మాజీ చాంపియన్ ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఘోర పరాభవం ఎదురైంది. పేలవ ప్రదర్శనతో తేలిపోయిన కంగారూలు.. పసికూన జింబాబ్వేతో పాటు శ్రీలంక చేతిలో ఓటమి పాలయ్యారు. ఫలితంగా కనీసం లీగ్ దశ దాటకుంటానే ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఈ నేపథ్యంలో మిచెల్ మార్ష్ బృందంపై ఇంటా బయటా విమర్శల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో భాగమైన ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ (Glenn Maxwell) గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. మాక్సీ పని అయిపోయిందని.. ఇకపై అతడు ఆసీస్ టీ20 జట్టులో ఉండబోడని జోస్యం చెప్పాడు.
అతడి ఖేల్ ఖతం.. కెరీర్ ముగిసినట్లే
ముఖ్యంగా లాస్ ఏంజెల్స్ 2028 ఒలింపిక్స్ (LA28 Olympics)లో మాక్సీ పాల్గొనే అవకాశాలు శూన్యమని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఐసీసీ షోలో మాట్లాడుతూ.. ‘‘గ్లెన్ మాక్స్‌వెల్.. నాకైతే అతడి కెరీర్ చరమాంకానికి చేరుకుందని అనిపిస్తోంది. అతడు కచ్చితంగా ఒలింపిక్స్ జట్టులో మాత్రం ఉండడు’’ అని పాంటింగ్ కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేశాడు.

దారుణంగా విఫలం
అయితే, కెప్టెన్ మిచెల్ మార్ష్, ట్రవిస్ హెడ్ మాత్రం తప్పక ఒలింపిక్స్‌లో ఆడతారని పాంటింగ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా 37 ఏళ్ల గ్లెన్ మాక్స్‌వెల్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్. టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీలో మాక్సీ ఇప్పటికి ఆడిన మూడు మ్యాచ్‌లలో కలిపి కేవలం 62 పరుగులే చేశాడు.
ఇక గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా తొలుత ఐర్లాండ్‌పై గెలిచింది. ఆ తర్వాత జింబాబ్వే, శ్రీలంక చేతిలో పరాజయం పాలైంది. లీగ్ దశలో మిగిలిన నామమాత్రపు మ్యాచ్‌లో ఒమన్‌తో శుక్రవారం ఆసీస్ తలపడుతుంది. ఇందుకు శ్రీలంకలోని పల్లెకెలె వేదిక. కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వరల్డ్‌కప్ టోర్నీ ఫిబ్రవరి 7న మొదలైంది. మార్చి 8న ఫైనల్‌తో ముగుస్తుంది.
చదవండి: విధ్వంసకర ఓపెనర్ కాదు!.. ‘డకౌట్ల’ అభిషేక్.. గావస్కర్ కీలక వ్యాఖ్యలు


