భారత యువ క్రికెట్ తరంగం వైభవ్ సూర్యవంశీ పద్నాలుగేళ్ల వయసులోనే ఎన్నో అద్భుతాలు చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత పిన్న వయసులోనే విధ్వంసకర శతకం బాదిన ఈ బిహారీ పిల్లాడు.. యూత్ వన్డే, టెస్టుల్లోనూ శతకాల మోత మోగించాడు.
ఇటీవల అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీ-2026లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో ఫైనల్లో మెరుపు, భారీ శతకం (80 బంతుల్లో 175) బాది.. భారత్ ఆరో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు.
ఐపీఎల్-2026కు సన్నద్ధం
ఇక వైభవ్ సూర్యవంశీ తదుపరి ఐపీఎల్-2026లో భాగంగా రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. అంతకంటే ముందు అతడు పదో తరగతి పరీక్షలు రాయాల్సి ఉంది. తొలుత వైభవ్ పరీక్షలకు హాజరవుతాడని.. ఇందుకోసం ఆటకు విరామం ఇస్తాడనే వార్తలు వచ్చాయి.
పరీక్షలకు దూరం
అయితే, వైభవ్ చదివే స్కూల్ డైరెక్టర్ మాత్రం అతడు ఈ ఏడాది పరీక్షలకు హాజరు కావడం లేదని వెల్లడించారు. ఈ విషయాన్ని వైభవ్ సూర్యవంశీ తండ్రి సంజీవ్ సూర్యవంశీ తాజాగా ధ్రువీకరించారు. ‘మిడ్‌డే’తో మాట్లాడుతూ..
అవును.. మాకు అదే ముఖ్యం
‘‘అవును.. నా కుమారుడు ప్రస్తుతం నాగ్‌పూర్‌లో రాజస్తాన్ రాయల్స్ జట్టుతో కలిసి క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈసారి వైభవ్ పరీక్షల గురించి చాలా చర్చ నడుస్తోంది. అందుకే అతడు పరీక్షలు రాయకూడదని నిర్ణయించుకున్నాడు.
వచ్చే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తాడు. ఈ ఏడాది ఒకవేళ పరీక్షలకు హాజరైనా అతడు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయేవాడు. ఒత్తిడిలో ఏ పనీ చేయకూడదు. నిజానికి చదువులో వైభవ్ ఎప్పుడూ ముందే ఉంటాడు.
అన్ని సబ్జెక్టులలోనూ వాడికి 90 శాతానికి పైగా మార్కులు వచ్చేవి. అయితే, ఇప్పుడు మా ప్రాధాన్యం క్రికెట్ మాత్రమే’’ అని సంజీవ్ సూర్యవంశీ స్పష్టం చేశారు.
కాగా మంగళవారం సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలో భాగంగా వైభవ్ బిహార్‌లో ఉన్న పోదార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఎగ్జామ్‌కు హాజరుకావాల్సింది. అయితే, అతడు పరీక్షా కేంద్రానికి రాలేదని.. అతడికి ఆబ్సెంట్ వేశామని పాఠశాల ప్రిన్సిపల్ ఎన్‌కే సిన్హా ANIకి తెలిపారు.


