టీమిండియా అదుర్స్‌.. అజేయంగా... అగ్రస్థానంతో | T20 World Cup 2026: Team India wins against Netherlands | Sakshi
Sakshi News home page

T20 World Cup 2026: అజేయంగా... అగ్రస్థానంతో

Feb 18 2026 10:39 PM | Updated on Feb 19 2026 9:09 AM

T20 World Cup 2026: Team India wins against Netherlands
  • చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ భారత్‌ విజయం 
  • 17 పరుగులతో నెదర్లాండ్స్‌ ఓటమి
  • శివమ్‌ దూబే ఆల్‌రౌండ్‌ ప్రదర్శన 
  • 22న దక్షిణాఫ్రికాతో టీమిండియా ‘సూపర్‌–8’ మ్యాచ్‌  

అహ్మదాబాద్‌: టి20 వరల్డ్‌ కప్‌లో లీగ్‌ దశను భారత జట్టు నాలుగు వరుస విజయాలతో అజేయంగా ముగించింది. గ్రూప్‌ ‘ఎ’లో ఆడిన అన్ని మ్యాచ్‌లూ గెలిచి అగ్రస్థానంతో ‘సూపర్‌ ఎయిట్స్‌’కు సిద్ధమైంది. బుధవారం జరిగిన పోరులో భారత్‌ 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై నెగ్గింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 

ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శివమ్‌ దూబే (31 బంతుల్లో 66; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు.  కెపె్టన్‌ సూర్యకుమార్‌ (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్‌), తిలక్‌ వర్మ (27 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్‌), హార్దిక్‌ పాండ్యా (21 బంతుల్లో 30; 3 సిక్స్‌లు) మెరిపించారు. అనంతరం నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 176 పరుగులు చేసి ఓడిపోయింది. ‘సూపర్‌ ఎయిట్స్‌’లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో భారత్‌ తలపడుతుంది.  

చివరి 5 ఓవర్లలో 75... 
భారత్‌ టాప్‌–3 కూడా ఎడంచేతివాటం బ్యాటర్లు కావడంతో ఆఫ్‌స్పిన్నర్‌ ఆర్యన్‌ దత్‌తో తొలి ఓవర్‌ వేయించి నెదర్లాండ్స్‌ చేసిన ప్రయోగం బాగా పని చేసింది. మూడో బంతికే అభిషేక్‌ శర్మ (0) బౌల్డ్‌ కాగా, ఇషాన్‌ కిషన్‌ (7 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా ఆర్యన్‌ రెండో ఓవర్లో బౌల్డ్‌ అయ్యాడు. మరోవైపు తిలక్‌ కొన్ని చక్కటి షాట్లు ఆడటంతో పవర్‌ప్లేలో స్కోరు 51/2కు చేరింది. 

అయితే ఈ దశలో డచ్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో వరుసగా 20 బంతుల పాటు బౌండరీనే రాలేదు! వ్యక్తిగత స్కోరు 13 వద్ద లెవిట్‌ క్యాచ్‌ వదిలేయడంతో సూర్యకు లైఫ్‌ లభించింది. అయితే అదే ఓవర్లో తిలక్‌ వెనుదిరిగాడు. అనంతరం 2 పరుగుల వద్ద ఎల్బీ అప్పీల్‌పై ‘అంపైర్స్‌ కాల్‌’తో బతికిపోయిన దూబే ఆపై చెలరేగిపోయాడు. 

అకెర్‌మన్‌ ఓవర్లో అతను 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదాడు. నాలుగో వికెట్‌కు దూబేతో 76 పరుగులు (35 బంతుల్లో) జోడించిన తర్వాత సూర్య అవుటయ్యాడు. 15 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోరు 118/4. ఇక్కడి నుంచి దూబే, పాండ్యా ధాటిగా ఆడటంతో చివరి 5 ఓవర్లలో భారత్‌ 8 సిక్స్‌లు, 3 ఫోర్లతో 75 పరుగులు జోడించడం విశేషం. వాన్‌ బీక్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌ బాదిన దూబే 25 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  

టపటపా... 
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నెదర్లాండ్స్‌ బ్యాటింగ్‌లో ఏ దశలోనూ దూకుడు కనిపించలేదు. పవర్‌ప్లేలో 36/1తో ఉన్న జట్టు స్కోరు సగం ఓవర్లు ముగిసేసరికి 72/2కు చేరింది. అయితే తర్వాత 31 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 కీలక వికెట్లు కోల్పోయిన డచ్‌ వేగంగా ఓటమి వైపు సాగింది. కాషెట్‌ (26), క్రోస్‌ (25 నాటౌట్‌) చివర్లో 23 బంతుల్లో 47 పరుగులు జోడించి కొంత పోరాడినా...అప్పటికే ఆలస్యమైపోయింది.

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ (బి) దత్‌ 0; ఇషాన్‌ (బి) దత్‌ 18; తిలక్‌ (సి) మెర్వ్‌ (బి) వాన్‌ బీక్‌ 31; సూర్య (సి) (సబ్‌) గగ్‌టెన్‌ (బి) క్లీన్‌ 34; దూబే (సి) (సబ్‌) గగ్‌టెన్‌ (బి) బీక్‌ 66; పాండ్యా (సి) మెర్వ్‌ (బి) బీక్‌ 30; రింకూ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–0, 2–39, 3–69, 4–110, 5–186, 6–193. బౌలింగ్‌: ఆర్యన్‌ దత్‌ 4–0–19–2, వాన్‌ బీక్‌ 4–0–56–3, అకెర్‌మన్‌ 3–0–36–0, కైల్‌ క్లీన్‌ 4–0–38–1, డి లీడ్‌ 4–0–28–0, వాన్‌డర్‌ మెర్వ్‌ 1–0–15–0. 

నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌: లావిట్‌ (సి) సుందర్‌ (బి) పాండ్యా 24; డౌడ్‌ (బి) వరుణ్‌ 20; డి లీడె (సి) వరుణ్‌ (బి) దూబే 33; అకెర్‌మన్‌ (సి) రింకూ (బి) వరుణ్‌ 23; దత్‌ (బి) వరుణ్‌ 0; ఎడ్వర్డ్స్‌ (బి) బుమ్రా 15; కాషెట్‌ (సి) వాషింగ్టన్‌ సుందర్‌ (బి) దూబే 26; క్రోస్‌ (నాటౌట్‌) 25; బీక్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–35, 2–51, 3–94, 4–94, 5–112, 6–125, 7–172. బౌలింగ్‌: అర్ష్ దీప్ 3–0–22–0, బుమ్రా 3–0–17–1, సుందర్‌ 4–0–36–0, వరుణ్‌ 3–0–14–3, పాండ్యా 3–0–40–1, అభిషేక్‌ 1–0–10–0, దూబే 3–0–35–2.  

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement