
సౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ తజ్మిన్ బ్రిట్స్ (Tazmin Brits) మహిళల వన్డే క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ క్యాలెండర్ ఇయర్‌లో ఐదు సెంచరీలు బాదిన తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. వన్డే వరల్డ్‌కప్ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (అక్టోబర్ 6) జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో ఈ ఘనత సాధించింది.
తజ్మిన్‌కు ముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) ఖాతాలో ఉండిది. మంధన 2024, 2025 క్యాలెండర్ ఇయర్స్‌లో నాలుగు సెంచరీలు బాదింది. తాజాగా తజ్మిన్ మంధన రికార్డును బద్దలు కొట్టి, సరికొత్త చరిత్ర సృష్టించింది.
అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ సుదీర్ఘంగా సాగనుండటంతో మంధన తిరిగి తన రికార్డును తజ్మిన్ నుంచి చేజిక్కించుకునే అవకాశాలు లేకపోలేదు. ఇటీవలికాలంలో మంధన కూడా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. అయితే ఈ ప్రపంచకప్‌లో మాత్రం తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైంది.
తజ్మిన్ ఖాతాలో మరో భారీ రికార్డు
తాజా సెంచరీతో తజ్మిన్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకుంది. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలు పూర్తి చేసిన ప్లేయర్‌గా ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్ రికార్డును బ్రేక్ చేసింది. వన్డేల్లో 7 సెంచరీలు పూర్తి చేసేందుకు లాన్నింగ్‌కు 44 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. తజ్మిన్ కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించింది.
ప్రపంచంలో తజ్మిన్, లాన్నింగ్ మినహా ఏ ఒక్క మహిళా ప్లేయర్ కూడా కనీసం 50 ఇన్నింగ్స్‌ల్లో 7 వన్డే సెంచరీలు పూర్తి చేయలేకపోయారు.
మ్యాచ్ విషయానికొస్తే.. తజ్మిన్ మెరుపు సెంచరీతో (89 బంతుల్లో 101; 15 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 47.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా 40.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తజ్మిన్‌కు సూన్ లస్ (83 నాటౌట్) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా సునాయాస విజయాన్ని సాధించింది.
అంతకుముందు సోఫీ డివైన్ (85) రాణించడంతో న్యూజిలాండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ మ్యాచ్ తజ్మిన్‌తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్స్ సూజీ బేట్స్, సోఫీ డివైన్‌కు కూడా ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది.
ఎందుకంటే బేట్స్ మహిళ క్రికెట్‌లో 350 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. సోఫీ డివైన్‌కు కూడా ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్. అతి తక్కువ మంది మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.
వైరలవుతున్న తజ్మిన్ సంబరాలు
ఈ మ్యాచ్‌లో తజ్మిన్ సెంచరీ తర్వాత చేసుకున్న 'బౌ అండ్ యారో' సంబరాలు వైరలవుతున్నాయి. తజ్మిన్ సెలబ్రేషన్స్‌కు భారత క్రికెట్ అభిమానులు సైతం ముగ్దులవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
The moment Tazmin Brits made it 4️⃣ hundreds in her last 5️⃣ ODIs 🤩
Watch #NZvSA LIVE in your region, broadcast details here ➡️ https://t.co/MNSEqhJP29#CWC25 pic.twitter.com/NfSYRjCsOY— ICC Cricket World Cup (@cricketworldcup) October 6, 2025
తజ్మిన్ ఇంతకుముందు కూడా ఇలాంటి వినూత్న సంబరాలు చేసుకొని వార్తల్లో నిలిచింది. ఒంటికాలిపై యోగాసనం లాంటివి చేసి బాగా పాపులరైంది.
యాదృచ్చికం
తజ్మిన్ ఓ క్యాలెండర్ ఇయర్‌లో 5 సెంచరీలు చేసిన రోజే (అక్టోబర్ 6), సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ గ్యారీ కిర్‌స్టన్ కూడా ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. పురుషుల క్రికెట్‌లో కిర్‌స్టన్ 1996 క్యాలెండర్ ఇయర్‌లో ఇదే రోజు తన ఐదో వన్డే సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సౌతాఫ్రికన్‌గా చరిత్ర సృష్టించాడు. ఒకే రోజు ఇద్దరు సౌతాఫ్రికన్లు ఒకే ఫీట్‌ను సాధించడం యాదృచ్చికంగా జరిగింది.
5 ఇన్నింగ్స్‌ల్లో 4 శతకాలు
తజ్మిన్ తన వన్డే కెరీర్‌లో చేసిన 7 సెంచరీల్లో నాలుగింటిని గత 5 ఇన్నింగ్స్‌ల్లోనే చేయడం విశేషం. ఈ సెంచరీకి ముందు ఇంగ్లండ్‌తో వన్డేలో (5) విఫలమైన ఆమె.. అంతకుముందు మూడు వన్డేల్లో పాక్‌పై 2, వెస్టిండీస్‌పై ఓ సెంచరీ సాధించింది.
గత 5 వన్డే ఇన్నింగ్స్‌ల్లో తజ్మిన్ స్కోర్లు
- 101(91) Vs వెస్టిండీస్
- 101*(121) Vs పాక్
- 171*(141) Vs పాక్
- 5(13) Vs ఇంగ్లండ్
- 101(89) Vs న్యూజిలాండ్ (WC)
తజ్మిన్ గురించి ఆసక్తికర విషయాలు..
ప్రస్తుతం స్టార్ క్రికెటర్‌గా చలామణి అవుతున్న తజ్మిన్ తన కెరీర్‌ను అథ్లెట్‌గా మొదలుపెట్టింది. 2007లో ఆమె వరల్డ్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించింది.
2012 ఒలింపిక్స్‌కు ఎంపిక కావాల్సిన సమయంలో ఆమె రోడ్డు ప్రమాదానికి గురై, రెండు నెలలు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. దీంతో అథ్లెట్‌గా ఆమె కెరీర్ అక్కడితో ముగిసింది.
ఆతర్వాత 2018లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికైన తజ్మిన్ అప్పటి నుంచి కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తుంది. తజ్మిన్ తన తొలి 40 వన్డేల్లో ఒక్క డకౌట్ కూడా కాకుండా ఆడి అరుదైన ఆటగాళ్ల జాబితాలో నిలిచింది.
చదవండి: రిషబ్ పంత్ రీఎంట్రీ..!