శ్రీలంక ఖేల్‌ ఖతం | New Zealand beat Sri Lanka by 61 runs in T20 World Cup | Sakshi
Sakshi News home page

శ్రీలంక ఖేల్‌ ఖతం

Feb 26 2026 1:01 AM | Updated on Feb 26 2026 1:01 AM

New Zealand beat Sri Lanka by 61 runs in T20 World Cup

న్యూజిలాండ్‌ చేతిలో 61 పరుగులతో ఓటమి

సెమీస్‌కు చేరువైన కివీస్‌

రచిన్‌ రవీంద్ర ఆల్‌రౌండ్‌ ప్రదర్శన  

కొలంబో: టి20 ప్రపంచకప్‌కు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక సొంతగడ్డపై కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ‘సూపర్‌ ఎయిట్స్‌’లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో చిత్తయిన లంక... ఇప్పుడు న్యూజిలాండ్‌ చేతిలోనూ ఓడింది. ఫలితంగా రెండు పరాజయాలతో సెమీస్‌ అవకాశాలు కోల్పోయింది. బుధవారం జరిగిన ‘గ్రూప్‌–2’ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 61 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. 

ఈ గ్రూప్‌ నుంచి ఇంగ్లండ్‌ ఇప్పటికే సెమీస్‌ చేరగా, తాజా విజయంతో కివీస్‌ అవకాశాలు మెరుగయ్యాయి. శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే కివీస్‌ కూడా సెమీస్‌లోకి అడుగు పెడుతుంది. ఓడితే శనివారం పాక్, లంక మ్యాచ్‌ ఫలితం కోసం ఎదురు చూడాల్సి ఉంటుంది. పాక్‌ ఓడితే కివీస్‌కు చోటు ఖాయమవుతుంది. పాక్‌ గెలిస్తే అప్పుడు రన్‌రేట్‌లో పోటీ పడాల్సి ఉంటుంది.  

టాస్‌ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్‌ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (26 బంతుల్లో 47; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), రచిన్‌ రవీంద్ర (22 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కోల్‌ మెక్‌కోన్‌కీ (23 బంతుల్లో 31 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా... ఫిన్‌ అలెన్‌ (13 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. 9.2 ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ 75/2తో మెరుగైన స్థితిలోనే ఉంది. 

అయితే లంక బౌలర్లు చెలరేగడంతో 9 పరుగుల వ్యవధిలోనే ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 84/6కు చేరింది. ఈ దశలో సాంట్నర్, మెక్‌కోన్‌కీ ఆదుకున్నారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. చివరి 4 ఓవర్లలో న్యూజిలాండ్‌ 6 సిక్స్‌లు, 4 ఫోర్లతో 70 పరుగులు రాబట్టడం విశేషం. 

ఆరు వికెట్లు కోల్పోయే సమయానికి 84 పరుగులు చేసిన కివీస్‌... తర్వాతి వికెట్‌ భాగస్వామ్యంలో సరిగ్గా అన్నే పరుగులు చేయడం విశేషం. టి20 వరల్డ్‌ కప్‌లో గతంలో ఏడో వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం 74 పరుగులు (మైక్‌ హస్సీ, స్టీవ్‌ స్మిత్‌ మధ్య 2010లో) కాగా...సాంట్నర్, మెక్‌కోన్‌కీ దీనిని సవరించారు. మహీశ్‌ తీక్షణ, దుష్మంత చమీర చెరో 3 వికెట్లు పడగొట్టారు.  

అనంతరం లక్ష్య ఛేదనలో లంక పూర్తిగా తడబడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 107 పరుగులు చేసి ఓడిపోయింది. ఇన్నింగ్స్‌ తొలి బంతికే నిసాంక (0) బౌల్డ్‌ కావడంతో మొదలైన పతనం వేగంగా సాగింది. అసలంక (5), కుశాల్‌ మెండిస్‌ (11), పవన్‌ రత్నాయకే (10), షనక (3) వరుస కట్టి పెవిలియన్‌కు చేరడంతో 10.3 ఓవర్లలో 46 పరుగులకే జట్టు సగం వికెట్లు కోల్పోయింది. 

ఆ తర్వాత కమిందు మెండిస్‌ (31; 4 ఫోర్లు), వెలలాగె (29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) పోరాడినా దాని ప్రభావం ఫలితంపై పడలేదు. రచిన్‌ రవీంద్ర (4/27) లంకను కుప్పకూల్చగా, హెన్రీకి 2 వికెట్లు దక్కాయి. రచిన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement