పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2026లోకి మరో సౌతాఫ్రికా క్రికెటర్ చేరాడు. ఈ లీగ్‌లో ఇప్పటికే చాలామంది సౌతాఫ్రికా ఆటగాళ్లు పాల్గొంటుండగా.. తాజాగా యువ వికెట్‌కీపర్ బ్యాటర్ రూబిన్ హెర్మన్ వీరి సరసన చేరాడు. హెర్మన్‌ను లాహోర్ ఖలందర్స్ ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది. ఖలందర్స్‌తో జతకట్టిన అనంతరం హెర్మన్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు దక్కింది.
ఫాఫ్ డుప్లెసిస్ తర్వాత ఖలందర్స్‌కు ప్రాతినిథ్యం వహించిన రెండో సౌతాఫ్రికన్‌గా హెర్మన్ గుర్తింపు పొందాడు. గతేడాది చివర్లో డుప్లెసిస్ ఐపీఎల్ వేలం నుంచి తప్పుకొని పీఎస్‌ఎల్‌లో చేరాడు. 14 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో దాదాపు 4,800 పరుగులు చేసిన డుప్లెసిస్, పీఎస్‌ఎల్ ఆడటం అప్పట్లో సంచలనం. ఈ ఏడాది ఐపీఎల్ విండోలో మరో సౌతాఫ్రికా ఆటగాడు పీఎస్ఎల్‌లో పాల్గొంటుండటం ఆసక్తికరం.
హెర్మన్ ప్రదర్శనలు
29 ఏళ్ల హెర్మన్ CSA T20 ఛాలెంజ్ 2023-24లో 436 పరుగులు చేసి తొలిసారి వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత SA20లో పార్ల్ రాయల్స్ తరఫున ఆడాడు. 2025 ఎడిషన్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌పై ఒత్తిడిలో 81* పరుగులు చేసి ప్రతిభను చాటుకున్నాడు. ఆ ఎడిషన్‌లో 226 పరుగులు చేశాడు. మొత్తం టీ20 కెరీర్‌లో హెర్మన్ 1,497 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం, 8 అర్ద శతకాలు ఉన్నాయి.
లాహోర్ జట్టు వ్యూహం
లాహోర్ జట్టు ఇప్పటికే ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, ఉసామా మిర్, హసీబుల్లా ఖాన్ వంటి స్థానిక ఆటగాళ్లను కలిగి ఉంది. హెర్మన్ చేరికతో ఆ ఫ్రాంచైజీ బ్యాటింగ్ బలం మరింత పెరుగనుంది. హెర్మన్ మిడిలార్డర్‌లో కీలకమైన బ్యాటర్. అతన్ని 5 లేదా 6వ స్థానంలో ఉపయోగించుకోవచ్చు. స్ట్రైక్ రొటేట్ చేయడం, డెత్ ఓవర్లలో బౌండరీలు కొట్టడం హెర్మన్ ప్రత్యేకత.


