శ్రీలంకతో సూపర్‌-8 సమరానికి ముందు ఇంగ్లండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ | England suffer major blow ahead of T20 World Cup super 8 clash with Sri Lanka | Sakshi
Sakshi News home page

శ్రీలంకతో సూపర్‌-8 సమరానికి ముందు ఇంగ్లండ్‌ జట్టుకు ఎదురుదెబ్బ

Feb 22 2026 9:36 AM | Updated on Feb 22 2026 12:17 PM

England suffer major blow ahead of T20 World Cup super 8 clash with Sri Lanka

టీ20 ప్రపంచకప్‌ 2026లో సూపర్‌-8 సమరాలు నిన్నటి నుంచి (ఫిబ్రవరి 21) ప్రారంభమయ్యాయి. పాక్‌-న్యూజిలాండ్‌ మధ్య జరగాల్సిన తొలి సమరం వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇవాళ (ఫిబ్రవరి 22) సూపర్‌-8లో మరో రెండు ఆసక్తికర సమరాలు జరుగనున్నాయి.

మధ్యాహ్నం 3 గంటలకు పల్లెకెలె వేదికగా శ్రీలంక-ఇంగ్లండ్‌ తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్‌లో జరుగబోయే మ్యాచ్‌లో భారత్‌-సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకోనున్నాయి.

కాగా, శ్రీలంకతో కీలక సమరానికి ముందు మాజీ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. వెస్టిండీస్‌తో గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌ సందర్భంగా ఫీల్డింగ్‌ చేస్తూ, స్టార్‌ ఆల్‌రౌండర్‌ జేకబ్‌ బేతెల్‌ గాయపడ్డాడు. బేతెల్‌ ఎడమ చేతి ఉంగరం వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతను వేళ్లకు బ్యాండ్‌ ఎయిడ్‌ (protective strapping) వేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో బేతెల్‌ శ్రీలంక మ్యాచ్‌లో  బౌలింగ్‌కు అందుబాటులో ఉండటంపై అనిశ్చితి నెలకొంది.

ఐసీసీ నియమాలు ప్రకారం, బౌలర్ చేతికి ఏ రకమైన రక్షణ ఉండాలన్నా మైదానంలోకి దిగే ముందు దాన్ని అంపైర్లు ఆమోదించాలి. ఇంగ్లండ్ ఇప్పటికే ఇలాంటి పరిస్థితిని రెండు సార్లు ఎదుర్కొంది. కాబట్టి బేతెల్‌కి అనుమతి లభిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

బేతెల్ ప్రాధాన్యం
పల్లెకెలెలోని పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడే బేతెల్ గతంలో శ్రీలంకపై 4/11తో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో అతని బౌలింగ్ ఇంగ్లండ్ విజయానికి కీలకమైంది. ఇప్పుడు అదే జట్టుతో మళ్లీ తలపడుతున్న సందర్భంలో బేతెల్‌ బౌలింగ్‌ సేవలు అందుబాటులో లేకపోతే ఇంగ్లండ్ స్పిన్ విభాగం బలహీనపడే అవకాశం ఉంది.

వ్యూహంపై ప్రభావం
బేతెల్ గాయం కారణంగా ఇంగ్లండ్ జట్టు వ్యూహంలో మార్పులు తప్పనిసరి కావచ్చు. అతని బౌలింగ్ అందుబాటులో లేకపోతే, ఆ జట్టు ఇతర స్పిన్ ఎంపికలపై ఆధారపడాల్సి ఉంటుంది. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే బేతెల్‌ బౌలింగ్‌ చేయలేకపోవడం ఇంగ్లండ్‌కు పెద్ద లోటు అవుతుంది. శ్రీలంక జట్టు స్పిన్ విభాగంలో బలంగా ఉండటంతో ఇంగ్లండ్‌పై ఒత్తిడి మరింత పెంచుతుంది. మ్యాచ్‌కు ముందు అంపైర్లు ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఇంగ్లండ్‌ మేనేజ్‌మెంట్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement