T20 WC 2026: ఏ జట్లకు సెమీస్‌ అవకాశాలు..? | T20 WC 2026: What are the teams which may have semis chances? | Sakshi
Sakshi News home page

T20 WC 2026: ఏ జట్లకు సెమీస్‌ అవకాశాలు..?

Feb 19 2026 5:06 PM | Updated on Feb 19 2026 5:09 PM

T20 WC 2026: What are the teams which may have semis chances?

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో మరికొన్ని మ్యాచ్‌లు మిగిలుండగానే సూపర్‌-8 బెర్త్‌లు ఖరారయ్యాయి. గ్రూప్‌-ఏ నుంచి భారత్‌, పాకిస్తాన్‌.. గ్రూప్‌-బి నుంచి శ్రీలంక, జింబాబ్వే.. గ్రూప్‌-సి నుంచి వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌.. గ్రూప్‌-డి నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌ ఫైనల్‌-8కి అర్హత సాధించాయి.

సూపర్‌-8 దశలో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌, భారత్‌, జింబాబ్వే గ్రూప్‌ 1లో ఉండగా.. ఇంగ్లండ్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, న్యూజిలాండ్‌ గ్రూప్‌ 2లో ఉన్నాయి. సూపర్‌-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 22 నుంచి ప్రారంభమవుతాయి. గ్రూప్‌ 1 మ్యాచ్‌లన్నీ భారత్‌లో జరుగనుండగా.. గ్రూప్‌ 2 మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరుగుతాయి. సెమీస్‌, ఫైనల్స్‌ వేదికలు ఇంకా ఖరారు కాలేదు.

సూపర్‌-8 సమరాలకు సర్వం సిద్దమైన వేల ఏయే జట్లు సెమీస్‌కు చేరతాయన్న చర్చ జోరందుకుంది. ఈ టాపిక్‌పై ఎవరి అంచనాలు వారికున్నా, ఒక్క విషయం మాత్రం స్పష్టమవుతుంది. ఫైనల్‌-4కు చేరడం ఏ జట్టుకూ అంత ఈజీగా అయితే కనిపించడం లేదు. సూపర్‌-8 దశకు చేరాయంటేనే ఆ జట్ల సత్తా ఏంటో ఇదివరకే నిరూపితమైనట్లు. అలాంటిది టగ్‌ ఆఫ్‌ వార్‌ ఫైట్లలో అన్నీ జట్లు శక్తివంచన లేకుండా పోరాడటం ఖాయంగా కనిపిస్తుంది.

సూపర్‌ 8 దశలో రెండు గ్రూప్‌ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్‌కు చేరతాయి. ఇరు గ్రూప్‌ల్లో ఆ రెండు బెర్త్‌ల కోసం అన్ని జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తుంది.

గ్రూప్‌ 1 విషయానికొస్తే.. ఈ గ్రూప్‌ నుంచి భారత్‌, సౌతాఫ్రికా హాట్‌ ఫేవరెట్లుగా కనిపిస్తున్నప్పటికీ.. వెస్టిండీస్‌, జింబాబ్వేను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ముఖ్యంగా విండీస్‌ విషయంలో ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా మిగతా జట్లు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. 

విండీస్‌ ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనలు చేస్తూ, పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. పైగా   గ్రూప్‌ దశలో ఈ జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించి జోష్‌లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విండీస్‌తో ఏమరపాటుగా ఉంటే సౌతాఫ్రికా ప్రపంచకప్‌ కల ఈసారి కూడా కలగానే మిగిలిపోతుంది.

ఎందుకంటే, ప్రస్తుతం భారత్‌ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే జింబాబ్వే, వెస్టిండీస్‌, సౌతాఫ్రికా జట్లకు ఓడించడం అంత కష్టం కాకపోవచ్చు. పైగా టీమిండియాకు హోం అడ్వాంటేజ్‌ కూడా ఉంది. కాబట్టి భారత్‌ ఫైనల్‌-4కు చేరడం నల్లేరుపై నడకే అవుతుంది. 

ఇక మిగిలిన రెండో బెర్త్‌ కోసం ముక్కోణపు పోటీ ఉండే అవకాశం ఉంది. జింబాబ్వే సహా ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. జింబాబ్వే గ్రూప్‌ దశలో మాజీ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టికరిపించి, తామేంటో ఈసారి ప్రపంచానికి చూపిస్తామని ఛాలెంజ్‌ చేసింది. 

మరోపక్క సౌతాఫ్రికా సమతూకమైన, పటిష్టమైన జట్టుతో గత ఎడిషన్‌లో తృటిలో మిస్‌ అయిన టైటిల్‌ కోసం ఆకలితో ఎదురుచూస్తుంది. విండీస్‌ గురించి ఇదివరకే మాట్లాడుకున్నాం. ఈ జట్టు మూడోసారి టైటిల్‌ సాధించి, క్రికెట్‌ ప్రపంచానికి షాకివ్వాలని ఉవ్విళ్లూరుతుంది. 

గ్రూప్‌ 1 నుంచి అండర్‌ డాగ్‌ ఏ జట్టు అంటే విండీస్‌ పేరు చెప్పాలి. జట్టు పరంగా చూసినా, ప్రస్తుత విండీస్‌ జట్టు గతంలో స్టార్లతో నిండిన జట్టు కంటే పటిష్టంగా కనిపిస్తుంది. షాయ్‌ హోప్‌ సారథ్యంలో ఈ జట్టు నూతనోత్సహంతో పూర్వవైభవం దిశగా ఉరకలేస్తుంది. హోప్‌ సహా హెట్‌మైర్‌, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌, రొమారియో షెపర్డ్‌, జేసన్‌ హోల్డర్‌, మోటీ, షమార్‌ జోసఫ్‌ సూపర్‌-8 దశలో సంచలన ప్రదర్శనలతో చెలరేగే అవకాశం ఉంది.

గ్రూప్‌ 2 విషయానికొస్తే.. ఈ గ్రూప్‌ గ్రూప్‌ 1 కంటే ప్రమాదకరంగా ఉంది. పాక్‌ మినహా మిగతా మూడు జట్లు సెమీస్‌ రేసులో నువ్వా-నేనా అన్నట్లు ముందుకు సాగే అవకాశం ఉంది. ఈ గ్రూప్‌లో తక్కువ అంచనా వేయడానికి వీల్లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది. 

ఈ జట్టు సెమీస్‌కు చేరడమే కాదు, తమ తొలి ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పేపర్‌పై ఈ జట్టు సాదాసీదాగా కనిపించినా, పోరాటపటిమ వారిని ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రమాదకరమైన జట్టుగా నిలబెడుతుంది. 

ఇటీవల భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆ జట్టు పోరాటాన్ని ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదు. పైగా ఈ జట్టులోకి చాలామంది ఆటగాళ్లకు ఉపఖండపు పిచ్‌లపై ఆడిన అనుభవం కూడా ఉంది. భారత్‌ తర్వాత అత్యధిక హోం అడ్వాంటేజ్‌ లభించే జట్టు ఏదైనా ఉందా అంటే అది న్యూజిలాండే అవుతుంది.

ఈ గ్రూప్‌ నుంచి మరో అండర్‌ డాగ్‌గా శ్రీలంకను చెప్పుకోవాలి. ఎందుకంటే, ఈ జట్టుకు కూడా హోం అడ్వాంటేజ్‌ ఉంది. ప్రదర్శనల ఆధారంగా చూసినా, ఈ జట్టు గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి ఉత్సాహంగా కనిపిస్తుంది. జట్టు పరంగా చూస్తే.. వీరు పేపర్‌పై బలంగా కనిపించకపోయినా, తమదైన రోజున ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ను మట్టికరిపించగల సమర్దులు. 

కాబట్టి ఈ గ్రూప్‌ నుంచి న్యూజిలాండ్‌తో పాటు శ్రీలంకను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ గ్రూప్‌ హాట్‌ ఫేవరెట్‌ ఇంగ్లండ్‌ విషయానికొస్తే.. చెప్పుకోవడానికి మాత్రమే ఇది ఈ గ్రూప్‌లో హాట్‌ ఫేవరెట్‌ అవుతుంది. ఎందుకంటే, ఈ జట్టుకు మిగతా మూడు జట్ల నుంచి టఫ్‌ ఫైట్‌ ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ జట్టు గ్రూప్‌ దశలో పసికూనలపై గెలిచేందుకు కూడా తీవ్రంగా శ్రమించింది. 

పేపర్‌పై బలంగా కనిపిస్తున్నా, కీలక ఆటగాళ్లు ఇప్పటివరకు సామర్థ్యం మేరకు రాణించలేదు. సూపర్‌-8 దశలో కీలక ఆటగాళ్లు టచ్‌లోకి వస్తే.. ఇంగ్లండ్‌ను సెమీస్‌కు చేరకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇక ఈ గ్రూప్‌లో అత్యంత బలహీనమైన, ఏమాత్రం అంచనాలు లేని జట్టు ఏదైనా ఉందా అంటే అది పాకిస్తానే​. అతికష్టం మీద సూపర్‌-8కు అర్హత సాధించిన ఈ జట్టు.. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ లాంటి పటిష్టమైన జట్లను కాదని ముందుకు వెళ్లడం దాదాపుగా అసంభవమేనని చెప్పాలి.

ఓవరాల్‌గా చూస్తే.. గ్రూప్‌ 1 నుంచి సెమీస్‌ రేసులో భారత్‌ హాట్‌ ఫేవరెట్‌ కాగా.. రెండో బెర్త్‌ కోసం​ సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ మధ్య తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉంది. గ్రూప్‌ 2 నుంచి ఏ జట్టునూ హాట్‌ ఫేవరెట్‌ అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక జట్ల మధ్య ముక్కోణపు పోటీ ఉండవచ్చు.

 

Advertisement
 
Advertisement
Advertisement