రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఐరాసలో భారత్ తటస్థం | India abstains from UNGA draft resolution on Russia Ukraine | Sakshi
Sakshi News home page

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం: ఐరాసలో భారత్ తటస్థం

Feb 25 2026 7:28 AM | Updated on Feb 25 2026 8:43 AM

India abstains from UNGA draft resolution on Russia Ukraine

న్యూయార్క్: ఐదేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంక్షోభంలో శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (UNGA)లో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. రష్యా దళాలు తక్షణమే ఉక్రెయిన్‌ నుంచి తప్పుకోవాలని, తద్వారా శాశ్వత శాంతికి మార్గం సుగమం చేయాలంటూ ఉక్రెయిన్ ప్రతిపాదించిన ‘సపోర్టింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ ఇన్ ఉక్రెయిన్’ తీర్మానంపై మంగళవారం జరిగిన ఓటింగ్‌లో భారత్ తటస్థ వైఖరిని అవలంబించింది.

మొత్తం 107 దేశాలు ఈ తీర్మానానికి మద్దతుగా ఓటు వేయగా, 12 దేశాలు దీనిని వ్యతిరేకించాయి. భారత్‌తో పాటు చైనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, యూఏఈ, అమెరికా తదితర 50 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉండటం గమనార్హం. కాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఈ ఏడాది ఫిబ్రవరితో ఐదో ఏట అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ తీర్మానం ప్రాధాన్యత సంతరించుకుంది.  ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్.. ఈ పోరాటాన్ని సామూహిక మనస్సాక్షిపై ఒక మచ్చగా అభివర్ణించారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి, ఉక్రెయిన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ శాంతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.

2025లో పౌర మరణాలు గరిష్ట స్థాయికి చేరడంపై గుటెర్రెస్  ఆందోళన వ్యక్తం చేస్తూ, తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని పట్టుబట్టారు. మరోవైపు ఈ తీర్మానానికి మద్దతుగా నిలిచిన దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్మానం ఆమోదం పొందడం శాశ్వత శాంతికి అవసరమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర  ఇక్కట్లకు గురైనప్పటికీ, లొంగిపోయే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. జూన్ నాటికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని అమెరికా గడువు విధించిన నేపథ్యంలో, తదుపరి దశ చర్చలు మయామిలో జరిగే అవకాశం ఉందని సమాచారం. తాజాగా మాస్కోపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేయడం, ఫలితంగా రష్యాలోని నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేయడం లాంటి పరిణామాలు ఉద్రిక్తతలను మరింతగా పెంచుతున్నాయి.

ఇది కూడా చదవండి: సీబీఎస్ఈ వార్నింగ్‌: విశ్లేషకులపై కఠిన చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement