అతడిని కావాలనే తొక్కేస్తున్నారా?: టీమిండియా మాజీ స్టార్‌ ఫైర్‌ | Why are you not getting Varun to bowl his overs: IND Ex Star Questions SKY | Sakshi
Sakshi News home page

అతడిని ఎందుకు ఆపుతున్నారు?: టీమిండియా మాజీ స్టార్‌ ఫైర్‌

Feb 19 2026 2:40 PM | Updated on Feb 19 2026 3:52 PM

Why are you not getting Varun to bowl his overs: IND Ex Star Questions SKY

టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో టీమిండియా మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి నిలకడగా రాణిస్తున్నాడు. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను తిప్పలు పెడుతూ మంచి ఎకానమీతో వికెట్లు తీస్తున్నాడు. ఇప్పటి వరకు లీగ్‌ దశలో భారత్‌ తరఫున నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లూ ఆడాడు వరుణ్‌ చక్రవర్తి.

తొమ్మిది వికెట్లు
అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌.. తాజాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో కలిపి మొత్తంగా 12 ఓవర్లు బౌలింగ్‌ చేసిన వరుణ్‌ చక్రవర్తి.. 5.17 ఎకానమీతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. తద్వారా అత్యధిక వికెట్ల వీరుల జాబితాలో అమెరికా బౌలర్‌ షాడ్లే వాన్‌ షాల్విక్‌ (13 వికెట్లు) తర్వాత.. రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తీరును విమర్శించాడు. వరుణ్‌ చక్రవర్తి సేవలను సరిగ్గా వాడుకోవడంలో సూర్య విఫలమవుతున్నాడని పేర్కొన్నాడు.

వరుణ్‌ విషయంలోనే ఎందుకలా?
‘‘వరుణ్‌ చక్రవర్తిని తన బౌలింగ్‌ కోటా ఎందుకు పూర్తి చేయనివ్వడం లేదు?.. అతడికి తగినన్ని ఓవర్లు ఇవ్వడమే లేదు. అమెరికాతో మ్యాచ్‌లో మాత్రమే వరుణ్‌ తన నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయగలిగాడు.

అప్పుడు సూర్య ఐదుగురు బౌలర్లను మాత్రమే ఉపయోగించాడు కాబట్టి వరుణ్‌కు ఆ అవకాశం దక్కింది. బౌలర్‌ అయిన వరుణ్‌ చక్రవర్తి విషయంలో వ్యవహరించినట్లే జట్టులోని ఏ బ్యాటర్‌ విషయంలోనైనా వ్యవహరించగలరా?

ఓ బ్యాటర్‌ బాగా ఆడుతూ 50-60 పరుగులు సాధించిన తర్వాత.. ‘ఇక చాలు వెళ్లిపో’ అని చెప్పగలరా?.. అస్సలు అలా చేయలేరు కదా!.. ఓ బ్యాటర్‌ 60 బంతులు ఆడగా లేనిది.. ఓ బౌలర్‌ 24 బంతులు బౌల్‌ చేయకూడదా?

నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో అతడి చేతికి మరోసారి బంతి ఇచ్చి ఉంటే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసేవాడు. కానీ అతడిని మీరే ఆపారు’’ అని ఆకాశ్‌ చోప్రా.. సూర్యకుమార్‌ తీరును విమర్శించాడు.  అతడిని కావాలనే తొక్కేస్తున్నారా అన్నట్లుగా ఫైర్‌ అయ్యాడు. 

కాగా నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో వరుణ్‌ చక్రవర్తి మూడు ఓవర్లలో కేవలం 14 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. అతడి ప్రదర్శన వల్లే భారత్‌ 17 పరుగుల తేడాతో గట్టెక్కగలిగింది. 

చదవండి: T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement