గర్ల్‌ ఫ్రెండ్‌ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతం | Mexican Army Kills Notorious Cartel Boss El Mencho In Tapalpa Operation, Violence Erupts Across The Country | Sakshi
Sakshi News home page

గర్ల్‌ ఫ్రెండ్‌ ద్వారానే ఎల్ మెంచో కథ ఖతం

Feb 24 2026 1:06 PM | Updated on Feb 24 2026 1:35 PM

Girlfriend Was Key In Taking Down El Mencho Mexico

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మెక్సికన్ కార్టెల్ కింగ్‌, కరడుగట్టిన నేరస్థుడు జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (CJNG) అధినేత 'ఎల్ మెంచో'(Nemesio Oseguera Cervantes) నెమెసియో ఒసేగురా సెర్వంటెస్‌ని మెక్సికో సైనిక ఆపరేషన్‌లో మట్టు బెట్టింది.  మెక్సికో, అమెరికా దేశాలకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న ఎల్ మెంచో అధ్యాయం ముగిసిపోవడంతో మెక్సికోలో హింస చెలరేగింది. అయితే ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉన్నందున, మెక్సికో అంతటా హై అలర్ట్ ప్రకటించారు.  అయితే ఎల్ మెంచో అంతం వెనుక ఉన్న ఆసక్తికరమైన వివరాలు తాజాగా వెలుగులోకి  వచ్చాయి. అసలు  ఆ ఆపరేషన్‌ ఎలా జరిగింది. కీలక సమాచారాన్ని అందించింది ఎవరు?  తెలుసుకుందాం.


జాలిస్కో రాష్ట్రంలోని తపాల్పాలో మెక్సికన్ సైన్యం నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో ఎల్ మెంచో మరణ వార్తతో అతని అనుచరులు మెక్సికో వ్యాప్తంగా విధ్వంసానికి దిగారు  వందలాది వాహనాలకు, పెట్రోల్ బంకులకు నిప్పు పెట్టారు. ప్రధాన నగరాల్లో భారీగా కాల్పులు, పేలుళ్లు సంభవించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అనేక రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించగా, గ్వాడలజారా వంటి నగరాల్లో ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది.

మెక్సికన్ భద్రతా దళాలు నిర్వహించిన హై-స్టేక్స్ ఆపరేషన్‌ చారిత్రాత్మక విజయం తరువాత  డ్రగ్స్ అక్రమ రవాణాపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.  అయితే ఆపరేషన్‌ ఎలా జరిగింది. అతని గర్ల్‌ఫ్రెండ్ కదలికలే అతన్ని పట్టించడంలో కీలక పాత్ర పోషించాయని మెక్సికన్ అధికారులు సోమవారం తెలిపారు."ఎల్ మెన్చో"తో రాత్రి గడిపిన తర్వాత, ఆ మహిళను ట్రాక్‌ చేసి, ఆ ప్రాంతంలోనే ఉంటున్నట్లు ధృవీకరించిన తర్వాత, ప్రత్యేక దళాలు తమ ప్లాన్‌ అమలు చేశాయని మెక్సికన్ రక్షణ కార్యదర్శి జనరల్ రికార్డో ట్రెవిల్లా తెలిపారు.

ఆపరేషన్ ఎలా జరిగింది?
మెక్సికన్ రక్షణ మంత్రి జనరల్ రికార్డో ట్రెవిల్లా తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఆపరేషన్ ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఎల్ మెంచో ప్రియురాలిపై  నిఘా పెట్టిన మెక్సికన్ నిఘా  వర్గాలు  ఈ సారి విజయాన్ని సాధించాయి. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇచ్చిన పక్కా సమాచారంతో ఎల్ మెంచో అక్కడ ఉన్నాడని నిర్ధారించుకున్న మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్, ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

మెక్సికన్ సైన్యం, నేషనల్ గార్డ్,  ఆరు హెలికాప్టర్లతో ఈ దాడి జరిగింది. ఎల్ మెంచో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అతని అనుచరులు సైన్యాన్ని అడ్డుకోవడానికి రాకెట్ లాంచర్లతో విరుచుకుపడ్డారు.

భీకర పోరాటం 
కాల్పుల మధ్య ఎల్ మెంచో ఒక పొదలో దాక్కున్నాడు. అక్కడ జరిగిన ఎదురుకాల్పుల్లో అతను, అతని ఇద్దరు బాడీగార్డ్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. ఈ ఆపరేషన్ , దాని తర్వాత చెలరేగిన హింసలో మొత్తం 70 మందికి పైగా మరణించారు. ఇందులో 25 మంది నేషనల్ గార్డ్ సభ్యులు, ఒక జైలు అధికారి మరియు 30 మందికి పైగా నేరస్థులు ఉన్నారు.


మరోవైపు ఎల్ మెంచో మరణం తరువాత  అనతి ని కుడిభుజంగా చెప్పుకునే ఎల్ తులి  తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. చనిపోయిన ప్రతి సైనికుడికి 20,000 పెసోలు (సుమారు రూ. 84,000) బహుమతిగా ఇస్తామని ప్రకటించాడు.  జాలిస్కో రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల దిగ్బంధనం, నిప్పు పెట్టడం వంటి దాడులకు పాల్పడ్డాడు. అయితే, సైన్యం అతన్ని కూడా గుర్తించి కాల్చి చంపింది. అతని వద్ద నుండి 1.4 మిలియన్ డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నామని భద్రతా కార్యదర్శి ఒమర్ గార్సియా హర్ఫుచ్  తెలిపారు.

కాగా  ఇలాంటి డ్రగ్‌ మాఫియా కింగ్‌లను పట్టుకోవడంలో వ్యక్తిగత సంబంధాలు కీలకమైన బలహీనమైన లింక్‌గా ఎలా మారుతాయో తాజాగా ఘటన పెద్ద ఉదాహరణ. గత పదేళ్లుగా  జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్‌ని  అంతర్జాతీయ నెట్‌వర్క్‌గా క్రూరమైన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అతని వ్యక్తిగత సంపద ఒక బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లు)  పై మాటేనని అమెరికా డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) అంచనా. ఎల్ మెన్చో ఒక్కడే  కాదు అతని కుటుంబం  పాత్ర కూడా ఈ నేర కార్యకలాపాలలో తక్కువేమీ కాదు. అతని కుమారుడు, కుమార్తె, సోదరుడు. వీరు  ప్రస్తుతం శిక్షను అనుభవిస్తున్నారు లేదా విచారణను ఎదుర్కొంటున్నారు. ఇతని భార్య రోసలిండా గొంజాలెజ్-వాలెన్సియాను 2021 నవంబరులో అరెస్టు చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement