సూపర్ ఫామ్‌లో ఉన్న భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు మరో గుడ్ న్యూస్ అందింది. 2026 జనవరి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. పురుషుల విభాగంలో స్కైతో పాటు న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్, ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ కూడా నామినేట్ అయ్యారు.
మహిళల విభాగంలో ఐర్లాండ్‌కు చెందిన గాబీ లూయిస్, బంగ్లాదేశ్ ప్లేయర్ శోభన మోస్టరీ, యూఎస్‌ఏకు చెందిన టారా నోర్రిస్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు పోటీపడుతున్నారు. గత నెలలో వీరంతా తమతమ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనలు చేయడంతో ఐసీసీ వీరిని ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్ చేసింది.
డారిల్ మిచెల్
జనవరిలో టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో డారిల్ మిచెల్ ఆకాశమే హద్దుగా చెలరేగి, తన జట్టుకు 2-1 తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. రెండు, మూడు వన్డేల్లో మిచెల్ వరుస శతకాలు సాధించి మొత్తం 352 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతని సగటు 176గా ఉండటం విశేషం.
ఈ ప్రదర్శన తర్వాత మిచెల్ ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా 186.56 స్ట్రైక్ రేట్‌తో 125 పరుగులు సాధించి సత్తా చాటాడు.
జో రూట్
రూట్ విషయానికొస్తే.. ఈ స్టార్ బ్యాటర్ జనవరి నెలలో శ్రీలంకపై ఇంగ్లండ్ 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్‌లో అతను వరుసగా 61, 75, 111 నాటౌట్ స్కోర్లు చేశాడు. అదనంగా రెండు వికెట్లు కూడా తీసి "ప్లేయర్ ఆఫ్ ద సిరీస్" అవార్డును కూడా అందుకున్నాడు. ఈ ప్రదర్శనల కారణంగానే రూట్‌ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
సూర్యకుమార్ యాదవ్
జనవరి నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో స్కై తన పూర్వపు ఫామ్‌ను తిరిగి పొందాడు. అంతకుముందు 25 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన స్కై.. ఆ సిరీస్‌లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. 197 స్ట్రైక్ రేట్‌తో 242 పరుగులు చేసి భారత్‌కు సిరీస్ విజయాన్ని (4-1) అందించాడు. ఈ ప్రదర్శనల కారణంగానే స్కై ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.


