ప్రొ హాకీ లీగ్‌లో భారత్ గెలుపు బోణీ
ఎనిమిదో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ‘షూటౌట్’లో పైచేయి
స్వదేశంలో గెలుపు ఖాతా తెరవడంలో విఫలమైన భారత పురుషుల హాకీ జట్టు విదేశీ గడ్డపై ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. రెండో అంచె చివరి లీగ్ మ్యాచ్‌లో నిర్ణీత సమయంలో నేరుగా కాకపోయినా ‘షూటౌట్’లో విజయాన్ని అందుకుంది. ప్రపంచ, ఒలింపిక్ మాజీ చాంపియన్ ఆ్రస్టేలియాను వారి గడ్డపైనే ‘షూటౌట్’లో ఓడించిన భారత జట్టు మూడో అంచె మ్యాచ్‌లను జూన్‌లో నెదర్లాండ్స్‌లో ఆడనుంది.
హోబర్ట్: మొదటి ఐదు మ్యాచ్‌ల్లో నిర్ణీత సమయంలో పరాజయం... ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో ‘షూటౌట్’లో ఓటమి... ఎలాగైతేనేం వరుసగా ఏడు పరాజయాలు... కానీ ఎనిమిదో ప్రయత్నంలో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు రుచి చూడటంలో సఫలమైంది. ఆ్రస్టేలియాలాంటి పటిష్ట జట్టును వారి గడ్డపైనే ‘షూటౌట్’లో ఓడించి రెండో అంచె లీగ్‌ను భారత జట్టు ముగించింది. బుధవారం జరిగిన ప్రొ లీగ్ ఎనిమిదో మ్యాచ్‌లో హార్దిక్ సింగ్ బృందం ‘షూటౌట్’లో 3–1 గోల్స్ తేడాతో ఆ్రస్టేలియాపై జట్టుపై గెలిచింది. భారత్‌కు రెండు పాయింట్లు, ఆ్రస్టేలియాకు ఒక పాయింట్ లభించాయి.
నిర్ణీత సమయంలో రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించగా... భారత్ తరఫున గోల్‌కీపర్ శశికుమార్ మోహిత్ హొన్నేణహళ్లి హీరోగా అవతరించాడు. ముగ్గురు ఆ్రస్టేలియా ఆటగాళ్ల షాట్‌లను మోహిత్ అడ్డుకొని భారత్‌ను గెలిపించాడు. భారత్ తరఫున ‘షూటౌట్’లో శిలానంద్ లాక్రా, మణీందర్ సింగ్, విష్ణుకాంత్ సింగ్ సఫలంకాగా... అభిషేక్ విఫలమయ్యాడు. ఆ్రస్టేలియా తరఫున మొదటి మూడు షాట్‌లు తీసుకున్న టిమ్ బ్రాండ్, లియామ్ హెండర్సన్, కూపర్ బర్న్స్ విఫలమవ్వగా... నాలుగో షాట్‌లో జెరెమీ హేవార్డ్ సఫలమయ్యాడు.
అంతకుముందు రెగ్యులర్ సమయంలోని మూడు క్వార్టర్స్‌లో రెండు జట్లు గోల్స్ చేయలేకపోయాయి. చివరి క్వార్టర్‌లోని 49వ నిమిషంలో జెరెమీ హేవార్డ్ పెనాల్టీ కార్నర్‌ను లక్ష్యానికి చేర్చాడు. దాంతో ఆ్రస్టేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఆ ఆనందం రెండు నిమిషాల్లో ఆవిరైంది. 51వ నిమిషంలో భారత ఫార్వర్డ్ శిలానంద్ లాక్రా గోల్ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు. చివరి తొమ్మిది నిమిషాల్లో ఇరు జట్ల ఆటగాళ్లు మరో గోల్ చేయడానికి ప్రయత్నించి సఫలం కాలేకపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత జట్టు తమకు లభించిన ఐదు పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసింది.
ఆ్రస్టేలియా తమకు దక్కిన ఏడు పెనాల్టీ కార్నర్‌లలో ఒక దానిని సద్వినియోగం చేసుంది. జూన్ 14 నుంచి 21 వరకు రోటర్‌డామ్‌లో మూడో అంచె మ్యాచ్‌లు జరుగుతాయి. భారత జట్టు జూన్ 14న నెదర్లాండ్స్‌తో... 17న జర్మనీతో... 18న మళ్లీ జర్మనీతో... 21న మళ్లీ నెదర్లాండ్స్‌తో ఆడుతుంది. అనంతరం 23 నుంచి 28 వరకు లండన్‌లో నాలుగో అంచె మ్యాచ్‌లు జరుగుతాయి. భారత జట్టు జూన్ 23న పాకిస్తాన్‌తో... 25న ఇంగ్లండ్‌తో... 26న మళ్లీ పాకిస్తాన్‌తో... 28న మళ్లీ ఇంగ్లండ్‌తో తలపడుతుంది.


