టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ అఫ్గానిస్తాన్ అద్భుతమైన విజయంతో ముగించింది. చెన్నై వేదికగా కెనడాతో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో రషీద్ సేన ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ మరోసారి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. జద్రాన్ 56 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లతో 95 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు సెదికుల్లా అటల్(44), రెహ్మనుల్లా గుర్బాజ్(30) రాణించారు. కెనడా బౌలర్లలో జస్కరన్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా.. డిలాన్ హీలిగర్ ఓ వికెట్ సాధించాడు.
నబీ మ్యాజిక్
అనంతరం 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 118 పరుగులకే పరిమితమైంది. అఫ్గాన్ స్పిన్నర్ మహ్మద్ నబీ నాలుగు వికెట్లు పడగొట్టి కెనడాను దెబ్బ తీశాడు. అతడితో పాటు రషీద్ ఖాన్ రెండు, ముజీబ్, అజ్మతుల్లా తలా వికెట్ సాధించారు.
కెనడా బ్యాటర్లలో హర్ష్ ఠాకర్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.మిగిలిన బ్యాటర్లు ఎవరూ అఫ్గాన్ బౌలింగ్‌ను ఎదుర్కొలేకపోయారు. కాగా ఇప్పటికే అఫ్గాన్ జట్టు కివీస్, సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలై సూపర్-8కు అర్హత సాధించలేకపోయింది. మరోవైపు అఫ్గానిస్తాన్ హెడ్‌కోచ్‌గా జోనాథన్ ట్రాట్ ప్రయాణం ముగిసింది. టీ20 ప్రపంచకప్ తర్వాత తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు ట్రాట్ ముందే ప్రకటించాడు.


