ఘనంగా ముగించిన అఫ్గానిస్తాన్‌ | Afghanistan beat Canada by 82 runs in T20 World Cup | Sakshi
Sakshi News home page

ఘనంగా ముగించిన అఫ్గానిస్తాన్‌

Feb 20 2026 4:01 AM | Updated on Feb 20 2026 4:01 AM

Afghanistan beat Canada by 82 runs in T20 World Cup

82 పరుగులతో కెనడాపై విజయం  

చెన్నై: 2024 టి20 వరల్డ్‌ కప్‌లో సెమీఫైనల్‌కు చేరినా... ఈ సారి లీగ్‌ దశకే పరిమితమైన అఫ్గానిస్తాన్‌ భారీ గెలుపుతో టోర్నీని ముగించింది. గ్రూప్‌ ‘డి’లో బలమైన జట్లు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల చేతిలో పరాజయంతో ‘సూపర్‌ ఎయిట్స్‌’ అవకాశాలు కోల్పోయిన అఫ్గానిస్తాన్‌ ... కెనడాతో గురువారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో గెలిచింది. 

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఇబ్రహీమ్‌ జద్రాన్‌ (56 బంతుల్లో 95 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)... సాదిఖుల్లా (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), గుర్బాజ్‌ (20 బంతుల్లో 30; 5 ఫోర్లు) మెరిపించారు. కెనడా బౌలర్లలో జస్కరణ్‌ సింగ్‌ 3 వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం కెనడా 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులే చేయగలిగింది. హర్ష్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్‌), సాద్‌ బిన్‌ (28; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. నబీ 4 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రషీద్‌ ఖాన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌లూ ఓడిన రెండో జట్టుగా (నమీబియాతో పాటు) కెనడా నిలిచింది.  

అంతర్జాతీయ టి20ల్లో కెనడా తరఫున అత్యధిక పరుగులు (1305) సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందిన నవనీత్‌ ధలివాల్‌ ఈ మ్యాచ్‌తో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. మరోవైపు గత నాలుగేళ్లుగా అఫ్గానిస్తాన్‌ను బలమైన జట్టుగా తీర్చిదిద్ది టీమ్‌ సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించిన హెడ్‌ కోచ్‌ జొనాథన్‌ ట్రాట్‌ కూడా ఈ మ్యాచ్‌ తర్వాత తన పదవి నుంచి తప్పుకుంటున్నాడు.  

టి20 ప్రపంచకప్‌లో నేడు
ఆస్ట్రేలియా X  ఒమన్‌
వేదిక: పల్లెకెలె; రాత్రి గం. 7 నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement