సెమీస్‌లో దక్షిణాఫ్రికా | South Africa beat West Indies by 9 wickets in T20 World Cup | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో దక్షిణాఫ్రికా

Feb 27 2026 1:03 AM | Updated on Feb 27 2026 3:18 PM

South Africa beat West Indies by 9 wickets in T20 World Cup

‘సూపర్‌ ఎయిట్స్‌’లో మరో విజయం

9 వికెట్లతో వెస్టిండీస్‌ చిత్తు 

మార్క్‌రమ్‌ మెరుపు ఇన్నింగ్స్‌  

అహ్మదాబాద్‌: టి20 ప్రపంచకప్‌లో 2024 టోర్నీ రన్నరప్‌ దక్షిణాఫ్రికా దూసుకుపోతోంది. లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన సఫారీ టీమ్‌ ఇప్పుడు ‘సూపర్‌ ఎయిట్స్‌’లో రెండో విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు చెన్నైలో జింబాబ్వేపై భారత జట్టు గెలుపొందడంతో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే దక్షిణాఫ్రికా జట్టుకు సెమీఫైనల్‌ బెర్త్‌ ఖరారైంది. గురువారం జరిగిన ‘గ్రూప్‌–2’ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. 

‘సూపర్‌ ఎయిట్స్‌’లో రెండు విజయాలతో దక్షిణాఫ్రికా నాలుగు పాయింట్లతో గ్రూప్‌–1లో అగ్రస్థానంలో ఉంది. తమ చివరి ‘సూపర్‌–8’ మ్యాచ్‌ను ఢిల్లీలో ఆదివారం జింబాబ్వేతో ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓడిపోయినా ఆ జట్టుకు 4 పాయింట్లు ఉంటాయి. ఆదివారమే కోల్‌కతాలో భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే చివరి ‘సూపర్‌–8’ మ్యాచ్‌లో గెలిచిన జట్టు కూడా నాలుగు పాయింట్లతోనే ముగిస్తుంది.   

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా పేసర్లు ఎన్‌గిడి (3/30), రబాడ (2/22), కార్బిన్‌ బాష్‌ (2/31) చెలరేగడంతో విండీస్‌ 83 పరుగుల వద్దే 7 వికెట్లు కోల్పోయింది. షై హోప్‌ (16), హెట్‌మైర్‌ (2), బ్రెండన్‌ కింగ్‌ (21), ఛేజ్‌ (2), రూథర్‌ఫర్డ్‌ (12), రావ్‌మన్‌ పావెల్‌ (9) పూర్తిగా విఫలమయ్యారు. 

83/7 నుంచి విండీస్‌ జట్టును రొమారియో షెఫర్డ్‌ (37 బంతుల్లో 52 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు),  హోల్డర్‌ (31 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) కలిసి ఆదుకున్నారు. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 57 బంతుల్లో 89 పరుగులు జోడించారు. దాంతో విండీస్‌ మెరుగైన స్కోరును నమోదు చేసింది. అయితే బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై దక్షిణాఫ్రికా అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 

16.1 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 177 పరుగులు చేసి జట్టు విజయాన్ని అందుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మార్క్‌రమ్‌ (46 బంతుల్లో 82 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగి ఆడగా... డికాక్‌ (24 బంతుల్లో 47; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), రికెల్టన్‌ (28 బంతుల్లో 45 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) సహకరించారు. డికాక్‌తో తొలి వికెట్‌కు 48 బంతుల్లో 95 పరుగులు జోడించిన కెపె్టన్‌ మార్క్‌రమ్‌... రెండో వికెట్‌కు రికెల్టన్‌తో 50 బంతుల్లో అభేద్యంగా 82 పరుగులు జత చేశాడు.  

89 అంతర్జాతీయ టి20ల్లో ఎనిమిదో వికెట్‌కు షెఫర్డ్‌–హోల్డర్‌ కొత్త ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గతంలో స్కాట్లాండ్‌ ప్లేయర్లు షరీఫ్‌–మోమ్‌సెన్‌ జోడించిన 80 పరుగుల రికార్డు (2015లో నెదర్లాండ్స్‌పై) కనుమరుగైంది. 

Advertisement
 
Advertisement
Advertisement