
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025లో (Women's Cricket World Cup) భాగంగా నిన్న (అక్టోబర్ 5) భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ (Inida vs Pakistan) జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ 88 పరుగుల తేడాతో పాక్‌ను ఓడించి, వన్డే ఫార్మాట్‌లో దాయాదిపై తమ రికార్డును (12-0) మరింత మెరుగుపర్చుకుంది. అలాగే వరల్డ్‌కప్ టోర్నీల్లోనూ పాక్‌పై ఆధిపత్యాన్ని 5-0 తేడాతో కొనసాగించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత క్రికెట్ జట్లు పాక్‌ను వరుసగా నాలుగు ఆదివారాల్లో ఓడించారు.
తాజాగా ముగిసిన పురుషుల ఆసియా కప్‌లో టీమిండియా గ్రూప్ (సెప్టెంబర్ 14), సూపర్-4 (సెప్టెంబర్ 21), ఫైనల్ (సెప్టెంబర్ 28) మ్యాచ్‌ల్లో వరుసగా మూడు ఆదివారాల్లో పాక్‌ను ఓడించగా.. ఇప్పుడు భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాక్‌ను వరుసగా నాలుగో ఆదివారం (అక్టోబర్ 5) చిత్తు చేసింది.
తాజా మ్యాచ్‌లో భారత మహిళా జట్టు చేతిలో ఓడినా పాక్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డేల్లో పాక్ తొలిసారి భారత్‌ను ఆలౌట్ చేసింది. ఇరు జట్ల మధ్య దీనికి ముందు 11 మ్యాచ్‌లు జరిగినా, అందులో పాక్ బౌలర్లు ఒక్కసారి కూడా భారత్‌ను ఆలౌట్ చేయలేదు.
నిన్న జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో పాక్ పేసర్ డయానా బేగ్ (10-1-69-4) చెలరేగడంతో భారత్ సరిగ్గా 50 ఓవర్లు ఆడి 247 పరుగులకు ఆలౌటైంది. మహిళల వన్డేల్లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదు కాకుండా టీమిండియా చేసిన అత్యధిక స్కోర్ ఇదే. ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఏకంగా 173 బంతులకు పరుగులు చేయలేదు.
ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో ఓ జట్టు ఇన్ని బంతులకు పరుగులు చేయలేకపోవడం ఇదే ప్రప్రధమం. గత 34 వన్డేల్లో భారత మహిళల జట్టు ఈ మార్కును (173 డాట్ బాల్స్) తాకడం ఇది రెండోసారి. 2023 జనవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 181 బంతులను వృధా చేసింది.
మ్యాచ్ విషయానికొస్తే.. భారత బ్యాటర్లను ఉన్న టాలెంట్ ప్రకారం ఈ స్కోర్ నిజంగానే చాలా చిన్నది. అయినా భారత బౌలర్లు దాన్ని విజయవంతంగా కాపాడుకొని పాక్‌ను మట్టికరిపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తక్కువ స్కోర్‌కే (247 ఆలౌట్) పరిమితం కావడానికి ఇతరత్రా కారణాలు కూడా ఉన్నాయి.
టీమిండియా బ్యాటింగ్ చేసే సమయంలో పురుగులు చాలా ఇబ్బంది పెట్టాయి. వీటి వల్ల భారత బ్యాటర్లు ఏకాగ్రత సాధించలేకపోయారు. ఓ దశలో పురుగులను పారద్రోలేందుకు స్ప్రేను కూడా ప్రయోగించారు. అయితే అప్పటికే సగం మ్యాచ్ ఆయిపోయింది.
నిన్నటి మ్యాచ్‌లో భారత్ పాక్‌పై భారీ స్కోర్ చేయలేకపోవడానికి పిచ్ మరో కారణం. పిచ్‌ను మ్యాచ్‌కు 48 గంటల ముందు వరకు క్లోజ్ చేసి ఉంచారు. దీంతో తేమ ఎక్కువై బంతి నిదానంగా కదిలింది. దీని వల్ల కూడా భారత బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. ఆఖర్లో రిచా ఘోష్ (20 బంతుల్లో 35 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడకపోయుంటే భారత్ ఇంకాస్త తక్కువ స్కోర్‌కే పరిమితమై ఉండేది.
చదవండి: World Cup 2025: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. స్ప్రే ప్రయోగించిన పాక్ కెప్టెన్