NZ vs PAK: పాక్‌, కివీస్‌లకు బ్యాడ్‌న్యూస్‌! | T20 WC Super 8: What Happens If Pak vs NZ Match Gets Washed Out | Sakshi
Sakshi News home page

NZ vs PAK: పాక్‌, కివీస్‌లకు బ్యాడ్‌న్యూస్‌!

Feb 21 2026 1:22 PM | Updated on Feb 21 2026 1:35 PM

T20 WC Super 8: What Happens If Pak vs NZ Match Gets Washed Out

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో ఎనిమిది జట్లు ముందడుగు వేశాయి. మిగిలిన పన్నెండు జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించగా.. టాప్‌-8 జట్లతో కీలకమైన సూపర్‌-8 దశకు శనివారం తెరలేవనుంది.

తొలి మ్యాచ్‌లో కివీస్‌- పాక్‌ ఢీ
సెమీస్‌ రేసులో భాగంగా గ్రూప్‌-2 నుంచి తొలుత న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌ (NZ vs PAK) మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకు శ్రీలంకలోని కొలంబోలో గల ఆర్‌. ప్రేమదాస స్టేడియం వేదిక. భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు మ్యాచ్‌ మొదలుకావాల్సి ఉంది.

అయితే, కివీస్‌- పాక్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఇటీవల గ్రూప్‌-బి నుంచి పల్లెకెలెలో జింబాబ్వే- ఐర్లాండ్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వాన కారణంగా టాస్‌ పడకుండానే రద్దైపోయింది. తాజాగా న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌ మ్యాచ్‌కు కూడా ఇదే తరహా అనుభవం ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పొంచి ఉన్న వాన ముప్పు
ఆక్యూవెదర్‌ నివేదిక ప్రకారం.. కొలంబోలో శనివారం వర్షం పడేందుకు 80- 100 శాతం అవకాశాలు ఉన్నాయి. పగలు 75 శాతం.. రాత్రి 87 శాతం వాన కురిసేందుకు ఛాన్స్‌ ఉంది. ముఖ్యంగా రాత్రి ఉరుములతో కూడిన వర్షం పడేందుకు 52 శాతం అవకాశం ఉన్నట్లు ఆక్యూవెదర్‌ పేర్కొంది.

మ్యాచ్‌ రద్దైతే గనుక
ఇక కివీస్‌- పాక్‌ మ్యాచ్‌ రాత్రి ఏడు గంటలకు మొదలుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వర్షం వల్ల మ్యాచ్‌ గనుక రద్దైపోతే ఇరుజట్లకు ఎదురుదెబ్బ తగిలినట్లే. సూపర్‌-8 మ్యాచ్‌లకు రిజర్వ్‌డే లేదు కాబట్టి.. మ్యాచ్‌ రద్దైతే ఇరుజట్లకు చెరో పాయింట్‌ వస్తుంది. దీంతో తదుపరి మిగిలిన రెండు మ్యాచ్‌లలో తప్పక గెలవాల్సి ఉంటుంది.

కాగా సూపర్‌-8లో గ్రూప్‌-1 నుంచి భారత్‌, జింబాబ్వే, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా తలపడుతుండగా.. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంక పోటీలో ఉన్నాయి. సూపర్‌-8లో తొలి మ్యాచ్‌లో పరస్పరం తలపడుతున్న కివీస్‌, పాక్‌... తదుపరి శ్రీలంక, ఇంగ్లండ్‌లతో అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది.

ఒక్క మ్యాచ్‌ ఫలితం తేడా వచ్చినా 
ఇందులో భాగంగా పాకిస్తాన్‌ ఫిబ్రవరి 24న లండ్‌తో, ఫిబ్రవరి 28న శ్రీలంకతో..  న్యూజిలాండ్‌ ఫిబ్రవరి 25న శ్రీలంకతో, ఫిబ్రవరి 27న ఇంగ్లండ్‌తో తలపడతాయి. 

సెమీస్‌ రేసులో ఒక్క మ్యాచ్‌ ఫలితం తేడా వచ్చినా భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి శనివారం నాటి మ్యాచ్‌లో తప్పక గెలవాలని అటు న్యూజిలాండ్‌.. ఇటు పాకిస్తాన్‌ పట్టుదలగా ఉండగా.. ఫలితం వరుణుడి మీద ఆధారపడి ఉంది.

ఫామ్‌ పరంగా దొందూ దొందే
ఇదిలా ఉంటే.. కివీస్‌ జట్టులో టిమ్‌ సీఫర్ట్‌, ఫిన్‌ అలెన్‌ మాత్రమే ఇప్పటి వరకు సత్తా చాటారు. మిగిలిన వారి నుంచి స్థాయికి తగ్గ ప్రదర్శన రావాల్సి ఉంది. మరోవైపు.. తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే జరగడం పాకిస్తాన్‌కు సానుకూలాంశంగా పరిణమించింది. 

కొలంబో పిచ్‌పై వారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి.. శనివారం నాటి మ్యాచ్‌లో కివీస్‌ బ్యాటర్లు కోసం ఇప్పటికే పాక్‌ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంది. ఈసారి కూడా పాక్‌ స్పిన్‌ దళాన్నే నమ్ముకోనుంది. అయితే, పాక్‌ బ్యాటర్లలో ఫర్హాన్‌ మినహా మరెవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం ప్రతికూల అంశం. కాబట్టి ఫామ్‌ పరంగా ప్రస్తుతం కివీస్‌- పాక్‌ ఉజ్జీలుగానే ఉన్నాయని చెప్పవచ్చు.

చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement