‌లో భాగమైన లబూషేన్, కుహ్నేమన్, ఆరోన్ హార్డీ, సీన్ అబాట్‌పై వేటు పడింది. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ దేశవాలీ కమిట్‌మెంట్స్ కారణంగా తొలి వన్డేకు దూరంగా ఉండి, చివరి రెండు వన్డేలకు అందుబాటులోకి వస్తాడు.
భారత్‌తో సిరీస్‌కు ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోల్లీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, అడమ్ జాంపా
వన్డే సిరీస్ షెడ్యూల్..
తొలి వన్డే- అక్టోబర్ 19 (పెర్త్)
రెండో వన్డే- అక్టోబర్ 23 (అడిలైడ్)
మూడో వన్డే- అక్టోబర్ 25 (సిడ్నీ)
వన్డే సిరీస్‌తో పాటు 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరిగే తొలి రెండు టీ20లకు కూడా ఆసీస్ జట్టును ప్రకటించారు. ఈ జట్టుకు కూడా మిచెల్ మార్షే కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. గాయాల నుంచి కోలుకొని ఇంగ్లిస్, ఎల్లిస్ రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా న్యూజిలాండ్ పర్యటనలో గాయపడిన మ్యాక్స్‌వెల్ ఈ జట్టుకు ఎంపిక కాలేదు.
న్యూజిలాండ్ సిరీస్‌లో ఆడిన జోష్ ఫిలిప్, అలెక్స్ క్యారీకి ఈ జట్టులో చోటు దక్కలేదు. మిగతా జట్టంతా యధాతథంగా కొనసాగింది.
భారత్‌తో తొలి రెండు టీ20లకు ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నేమన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అడమ్ జాంపా
టీ20 సిరీస్ షెడ్యూల్
తొలి టీ20- అక్టోబర్ 29 (కాన్‌బెర్రా)
రెండో టీ20- అక్టోబర్ 31 (మెల్‌బోర్న్)
మూడో టీ20- నవంబర్ 2 (హోబర్ట్)
నాలుగో టీ20- నవంబర్ 6 (గోల్డ్ కోస్ట్)
ఐదో టీ20- నవంబర్ 8 (బ్రిస్బేన్)
చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్.. ప్రపంచంలో తొలి ప్లేయర్