మన మహిళలదే సిరీస్‌ | India win third T20 against Australia | Sakshi
Sakshi News home page

మన మహిళలదే సిరీస్‌

Feb 22 2026 3:51 AM | Updated on Feb 22 2026 3:51 AM

India win third T20 against Australia

మూడో టి20లో భారత్‌ విజయం  

17 పరుగులతో ఓడిన ఆ్రస్టేలియా  

స్మృతి, జెమీమా అర్ధసెంచరీలు

అడిలైడ్‌: ఆస్ట్రేలియా గడ్డపై దశాబ్దం తర్వాత భారత మహిళల జట్టు టి20 సిరీస్‌ గెలిచింది. శనివారం జరిగిన ఆఖరి మూడో టి20లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత్‌ 17 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలిచింది. తద్వారా ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌లో పైచేయి సాధించింది. టాస్‌ నెగ్గిన భారత్‌ మొదట బ్యాటింగ్‌ ఎంచకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్మృతి మంధాన (55 బంతుల్లో 82; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్‌ ఆటతో ఆసీస్‌ బౌలర్లపై చెలరేగింది. 

జెమీమా రోడ్రిగ్స్‌ (46 బంతుల్లో 59; 4 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించింది. ఆతిథ్య బౌలర్లలో అనాబెల్‌ సదర్లాండ్‌కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆ్రస్టేలియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఓడింది. ఒక్క యాష్లే గార్డ్‌నర్‌ (45 బంతుల్లో 57; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే పోరాడింది. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్‌ (3/22), శ్రీచరణి (3/32) ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పేశారు. 

చివరిసారిగా భారత అమ్మాయిల జట్టు 2016లో కంగారూ గడ్డపై టి20 సిరీస్‌ నెగ్గింది.  ఇప్పుడు మూడు ఫార్మాట్ల (టి20, వన్డే, టెస్టు)లకు కలిపి ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నారు. మ్యాచ్‌ గెలిస్తే రెండు పాయింట్లు, ఏకైక టెస్టు నెగ్గితే 4 పాయింట్ల ఆధారంగా ఓవరాల్‌ విజేతను ఖరారు చేస్తారు. దీంతో ఈ టి20ల్లో భారత్‌ 4–2 పాయింట్లతో పైచేయి సాధించింది.  

చెలరేగిన మంధాన 
ఆట మొదలైన మూడో ఓవర్లోనే షఫాలీ వర్మ (7) అవుటైంది. క్రీజులోకి వచి్చన జెమీమాతో కలిసి స్మృతి మంధాన కంగారూ బౌలర్ల భరతం పట్టింది. దీంతో పవర్‌ ప్లేలో భారత్‌ 54/1 స్కోరు చేసింది. స్మృతి జోరు కొనసాగడంతో 38 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఆమెకిది 33వ అర్ధసెంచరీ కావడం విశేషం.

మరోవైపు జెమీమా సైతం ధాటిగా పరుగులు సాధించడంతో ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు ఆతిథ్య బౌలర్లు ఎంతోసేపు శ్రమించాల్సివచ్చింది. ఎట్టకేలకు 17వ ఓవర్లో స్టార్‌ ఓపెనర్‌ మంధాన దూకుడుకు అనాబెల్‌ బ్రేకులేసింది. దీంతో రెండో వికెట్‌కు 121 పరుగుల భారీభాగస్వామ్యం ముగిసింది. చివర్లో హిట్టర్‌ రిచా ఘోష్‌ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా పరుగులు రాబట్టింది.  

గార్డ్‌నర్‌ పోరాటం వృథా 
భారత బౌలర్ల పవర్‌కు ఆసీస్‌ బ్యాటింగ్‌ ‘పవర్‌ ప్లే’ టాపార్డర్‌ కుదేలైంది. రెండో ఓవర్లోనే బౌలింగ్‌కు దిగిన శ్రేయాంక తన వరుస ఓవర్లలో జార్జియా వోల్‌ (10), ఎలైస్‌ పెరి (1)లను అవుట్‌ చేసింది. రేణుక... బెత్‌ మూని (6) పనిపట్టడంతో ఆస్ట్రేలియా ఒక దశలో టాపార్డర్‌ వికెట్లను కోల్పోయి 32/3 స్కోరు వద్ద కష్టాల్లో పడింది. ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (17 బంతుల్లో 26; 4 ఫోర్లు), యాష్లే గార్డ్‌నర్‌ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. 

అయితే ఆంధ్ర లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ శ్రీ చరణి రెడ్డి (3/32), హైదరాబాదీ పేసర్‌ అరుంధతి రెడ్డి (2/35)లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ లక్ష్యానికి దూరమైంది. జట్టును గెలిపించేందుకు గార్డ్‌నర్‌ చేసిన పోరాటానికి అరుంధతి చెక్‌ పెట్టడంతోనే మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement