
ఇంగ్లండ్ పర్యటనలో గాయపడి, కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ వికెట్‌కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) రీఎంట్రీకి సిద్దమైనట్లు తెలుస్తుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న అతను త్వరలో జరుగబోయే రంజీ ట్రోఫీలో (Ranji Trophy) తన సొంత జట్టు ఢిల్లీ (Delhi) తరఫున బరిలోకి దిగనున్నాడని సమాచారం.
జట్టులోకి రావడమే కాకుండా రంజీ ట్రోఫీలో పంత్ ఢిల్లీ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తాడని తెలుస్తుంది. అయితే ఇదంతా బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభించిన తర్వాతే జరుగుతుందని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అధికారి ఒకరు తెలిపారు.
అతని మాటల్లో.. పంత్ అక్టోబర్ 25 నుంచి ఢిల్లీ తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు అందుబాటులో ఉంటారు. అయితే అతను క్యాంప్‌లో చేరే ఖచ్చితమైన తేదీని ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే అతనికి బీసీసీఐ మెడికల్ టీమ్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ రావాల్సి ఉంది. పంత్ అందుబాటులో వస్తే ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించే అవకాశం ఉంది.
కాగా, పంత్ ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో నాలుగో టెస్ట్ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డాడు. ఆ గాయం కారణంగా ఆసియా కప్, వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లకు దూరంగా ఉన్నాడు. గాయానికి చికిత్స పూర్తైనప్పటి నుంచి బీసీసీఐ సెంటల్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఉన్న పంత్ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం.
బీసీసీఐ నుంచి క్లియరెన్స్ వస్తే అతను త్వరలో జరుగబోయే రంజీ ట్రోఫీలో పాల్గొంటాడు. ఈ మధ్యలో భారత్ ఆస్ట్రేలియాలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడేందుకు వెళ్లనుంది. ఇందులో రెండు ఫార్మాట్ల (వన్డే, టీ20) జట్లకు పంత్ ఎంపిక కాలేదు. కాబట్టి అతను నవంబర్ మధ్య వరకు ఖాళీగా ఉంటాడు.
ఈ మధ్యలో రంజీ ట్రోఫీలో సత్తా చాటితే, ఆతర్వాత జరిగే సౌతాఫ్రికా సిరీస్‌కు అతను సన్నద్దమవుతాడు. సౌతాఫ్రికా నవంబర్ 14 నుంచి భారత్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో రెండు టెస్ట్‌లు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
ఇదిలా ఉంటే, రంజీ ట్రోఫీలో ఢిల్లీ ప్రయాణం అక్టోబర్ 15న హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవనున్నప్పటికీ.. పంత్ మాత్రం అక్టోబర్ 25 నుంచి హిమాచల్ ప్రదేశ్‌తో జరిగే మ్యాచ్ నుంచి అందుబాటులో ఉంటాడు.
టీమిండియా షెడ్యూల్ విషయానికొస్తే.. భారత జట్టు ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఓ మ్యాచ్ అయిపోయగా.. మరో మ్యాచ్ మిగిలింది. ఆ మ్యాచ్ అక్టోబర్ 10 నుంచి ఢిల్లీ వేదికగా జరుగనుంది. అంతకుముందు అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఈ సిరీస్ ముగిసిన వెంటనే భారత పరిమిత ఓవర్ల జట్లు అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటిస్తాయి. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్లను ఇదివరకే ప్రకటించారు.
ఈ పర్యటనలోని వన్డే సిరీస్‌తో టీమిండియా వెటరన్ స్టార్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి బరిలోకి దిగుతారు. వీరిద్దరు టీ20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. రో-కో చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నారు.
చదవండి: World Cup 2025: టీమిండియా చేతిలో ఓడినా చరిత్ర సృష్టించిన పాకిస్తాన్