ఆసియా కప్‌ 2026 విజేతగా భారత్‌ | India A Women won ACC Women's Asia Cup Rising Stars 2026 title | Sakshi
Sakshi News home page

ఆసియా కప్‌ విజేత భారత్‌.. ఫైనల్లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం

Feb 22 2026 3:59 PM | Updated on Feb 22 2026 4:06 PM

India A Women won ACC Women's Asia Cup Rising Stars 2026 title

ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్స్‌ టైటిల్‌ను భారత్‌ వరుసగా రెండో ఎడిషన్‌లోనూ కైవసం చేసుకుంది. బ్యాంకాక్‌ వేదికగా జరిగిన 2026 ఎడిషన్‌లో భారత-ఏ జట్టు విజేతగా అవతరించింది. ఇవాళ (ఫిబ్రవరి 22) జరిగిన ఫైనల్లో టీమిండియా 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌-ఏపై ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ తొలి ఎడిషన్‌ (2023) ఫైనల్లోనూ భారత-ఏ జట్టు బంగ్లాదేశ్‌-ఏపైనే విజయం సాధించే టైటిల్‌ను చేజిక్కించుకుంది.

నేటి ఫైనల్లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా.. తేజల్‌ హసబ్నిస్‌ (51 నాటౌట్‌), కెప్టెన్‌ రాధా యాదవ్‌ (36) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగుల చేసింది. వీరిద్దరు కాకుండా భారత ఇన్నింగ్స్‌లో వ్రింద దినేశ్‌ (19) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేసింది. మిగతా బ్యాటర్లలో నందిని కశ్యప్‌ 8, అనుష్క శర్మ 8, తనూజా కన్వర్‌ 1, ప్రేమా రావత్‌ 4, మిన్నూ మణి డకౌటయ్యారు. మమత మడివాలా 2 పరుగులతో అజేయంగా నిలిచింది.

బంగ్లా బౌలర్‌ ఫాహిమ ఖాతూన్‌ (4-0-25-4) అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత్‌ను కట్టడి చేసింది. మరో బౌలర్‌ ఫాతిమా జహా సోనియా (4-0-19-1) పొదుపుగా బౌలింగ్‌ చేసింది. ఫర్జానా ఎస్మిన్‌ (4-0-30-1) పర్వాలేదనిపించింది. మిగతా బౌలర్లలో సంజిద అక్తర్‌ 3 ఓవర్లలో 12 పరుగులు.. ఫరీహా త్రిస్న 3 ఓవర్లలో 23 పరుగులు..  లతా మొండల్‌, సదియా అక్తర్‌ తలో ఓవర్‌ వేసి 14, 9 పరుగులిచ్చారు.

అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌-ఏ జట్టు తడబడింది. భారత బౌలర్లు ప్రేమా రావత్‌ (4-0-12-3), తనూజా కన్వర్‌ (3.1-0-11-2), సోనియా మెంధియా (4-0-21-2), కెప్టెన్‌ రాధా యాదవ్‌ (4-0-16-1), సైమా ఠాకోర్‌ (2-0-11-1), మిన్నూ మణి (2-0-17-1) ధాటి​కి 19.1 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటై పరాజయంపాలైంది. 

బంగ్లా ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన షమీమా సుల్తానా టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. సర్మిన్‌ సుల్తానా (18), కెప్టెన్‌ ఫాతిమా ఖాతూన్‌ (14), సదియా అక్తర్‌ (10) అతికష్టం మీద రెండంకెల స్కోర్లు చేశారు. ప్రేమా రావత్‌ 3 వికెట్లు తీయడంతో పాటు 3 క్యాచ్‌లు కూడా పట్టి భారత గెలుపులో కీలకపాత్ర పోషించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement