పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మొహమ్మద్ ఆమిర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా సెమీస్ చేరే అవకాశాలు లేవంటూ అక్కసు వెళ్లగక్కాడు. కాగా వరల్డ్‌కప్ ఈవెంట్లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్ టాపర్లుగా సూపర్-8కు చేరుకున్నాయి.
లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లను ఓడించి టీమిండియా అజేయంగా నిలవగా.. పాక్ నెదర్లాండ్స్, అమెరికా, నమీబియాలపై గెలిచినా భారత్ చేతిలో మరోసారి ఓటమిపాలైంది. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాక్‌పై భారత్ ఆధిపత్యం 8-1కు పెరిగింది.
పాక్‌కు పోటీనిచ్చిన అమెరికా
ఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో నమీబియా సులువుగానే లొంగినా.. అమెరికా, నెదర్లాండ్స్ మాత్రం భారత్, పాకిస్తాన్‌లకు మంచి పోటీనిచ్చాయి. ముఖ్యంగా అమెరికా.. ఈ దాయాది జట్లకు కఠిన సవాలు విసిరింది.
ఇక పాకిస్తాన్‌కు అయితే సూపర్-8 చేరే క్రమంలో గట్టిపోటీదారుగా నిలిచింది. ఏదేమైనా గాయాల బెడద వేధించినా టీమిండియా ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. పాక్ ఎలాగోలా గట్టెక్కి ఊపిరి పీల్చుకుంది.
ఇక సూపర్-8లో భారత్.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లతో తలపడనుండగా.. పాకిస్తాన్ న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక జట్లను ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో మొహమ్మద్ ఆమిర్ పాక్ స్థానిక మీడియాలో మాట్లాడుతూ..

ఆ రెండు జట్లు సెమీస్‌కి
‘‘పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తప్ప లీగ్ దశలో ప్రతి మ్యాచ్‌లోనూ టీమిండియా బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. కాబట్టి ఆ జట్టుకు అవకాశాలు లేవు. మరోవైపు.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాయి. ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఆ జట్లకు ఉంది. కాబట్టి సెమీస్ చేరే అవకాశాలు వీటికే ఉన్నాయి’’ అని పేర్కొన్నాడు.
మీ సంగతి చూసుకోండి
దీంతో ఆమిర్ వ్యాఖ్యలపై టీమిండియా అభిమానులు మండిపడుతున్నారు. ‘‘భారత్ తిరుగులేని జట్టు.. సూర్యసేనను కించపరిచాలని చూస్తే ఊరుకునేది లేదు’’ అని హెచ్చరిస్తున్నారు. ‘‘ముందు మీ జట్టు (పాక్) సంగతి చూసుకోండి.. గత ఎడిషన్‌లో అమెరికా చేతిలో ఓడి లీగ్ దశలోనే ఇంటిబాట పట్టిన విషయం మర్చిపోవద్దు’’ అంటూ ఆమిర్‌కు చురకలు అంటిస్తున్నారు.
కాగా సూపర్-8లో గ్రూప్-1 నుంచి భారత్, జింబాబ్వే, సౌతాఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడుతుండగా.. గ్రూప్-2 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తాన్ బరిలో ఉన్నాయి. ఇక 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ వరుస విజయాలు సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో 2026 వరల్డ్‌కప్ టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా రంగంలోకి దిగింది.
చదవండి: T20 WC: ఆసీస్‌ను మేమూ చిత్తుగా ఓడిస్తాం: ఒమన్ కెప్టెన్


