సిగ్గులేకుండా అబద్ధాలు.. నష్టపోయింది మేమే: బంగ్లాదేశ్‌ కోచ్‌ ఫైర్‌ | "Told Such Blatant Lies...": Bangladesh Coach Slams Nazrul Over T20 World Cup Withdrawal Controversy | Sakshi
Sakshi News home page

T20 WC: సిగ్గులేకుండా అబద్ధాలు.. మా ఆటగాళ్లకే నష్టం: బంగ్లాదేశ్‌ కోచ్‌ ఫైర్‌

Feb 21 2026 10:00 AM | Updated on Feb 21 2026 11:28 AM

Told Such Blatant Lies: Bangladesh Coach Slams Nazrul Over T20 WC Row

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌-2026 ఆడాలన్న బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల కల కలగానే మిగిలిపోయింది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా టోర్నీ ఆరంభానికి ముందే జట్టు తప్పుకోవాల్సి వచ్చింది. అంతేకాదు.. భారత్‌తో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో కీలక క్రికెటర్లు బ్యాట్‌ స్పాన్సర్లతో పాటు ఇతర క్రికెట్‌ పరికరాల స్పాన్సర్లను కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

యూటర్న్‌ల నజ్రుల్‌
అయితే, వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ తప్పుకోవడంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం అని క్రీడా శాఖ మాజీ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ తొలుత మీడియాకు వివరించారు. కానీ ఆ తర్వాత మాట మారుస్తూ దేశం కోసం బంగ్లాదేశ్‌ ఆటగాళ్లే ప్రపంచకప్‌ ఆడకూడదనే నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో దుమారం రేగింది.

దీంతో మరోసారి యూటర్న్‌ తీసుకుంటూ ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ప్లేయర్లు కూడా టోర్నీ నుంచి తప్పుకున్నారని.. తన మాటల్ని వక్రీకరించడం వల్లే అపార్థాలు మొదలయ్యాయని నజ్రుల్‌ నాలుక మడతేశారు. ఈ పరిణామాలపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ మొహమ్మద్‌ సలావుద్దీన్‌ (Mohammad Salahuddin) ఘాటుగా స్పందించాడు. 

సిగ్గులేకుండా అబద్ధాలు
నజ్రుల్‌ అబద్ధాలకోరు అని.. బుద్ధి లేకుండా ఇష్టారీతిన అవాస్తవాలు ప్రచారం చేశాడని మండిపడ్డాడు. ‘‘నేనొక ఉపాధ్యాయుడిని. నాలాంటి టీచర్లు అబద్ధాలు చెప్పేందుకు వెనుకాడతారు. కానీ అతడు మాత్రం నిర్భయంగా అందరి ముందు అబద్ధాలు చెప్పాడు.

అసలు అతడు అలా ఎలా చేయగలిగాడో నాకు ఇంత వరకు అర్థం కావడం లేదు. ఆటగాళ్లే టోర్నీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారని అతడు చెప్పాడు. అలాంటి సమయంలో మా కుర్రాళ్లకు నేను ఎలా ముఖం చూపించగలను? అతడు అంత దారుణంగా యూటర్న్‌ తీసుకుంటాడని ఊహించలేదు.

అతడు కూడా ఒక టీచర్‌. ఢాకా యూనివర్సిటీలో టీచర్‌గా పనిచేసిన వ్యక్తి. అలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడం సరికాదు. దీనిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. అసలు ఆయనకు ఇదెలా సాధ్యమైంది. మాటలు మార్చడం ఆయనకు అలవాటేమో! మాకు మాత్రం కాదు.

మా ఆటగాళ్లు మానసికంగా కుంగిపోయారు
వరల్డ్‌కప్‌ ఆడాలన్న మా బాయ్స్‌ కల ఒక్క క్షణంలో చెదిరిపోయింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము. కానీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఆటగాడు నష్టపోయాడు. 

మా జట్టులోని ఇద్దరు ఆటగాళ్లైతే ఐదు రోజుల వరకు మానసికంగా కోమాలోకి వెళ్లిపోయారంటే నమ్మండి. మళ్లీ వాళ్లలో ఉత్తేజం నింపి మైదానంలో అడుగుపెట్టేలా చేయాల్సిన గురుతర బాధ్యత మాపై ఉంది’’ అని సలావుద్దీన్‌ ఉద్వేగానికి లోనయ్యాడు.

జరిగింది ఇదీ
కాగా భారత్‌- బంగ్లాదేశ్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ నుంచి బంగ్లా ఫాస్ట్‌బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రహమాన్‌ను తొలగించారు. ఈ నేపథ్యంలో భారత్‌లో తాము ఆడాల్సిన టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల వేదికను మార్చాలని బంగ్లాదేశ్‌ పట్టుపట్టింది. భారత్‌లో తమకు భద్రత లేదని.. మరో ఆతిథ్య దేశం శ్రీలంకలో తమను ఆడించాలని ఐసీసీని కోరింది. 

అయితే, బంగ్లాదేశ్‌ వాదనలో నిజం లేదని తమ కమిటీ చెప్పడంతో ఐసీసీ.. ఇందుకు నిరాకరించింది. ఈ విషయంలో పునరాలోచన చేయాలని బంగ్లాదేశ్‌కు గడువు​ ఇవ్వగా.. తగ్గేదేలే అంటూ బంగ్లా పంతానికి పోయింది. దీంతో టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తప్పిస్తూ.. ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది ఐసీసీ. దీంతో బంగ్లాదేశ్‌ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. 

చదవండి: T20 WC: ‘పీసీబీ చీఫ్‌ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement