ఇటీవలికాలంలో టీమిండియా క్రికెటర్లు (శిఖర్ ధవన్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చహల్, హార్దిక్ పాండ్యా) వరుసగా విడాకులు తీసుకుంటున్నారు. వివాహ బంధంలో ఇమడలేక భార్యలతో తెగదెంపులు చేసుకుంటున్నారు. ఈ జాబితాలో తాజాగా మరో భారత క్రికెటర్ కూడా చేరాడు.
26 ఏళ్ల లెగ్ స్పిన్నర్, మరో టీమిండియా ఆటగాడు దీపక్ చాహర్ సోదరుడు అయిన రాహుల్ చాహర్ తన భార్య ఇషానీ జోహర్‌తో విడాకులు తీసుకున్నట్లు ఇవాళ (ఫిబ్రవరి 20) ప్రకటించాడు. ఈ విషయాన్ని చాహర్ ఓ భావోద్వేగపూర్వక నోట్‌తో ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
చిన్న వయసులోనే వివాహం చేసుకున్నానని, అప్పట్లో తనను తాను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయానని, అది తనకు జీవిత పాఠాలు నేర్పిందని చాహర్ పేర్కొన్నాడు. గత కొన్ని సంవత్సరాలు అనుకోని పాఠాలు నేర్పాయని, గత పదిహేను నెలలు కోర్టు ప్రక్రియలతో గడిచాయని వివరించాడు. ఈ సమయం తనకు సహనం, ధైర్యం నేర్పిందని అన్నాడు. ఈ అధ్యాయం ఇప్పటికి ముగిసిందని.. ఇకపై స్వాభిమానంతో, శాంతితో, మంచి నిర్ణయాలతో కొత్త జీవితం ప్రారంభిస్తానని తెలిపాడు.
ప్రేమించి పెళ్లి చేసుకొని..!
- రాహుల్–ఇషానీ జోహర్ 2019 డిసెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.
- 2022 మార్చిలో గోవాలో ఓ ప్రైవేట్ వేడుకలో వీరి వివాహం జరిగింది.
- ఇషానీ ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తూ, తరచూ రాహుల్ మ్యాచ్‌లకు హాజరై మద్దతు ఇచ్చేది.
- వారి బంధం సోషల్ మీడియాలో అభిమానుల ప్రశంసలు కూడా అందుకుంది.
- స్పష్టమైన కారణాలేమో తెలియరాలేదు కానీ, చాహర్ ఇవాళ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించి, అందరినీ ఆశ్చర్యపరిచాడు.
విడాకుల తర్వాత రాహుల్ చాహర్ తిరిగి క్రికెట్‌పై దృష్టి కేంద్రీకరించనున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు మాత్రమే తీసిన చాహర్.. తిరిగి ఫామ్‌లోకి రావాలని కృషి చేస్తున్నాడు. చాహర్‌ను 2026 ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 5.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈసారి ఐపీఎల్‌లో సత్తా చాటి తిరిగి టీమిండియా రీఎంట్రీ ఇవ్వాలని చాహర్ భావిస్తున్నాడు.


