శాసించేస్థితిలో జమ్మూకశ్మీర్‌ | Karnataka in danger of follow on in Ranji Trophy final | Sakshi
Sakshi News home page

శాసించేస్థితిలో జమ్మూకశ్మీర్‌

Feb 27 2026 12:59 AM | Updated on Feb 27 2026 12:59 AM

Karnataka in danger of follow on in Ranji Trophy final

నిప్పులు చెరిగిన ఆఖిబ్‌ నబీ

ఫాలోఆన్‌ ప్రమాదంలో కర్ణాటక

తొలి ఇన్నింగ్స్‌లో 220/5 

మరో 364 పరుగుల వెనుకంజ

మయాంక్‌ అజేయ సెంచరీ 

రంజీ ట్రోఫీ ఫైనల్‌  

హుబ్లీ: దేశవాళీ రంజీ టోర్నీలో కర్ణాటకది ఘనమైన చరిత్ర. ఏకంగా 8 టైటిల్స్, 6 సార్లు రన్నరప్‌తో సత్తా చాటుకుంది. ఇలా 14 ఫైనల్స్‌ ఆడిన మేటి దేశవాళీ జట్టుపై తొలిసారి ఫైనల్‌కు వచ్చిన జమ్మూకశ్మీర్‌ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలి రెండు రోజులు బ్యాటింగ్‌తో, మూడో రోజు బౌలింగ్‌తో, ఇలా ఈ మూడు రోజులు జమ్మూ కశ్మీర్‌ ఆల్‌రౌండ్‌ షోనే! ముఖ్యంగా మూడో రోజైతే ఆఖిబ్‌ నబీ (14–3–32–3) ఎంతో అనుభవమున్న కర్ణాటక బ్యాటర్లను హడలెత్తించాడు. 

నిప్పులు చెరిగే బౌలింగ్‌తో టీమిండియా స్టార్‌ కేఎల్‌ రాహుల్‌ (13)ను ఆరంభంలోనే అవుట్‌ చేశాడు. ఆ తర్వాత కరుణ్‌ నాయర్‌ (0), రవిచంద్రన్‌స్మరణ్‌ (0)లను ఖాతానే తెరువనీయలేదు. ఇలా తన పేస్‌ ప్రతాపంతో జమ్మూకశ్మీర్‌ను శాసించే స్థితిలో నిలిపాడు. ప్రత్యర్థి కర్ణాటకకు ఫాలోఆన్‌ ముప్పు తెచ్చిపెట్టాడు. మూడో రోజు ఆట ముగిసేసరికి కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 69 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (207 బంతుల్లో 130 బ్యాటింగ్‌; 17 ఫోర్లు) అజేయ శతకం సాధించాడు. 

ఇంకా రెండు రోజుల ఆట మిగిలుండగా కర్ణాటక 364 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 527/6తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన జమ్మూకశ్మీర్‌ 173.1 ఓవర్లలో 584 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితంరోజు అర్ధసెంచరీ సాధించిన సాహిల్‌ లోత్రా (72; 8 ఫోర్లు) అందుబాటులో ఉన్న ఆఖరి వరుస బ్యాటర్లతో కలిసి జట్టు స్కోరు పెంచాడు. అబిద్‌ ముస్తాక్‌ (28; 3 ఫోర్లు), యుద్‌వీర్‌ సింగ్‌ (30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు కాసేపు పోరాడటంతో జమ్మూకశ్మీర్‌ మరో 57 పరుగులు చేయగలిగింది. ప్రసిధ్‌ కృష్ణకు 5 వికెట్లు దక్కాయి. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన కర్ణాటకను నబీ వణికించాడు. కేఎల్‌ రాహుల్‌ను అవుట్‌ చేసి మయాంక్‌తో ఓపెనింగ్‌ జోడీని విడగొట్టాడు. జట్టు స్కోరు 50 పరుగులు దాటగానే కెప్టెన్ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (11)ను సునీల్‌ కుమార్‌ పెవిలియన్‌ చేర్చాడు. 56/2 స్కోరుతో ఉన్న కర్ణాటకను నబీ తర్వాతి ఓవర్‌ కష్టాల్లోకి నెట్టేసింది. 18వ ఓవర్‌ వేసిన నబీ వరుస బంతుల్లో కరుణ్, స్మరణ్‌లను డకౌట్‌ చేశాడు. పరుగు తేడాతో ఒక్కసారిగా 57/4 స్కోరు వద్ద కర్ణాటక కుదేలైంది. 

ఈ దశలో మయాంక్‌... శ్రేయస్‌ గోపాల్‌ (27; 1 ఫోర్‌) అండతో ఐదో వికెట్‌కు 105 పరుగులు జోడించి కర్ణాటకను ఆదుకున్నాడు. యు«ద్‌వీర్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత కృతిక్‌ కృష్ణ (27 బ్యాటింగ్‌; 2 ఫోర్లు)తో కలిసి మయాంక్‌ జట్టు స్కోరును 200 పైచిలుకు చేర్చాడు. ఈ క్రమంలో శతకాన్ని పూర్తి చేసుకొని అజేయంగా నిలిచాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement