ప్రతి 10 మందిలో ఏడుగురు పట్టభద్రులు
స్థానిక అమెరికన్లలో పది మందిలో నలుగురే
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు, పట్టభద్రులు ఏ మతస్థులో తెలుసా? అందరూ అనుకుంటున్నట్లు క్రైస్తవులు కాదు. హిందువులే అగ్రస్థానంలో ఉన్నారు. వాషింగ్టన్‌కు చెందిన ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజాగా ఈ విషయం వెల్లడించింది.
నాలుగేళ్ల కాలేజీ డిగ్రీ పూర్తిచేసిన పట్టభద్రులు ఏ మతానికి చెందిన వారన్న దానిపై 2023–24 రిలీజియస్ ల్యాండ్‌స్కేప్ స్టడీ (ఆర్‌ఎల్‌ఎస్) పేరిట ఈ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసింది. ఉన్నత విద్యావంతుల్లో అగ్రస్థానంలో హిందువులు, ఆ తర్వాతి స్థానంలో యూదులున్నట్లు తన నివేదికలో పేర్కొంది.
→ అమెరికాలో ప్రతి 10 మంది హిందువుల్లో కనీసం ఏడుగురు బ్యాచిలర్స్ డిగ్రీ లేదా ఉన్నత విద్య అభ్యసించారు. అంటే 70 శాతం శాతం మంది ఉన్నత విద్యావంతులే. యూదుల్లో ఈ సంఖ్య 65 శాతం.
→ స్థానిక అమెరికన్లలో కేవలం 35 శాతం మంది ఉన్నత విద్య అభ్యసించారు.
→ ఇతర మతస్థులు సగటు కంటే కొద్దిగా పైస్థానంలో నిలిచారు. వీరిలో ముస్లింలు, బౌద్ధులు, ఆర్థోడాక్స్ క్రైస్తవులున్నారు. ఆయా మతస్థుల్లో ప్రతి పది మందిలో కనీసం
నలుగురు బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేశారు. ప్రొటెస్టంట్ క్రైస్తవులు కూడా ఈ జాబితాలో నిలిచారు.
→ ఎవెలాంజికల్ ప్రొటెస్టంట్లు, క్యాథలిక్స్ సగటు కంటే దిగువ స్థాయిలో ఉన్నారు. వీరు చాలావరకు నల్లజాతివారే.
→ మొత్తం స్థానిక అమెరికా జనాభాలో పరిశీలిస్తే ప్రతి పది మందిలో నలుగురు మాత్రమే బ్యాచిలర్స్ డిగ్రీ అభ్యసించారు.
→ అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం విషయంలో మతాల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నట్లు తెలుస్తోంది.
→ వలసలు, తద్వారా స్థానిక జనాభా స్థితిగతుల్లో మార్పులు రావడమే ఈ వ్యత్యాసాలకు కారణమని ప్యూ రీసెర్చ్ సెంటర్ తమ నివేదికలో అభిప్రాయపడింది. హిందువులు, ముస్లింలు, బౌద్ధులు చాలావరకు ఇతర దేశాల అమెరికాకు వలసవచి్చనవారే కావడం గమనార్హం. వీరు ఉన్నత విద్య లేదా ఉద్యోగాల కోసం, జీవనోపాధి కోసం వచ్చారు.
→ అమెరికాలో ఉద్యోగాల కోసం భారతీయులు అధికంగా తరలివస్తున్నారు. ఇందుకు హెచ్–1బీ వీసాలు వారికి తోడ్పడుతున్నాయి. ఈ వీసాలో అత్యధికంగా ప్రయోజనం పొందుతున్నది భారతీయులే కావడం గమనార్హం. అమెరికాలో టెక్నాలజీ, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలను భారతీయులు ప్రభావితం చేస్తున్నారు.


