పాక్‌ కెప్టెన్‌పై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం | Unconstitutional: Pak Govt Reverses Hockey Captain Ban Over AUS Fiasco | Sakshi
Sakshi News home page

పాక్‌ కెప్టెన్‌పై నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం

Feb 20 2026 3:50 PM | Updated on Feb 20 2026 4:00 PM

Unconstitutional: Pak Govt Reverses Hockey Captain Ban Over AUS Fiasco

పాకిస్తాన్‌ హాకీ జట్టు కెప్టెన్‌ షకీల్‌ అమ్మాద్‌ బట్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆ దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతడి పట్ల పాకిస్తాన్‌ హాకీ సమాఖ్య (PHF) మాజీ అధ్యక్షుడు వ్యవహరించిన తీరు అక్రమమని.. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఒకప్పుడు తోపు
కాగా పాక్‌ హాకీ పురుషుల జట్టుకు ఘనమైన చరిత్ర ఉంది. నాలుగుసార్లు ప్రపంచ కప్‌ విజేత, మూడు ఒలింపిక్‌ స్వర్ణాలు సహా ఎన్నో ప్రతిష్టాత్మక విజయాలు సాధించింది ఆ జట్టు. అయితే, గత కొన్నేళ్లుగా రోజురోజుకీ దిగజారి పోతోంది. 

అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భాగంగా పాక్‌ జట్టు ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వరుస ఓటములతో చతికిలపడింది. దీంతో తాజా ఎడిషన్లో ఆడిన మ్యాచ్‌లన్నీ ఓడి పాయింట్ల పట్టికన అట్టడుగున నిలిచింది.

ప్లేట్లు కడిగి మ్యాచ్‌కు వెళ్లాం
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో తమకు ఎదురైన చేదు అనుభవాల ఫలితమే వరుస ఓటములకు కారణమంటూ కెప్టెన్‌ అమ్మాద్‌ బట్‌ సంచలన ఆరోపణలు చేశాడు. హోటల్‌లో తమకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని తెలిపాడు. కిచెన్‌ను తామే శుభ్రపర్చుకున్న తర్వాతే మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లాల్సి వచ్చిందని వాపోయాడు.

స్వదేశానికి తిరిగి రాగానే పాకిస్తాన్‌ హాకీ సమాఖ్య (పీహెచ్‌ఎఫ్‌)పై అమ్మాద్‌ తీవ్ర విమర్శలు చేశాడు. ‘ప్రస్తుత పీహెచ్‌ఎఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంకా కొనసాగితే మేం ఆడటం కష్టం. ప్లేట్‌లు కడిగి కిచెన్‌ను శుభ్రం చేసుకున్న తర్వాతే మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ఇంకా మా వైపు నుంచి ఎలాంటి ఫలితాలు ఆశిస్తారు.

బహిరంగంగా చెప్పాల్సి వస్తోంది
దాదాపు 13–14 గంటల పాటు రోడ్డుపై వేచి చూసిన తర్వాత మాకు హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. మేం టోర్నీ కోసం అక్కడ 13 రోజులు ఉండాల్సి ఉంటే 10 రోజుల కోసమే హోటల్‌ను బుక్‌ చేశారు. దాంతో తర్వాతి మూడు రోజుల కోసం చవకైన మరో హోటల్‌కు మారాల్సి వచింది. ఎంతో ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాం కాబట్టే ఇప్పుడు బహిరంగంగా చెప్పాల్సి వస్తోంది’ అని షకీబ్‌ బట్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం
ఈ పరిణామాలపై దేశ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌కు  పాకిస్తాన్‌ స్పోర్ట్స్‌ బోర్డు ప్రత్యేక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో PHF అధ్యక్షుడు తారిఖ్‌ బుగ్టీ గురువారం తన పదవికి రాజీనామా చేశాడు. అయితే, అంతకంటే ముందు అమ్మాద్‌పై రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు. దీంతో మరోసారి పాక్‌ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

నిషేధం ఎత్తివేసిన ప్రభుత్వం
ఈ క్రమంలో పాక్‌ ప్రభుత్వం వేగంగా స్పందించింది. PHF తాత్కాలిక అధ్యక్షుడిగా సీనియర్‌ బ్యూరోక్రాట్‌ ముహుయుదీన్‌ వనీని నియమించింది. ఈ నేపథ్యంలో పగ్గాలు చేపట్టగానే ముహుయుదీన్‌ తొలుత అమ్మాద్‌ గురించే ప్రకటన చేశారు. 

అమ్మాద్‌పై నిషేధం విధిస్తూ బుగ్టీ తీసుకున్న నిర్ణయం అక్రమం, రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. వెంటనే అతడిపై నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్‌ హాకీకి జరిగిన నష్టాన్ని పూడ్చి.. త్వరలోనే పరిస్థితులు చక్కదిద్దుతామని తెలిపారు.

చదవండి: T20 WC: ‘పీసీబీ చీఫ్‌ రెచ్చగొట్టడం వల్లే.. నష్టపోయాము’

Advertisement
 
Advertisement
Advertisement