15 కాదు, 10 శాతమే! | Trump new global tariff comes into effect at 10 Percent | Sakshi
Sakshi News home page

15 కాదు, 10 శాతమే!

Feb 25 2026 4:02 AM | Updated on Feb 25 2026 8:35 AM

Trump new global tariff comes into effect at 10 Percent

అమల్లోకి ట్రంప్‌ టారిఫ్‌లు 

వాషింగ్టన్‌: ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన 10 శాతం టారిఫ్‌లు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అత్యవసర ఆర్థికాధికారాల చట్టం (ఐఈఈపీఏ) కింద ఏడాది కాలంగా పలు దేశాలపై ఆయన ఎడాపెడా విధించిన భారీ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు గత శుక్రవారం కొట్టేయడం తెలిసిందే. దాంతో చిర్రెత్తుకొచి్చన ట్రంప్‌ అన్ని దేశాలపైనా కొత్తగా 10 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు అప్పటికప్పుడు ప్రకటించారు.

ఆ మర్నాడే దాన్ని 15 శాతానికి పెంచుతున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ యూఎస్‌ కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ విభాగం మాత్రం ప్రపంచ దేశాల నుంచి 10 శాతం టారిఫ్‌లు వసూలు చేయనున్నట్టు మంగళవారం ప్రకటించింది. సుప్రీంకోర్టు కొట్టేసిన టారిఫ్‌ల వసూళ్లను మంగళవారం నుంచే నిలిపేస్తున్నట్టు కూడా వెల్లడించింది.

1974 నాటి వర్తక చట్టంలోని సెక్షన్‌ 122 ప్రకారం ట్రంప్‌ విధించిన తాజా టారిఫ్‌లు గరిష్టంగా 150 రోజుల పాటు కొనసాగుతాయి. ఆలోపు కాంగ్రెస్‌ అనుమతి లభించని పక్షంలో అంతటితో వాటికి కాలదోషం పడుతుంది. ఈలోపే వాటిని ట్రంప్‌ ప్రకటించినట్టుగా 15 శాతానికి పెంచుతారా అన్నదానిపై ప్రస్తుతానికైతే స్పష్టత లేదు. మరోవైపు, ఐఈఈపీఏ కింద వసూలు చేసిన అధిక టారిఫ్‌లను తిరిగి చెల్లించాలంటూ ఫెడెక్స్‌తో పాటు పలు అమెరికా కంపెనీలు ఇప్పటికే ట్రంప్‌ సర్కారుపై కోర్టుకెక్కాయి.

ఆ చట్టం కింద అమెరికా ఏకంగా 130 బిలియన్‌ డాలర్ల దాకా వసూలు చేసినట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఆ మొత్తాలను తిరిగివ్వబోమని, అవసరమైతే అందుకోసం న్యాయపోరాటం చేస్తామని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించారు. అంతేగాక వాణిజ్య ఒప్పందాల పేరిట అమెరికాతో ఆటలాడుతున్న పలు దేశాలపై హెచ్చు టారిఫ్‌లు తప్పవని సోమవారం ఆయన హెచ్చరించారు. ఈ అనిశి్చత పరిస్థితుల నేపథ్యంలో భారత్, అమెరికా వాణిజ్య ఒప్పంద చర్చలు కూడా వాయిదా పడటం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement