భారత్‌ సహా ఆరు దేశాల కొత్త కూటమి.. నెతన్యాహు సంచలన ప్రకటన | Israel Netanyahu launches Hexagon alliance With India As key partner | Sakshi
Sakshi News home page

భారత్‌ సహా ఆరు దేశాల కొత్త కూటమి.. నెతన్యాహు సంచలన ప్రకటన

Feb 25 2026 9:24 AM | Updated on Feb 25 2026 10:52 AM

Israel Netanyahu launches Hexagon alliance With India As key partner

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్తున్నారు. మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన వేళ బెంజమిన్‌ నెతన్యాహు నుంచి ఒక కొత్త భౌగోళిక రాజకీయ కూటమిపై ప్రకటన వెలువడింది. ప్రపంచ రాజకీయాలను శాసించే ఆరు దేశాల కూటమి ‘హెక్సాగన్’ కూటమిని ప్రకటిస్తూ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారత్‌ను ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నారు. కూటమిలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషించబోతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో హెక్సాగన్‌ కూటమి వల్ల భారత్‌కు కలిగే లాభాలేంటి?.. అలాగే భారత్‌ ముందున్న సవాళ్లు ఏంటనే చర్చ మొదలైంది.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల భారత్‌పై ప్రశంసల కురిపించారు. భారత్‌ను ‘గ్లోబల్ పవర్​'గా అభివర్ణించిన ఆయన, రానున్న రోజుల్లో మధ్యప్రాచ్యం, ప్రపంచ రాజకీయాలను శాసించే ఆరు దేశాల కూటమి ‘హెక్సాగన్’ కూటమిలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పశ్చిమాసియాలో ‘రాడికల్‌ పరిస్థితుల’ను ఎదుర్కోవడమే లక్ష్యంగా నెతన్యాహు ఈ కూటమిని ప్రతిపాదించారు. ఇందులో ఇజ్రాయెల్‌, గ్రీస్‌, సైప్రస్‌లతో పాటు భారత్‌ ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నారు.

‘హెక్సాగన్’ కూటమి ఏంటి?
ఈ క్రమంలో నెతన్యాహు కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యం చుట్టూ ఆరు శక్తులతో ఒక కూటమిని ప్రతిపాదించారు. దీనిని ఆయన ‘హెక్సాగన్’ (షడ్భుజి)గా అభివర్ణించారు. ఈ కూటమిలోని దేశాలు భారత్, అరబ్ దేశాలు, ఆఫ్రికా దేశాలు, మధ్యధరా దేశాలు, ఆసియాలోని ఇతర దేశాలు, ఇజ్రాయెల్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయని అన్నారు. ఇది కేవలం ఒక వాణిజ్య కూటమి మాత్రమే కాదు. తీవ్రవాద భావజాలం కలిగిన రాడికల్ షియా, సున్నీ వర్గాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఏర్పడిన కూటమిగా ఇజ్రాయెల్ భావిస్తోందని చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఈ కూటమిలో అరబ్‌, ఆఫ్రికన్‌, ఆసియా దేశాలు కూడా భాగస్వాములుగా ఉంటాయని ఇజ్రాయెల్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది.

భారత్ ఐఎంఈసీకి బలం.. 
ఇక, అంతకుముందు.. జీ-20 వేదికగా భారత్ ఐఎంఈసీ(ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్)ను ప్రకటించింది. నెతన్యాహు ప్రతిపాదించిన ‘హెక్సాగన్’ వ్యూహం ఐఎంఈసీకు మరింత బలాన్ని చేకూర్చనుంది. కేవలం రైల్వే లైన్లు, ఓడరేవుల అనుసంధానం మాత్రమే కాకుండా, ఈ దేశాల మధ్య బలమైన రాజకీయ, సైనిక బంధాన్ని ఏర్పరచడమే ‘హెక్సాగన్’ ఉద్దేశంగా ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోంది. గతంలో ఇజ్రాయెల్ కేవలం అమెరికా, ఐరోపా దేశాలపైనే ఆధారపడేది. కానీ మారుతున్న కాలంలో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తితో జతకట్టడం ద్వారా ఇజ్రాయెల్ తన భద్రత, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది.

కాగా, ఈ కూటమి ప్రధానంగా భద్రతా, భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించబడిన ఆరు దేశాల సమూహం. భద్రతా పరంగా ఉగ్రవాదం, ప్రాంతీయ అస్థిరతను ఎదుర్కోవడానికి ఒక సమిష్టి వేదిక కానుంది. ఆర్థిక పరంగా ఇంధన, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో సహకారం, రక్షణ ఒప్పందాల కోసం ఉపయోగపడనుంది. రాజకీయ పరంగా భారత్‌కి మధ్యప్రాచ్యం, యూరప్‌లో మరింత ప్రభావం పెంచే అవకాశం ఉంది.

భారత్‌కు కలిగే లాభాలు.. 

  • భద్రతా సహకారం: ఉగ్రవాదం, సముద్ర భద్రత, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యం. 

  • ఆర్థిక అవకాశాలు: ఇంధన (గ్యాస్, ఆయిల్), రక్షణ టెక్నాలజీ, స్టార్టప్‌లు, ఇన్నోవేషన్ రంగాల్లో కొత్త పెట్టుబడులు.

  • రాజకీయ ప్రభావం: మధ్యప్రాచ్యం, యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో భారత్‌కి మరింత ప్రాధాన్యం.

  • భౌగోళిక సమతుల్యం: మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వ్యూహాత్మక మిత్రులు.

  • సాంస్కృతిక సంబంధాలు: గ్రీస్, సైప్రస్ వంటి దేశాలతో పర్యాటక, విద్యా రంగాల్లో కొత్త అవకాశాలు.

భారత్‌ ముందున్న సవాళ్లు

  • ఇరాన్‌తో సంబంధాలు: భారత్‌కి ఇంధన అవసరాల కోసం ఇరాన్‌తో సంబంధాలు ఉన్నాయి. ఈ కూటమి వల్ల ఆ సంబంధాలు దెబ్బతినే అవకాశం.

  • అరబ్ దేశాల ప్రతిస్పందన: కొన్ని అరబ్ దేశాలు ఈ కూటమిని ఇజ్రాయెల్‌ ఆధిపత్యంగా చూసే అవకాశం ఉంది.

  • ప్రాంతీయ అస్థిరత: మధ్యప్రాచ్యంలో జరిగే ఘర్షణలు భారత్‌కి ప్రత్యక్ష ప్రభావం చూపవచ్చు

మోదీ రికార్డు.. 
ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కొన్ని చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ప్రపంచ యుద్ధ కాలంలో యూదుల మారణ హోమానికి గుర్తుగా నిర్మించిన స్మారక చిహ్నాన్ని మోదీ సందర్శిస్తారు. జెరూసలెంలో ప్రధాని మోదీతో కలిసి ఒక భారీ ఇన్నోవేషన్ కార్యక్రమంలో నెతన్యాహు పాల్గొననున్నారు. ఇక, ప్రధాని మోదీని తన వ్యక్తిగత స్నేహితుడుగా నెతన్యాహు అభివర్ణించారు. 2017లో మోదీ పర్యటన సందర్భంగా ఇద్దరు నేతలు సముద్ర తీరంలో చెప్పులు లేకుండా నడిచిన దృశ్యాలను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘మేము నిరంతరం ఫోన్‌లో మాట్లాడుకుంటూనే ఉంటాము. ఒకరి దేశాన్ని మరొకరం సందర్శించుకున్నాం. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధం మరింత దృఢంగా మారింది’ అని ఆయన అన్నారు. మరోవైపు.. రెండోసారి ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న భారత ప్రధానిగా మోదీ.. రికార్డుల్లోకి ఎక్కారు.

Advertisement
 
Advertisement
Advertisement