ట్రంప్‌ అరాచకానికి బ్రేక్‌ | Sakshi Editorial On President of United States Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ అరాచకానికి బ్రేక్‌

Feb 24 2026 1:23 AM | Updated on Feb 24 2026 8:48 AM

Sakshi Editorial On President of United States Donald Trump

‘అరాచకం సద్దుమణిగింది... దేశాధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దూకుడుకు కళ్లెం పడింది’ అని అమెరికా ప్రజలంతా ఊపిరి పీల్చుకుని 24 గంటలు గడవకముందే మళ్లీ సమస్య మొదటికొచ్చింది. 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) కింద నిరుడు ఏప్రిల్‌ నుంచి సుంకాలు విధిస్తున్న ఆయన చర్యలు చెల్లబోవని అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం 6–3 మెజారిటీతో తీర్పునివ్వగా, దాన్ని వమ్ము చేస్తూ ట్రంప్‌ కొత్తగా అన్ని దేశాలపైనా 15 శాతం అదనపు సుంకాలు విధించారు. తీర్పునిచ్చిన న్యాయమూర్తుల్ని మూర్ఖులుగా, దేశభక్తి లోపించిన వారిగా నిందించారు. పలు వ్యాపార సంస్థలతోపాటు 12 రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై వెలువడిన ఈ తీర్పువల్ల ధరలు తగ్గి జనం లబ్ధి పొందుతారు. 

చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు ట్రంప్‌కు అనుకూలంగా తీర్పులిస్తూ వచ్చింది. ఏడాది కాలంలో అది మొత్తం 26 తీర్పులు వెలువరించగా, అందులో 21 ప్రభుత్వ నిర్ణయాలను సమర్థించేవే. ఇందులో అత్యధికం అప్పీళ్ల రూపంలో వచ్చినవి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైనప్పుడు ప్రజల తీర్పును వమ్ముచేయటానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో నమోదైన కేసు నుంచి ట్రంప్‌కు తొలి ఉపశమనం దొరికింది. నిరుడు మార్చిలో వలసదారులను బలవంతంగా వెనక్కి పంపే నిర్ణయాన్ని కింది కోర్టులు కొట్టివేయగా, సుప్రీంకోర్టు సమర్థించింది. మొన్న డిసెంబర్‌లో మాత్రం ఇల్లినాయీస్‌ నేషనల్‌ గార్డును స్వాధీనంలోకి తీసుకోవటం, షికాగో అభీష్టానికి భిన్నంగా అక్కడికి పంపటాన్ని తప్పుబట్టింది. 

నిజానికి గత వారం ట్రంప్‌కు ‘అన్నీ మంచి శకునములే...’ అన్నట్టు మొదలైంది. అమెరికాలో 3,600 కోట్ల డాలర్ల పెట్టుబడులకు అనుమతిస్తూ జపాన్‌ గత మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అధిక సుంకాలను 35 శాతానికి పరిమితం చేయటానికి అమెరికా అంగీకరించినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే అధిక సుంకాలను 32 శాతం వద్దే ఆపుతామన్న ట్రంప్‌ హామీకి కృతజ్ఞతగా గురువారం ఇండొనేసియా అధ్యక్షుడు దేశంలోని కీలక రంగాల్లో అమెరికా సంస్థల ప్రవేశానికి మార్గం సుగమం చేస్తూ ఉత్తర్వు నిచ్చారు. వెంటనే ‘అమెరికా మళ్లీ గెలుస్తోంది’ అంటూ ట్రంప్‌ ట్రూత్‌ మాధ్యమం ద్వారా తెగ సంబరపడ్డారు. తీరా సుప్రీంకోర్టు తీర్పుతో ఆ సుంకాలు కాస్తా రద్దయ్యాయి. 

ఆ తీర్పు అనంతరం ట్రంప్‌ పెంచిన సుంకాలు కేవలం 15 శాతం కావటంతో ఆ రెండు దేశాలూ తమ నిర్ణయాలకు సహజంగానే పశ్చాత్తాప పడుతున్నాయి. మన దేశం సైతం పునరాలోచనలో పడిందని మీడియా కథనాలు చెబుతున్నాయి. సోమవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు మన ప్రతినిధి బృందం అమెరికా అధికారులతో జరపవలసిన చర్చలు వాయిదా పడ్డాయి. వియత్నాం 20 శాతం అదనపు సుంకా లకు అంగీకరించగా, ఇప్పుడది 15 శాతానికి తగ్గింది. ఇంకా దక్షిణ కొరియా, తైవాన్, మలేసియా వంటి దేశాలతోపాటు అమెరికా మిత్రదేశాలు కూడా తలపట్టుకుంటున్నాయి. కాకపోతే ఒప్పందాల్ని రద్దుచేసే సాహసానికి దిగలేదు. నిరుడు 27 దేశాల యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) 15 శాతం సుంకాలకు అంగీకరిస్తూ ఒప్పందం కుదుర్చుకోగా, ట్రంప్‌ వాటిపై సైతం కొత్తగా 15 శాతం అదనపు సుంకాల భారం మోపారు. 

తన అరాచక నిర్ణయాలను సుప్రీంకోర్టు అంగీకరిస్తుందని ట్రంప్‌ గట్టిగా నమ్మారు. అందుకే వీలుచిక్కినప్పుడల్లా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని పొగుడుతూ వచ్చారు. అమెరికాలో న్యాయమూర్తుల నియామకాల్లో అధికార పక్షం ముద్ర బహిరంగ రహస్యం. ఆ రకంగా చూస్తే మొత్తం 9 మంది న్యాయమూర్తుల్లో ప్రధాన న్యాయమూర్తి, మరో అయిదుగురు రిపబ్లికన్‌ అనుకూలురు. ముగ్గురు మాత్రమే డెమాక్రాటిక్‌ పార్టీకి చెందినవారు. ఏదేమైనా ట్రంప్‌ తాజా సుంకాలు 150 రోజులు మాత్రమే అమల్లో ఉంటాయి. ఈలోగా ప్రతినిధుల సభ ద్వారా తన పంతం నెగ్గించుకోవటం ఆయనకు కష్టమే. ట్రంప్‌ రేటింగ్‌ పడిపోయి, వచ్చే నవంబర్‌ మధ్యంతర ఎన్నికల్లో పార్టీ ఊడ్చిపెట్టుకుపోవటం ఖాయం అన్న సర్వేలు వెలువడుతున్న నేపథ్యంలో రిపబ్లికన్లు ఏం చేస్తారన్నది చూడాలి. మొత్తానికి సుప్రీంకోర్టు చెప్పినా సరే... దేశాన్ని అనిశ్చితిలో పడేసే తన ధోరణి మారబోదని ట్రంప్‌ తేల్చిచెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement