సూపర్‌-8లో తొలి మ్యాచ్‌ గెలుస్తాం: సికందర్‌ రజా | We can win 1st game of Super 8: Sikandar Raza After Win On Sri Lanka | Sakshi
Sakshi News home page

WI vs ZIM: సూపర్‌-8లో తొలి మ్యాచ్‌ గెలుస్తాం: సికందర్‌ రజా

Feb 20 2026 8:55 AM | Updated on Feb 20 2026 9:25 AM

We can win 1st game of Super 8: Sikandar Raza After Win On Sri Lanka

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో పసికూన జింబాబ్వే అంచనాలకు మించి రాణిస్తోంది. గ్రూప్‌-బిలో తొలుత ఒమన్‌ను మట్టికరిపించిన రజా బృందం.. ఆ తర్వాత మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు ఊహించని రీతిలో షాకిచ్చింది.

గెలుపు గాలివాటం కాదు
తదుపరి ఐర్లాండ్‌తో మ్యాచ్‌ రద్దు కావడంతో ఎలాంటి ఆటంకం లేకుండా సూపర్‌-8కు అర్హత సాధించింది. తద్వారా ఆస్ట్రేలియాను ఎలిమినేట్‌ చేసిన జింబాబ్వే.. లీగ్‌ దశలో ఆఖరిగా పటిష్ట శ్రీలంకతో తలపడింది. అనూహ్య రీతిలో ​కొలంబో వేదికగా గురువారం శ్రీలంకను సైతం ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసిన రజా బృందం.. తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించింది.

ఇక్కడితో ఆగిపోము
సగర్వంగా గ్రూప్‌-బి టాపర్‌గా సూపర్‌-8లో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా జింబాబ్వే కెప్టెన్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ సికందర్‌ రజా హర్షం వ్యక్తం చేశాడు. ‘‘ఇక్కడితో ఆగిపోము. మా దృష్టి రాబోయే మ్యాచ్‌లపై ఉంది. ప్రస్తుతానికి ఒక్కో మ్యాచ్‌లో ప్రదర్శనను విశ్లేషించుకుంటూ ముందుకు పోతున్నాం.

మున్ముందు ఏదైనా సాధ్యమే
అన్ని పరిస్థితులకు తగినట్లుగా సిద్ధమయ్యాం. తమ బాధ్యతలపై జట్టులో అందరికీ స్పష్టత ఉంది. తాజా ప్రదర్శనతో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉత్సాహం పెరిగింది. లీగ్‌ దశలో మా ప్రదర్శనను బట్టి చూస్తే మున్ముందు ఏదైనా సాధ్యమే. అంచనాలకు భిన్నంగా సాగే సంచలన కథనాలు అందరినీ ఆకర్షిస్తాయి కదా!..

మా తొలి మ్యాచ్‌లో గెలవవచ్చు కూడా!
సూపర్‌-8లో మేము మా తొలి మ్యాచ్‌లో గెలవవచ్చు కూడా!.. మా అభిమానుల గుండెల్లో మా స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాము. గ్రూప్‌ దశలో అజేయంగా నిలవడం గర్వంగా ఉంది. ముందుగా చెప్పినట్లు అండర్‌డాగ్‌ స్టోరీస్‌ అందరికీ ఆకర్షిస్తాయి. 23 నాటి మ్యాచ్‌ మాకు షో టైమ్‌’’ అని సికందర్‌ రజా ఉద్వేగానికి లోనయ్యాడు.

కాగా సూపర్‌-8లో భాగంగా జింబాబ్వే ఫిబ్రవరి 23న వెస్టిండీస్‌ను ఢీకొట్టనుంది. అనంతరం ఫిబ్రవరి 26న భారత్‌, మార్చి 1న సౌతాఫ్రికాతో తలపడుతుంది. జింబాబ్వేతో పాటు ‍ఈ ప్రత్యర్థి జట్లన్నీ లీగ్‌ దశను అజేయంగా ముగించడం విశేషం. 

చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో జ‌ర జాగ్ర‌త్త‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement