సుంకాలపై మాట మార్చిన ట్రంప్
సవరించిన తాత్కాలిక సుంకాలు వెంటనే అమల్లోకి
విదేశాలపై చట్టబద్ధంగానే సుంకాలు పెంచానని అమెరికా అధ్యక్షుడి స్పషీ్టకరణ
తనకు 150 రోజులపాటు గడువు ఉందని వెల్లడి
చట్టబద్ధమైన, నూతన టారిఫ్‌ల కోసం ప్రయత్నిస్తామని ఉద్ఘాటన
దశాబ్దాలపాటు అమెరికాను దోచుకున్నాయని ఇతర దేశాలపై ఆగ్రహం
వాషింగ్టన్/న్యూఢిల్లీ: విదేశాలపై టారిఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ప్రపంచ దేశాలపై విధించిన తాత్కాలిక టారిఫ్‌లను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం ‘ట్రూత్ సోషల్’లో పోస్టుచేశారు. సవరించిన టారిఫ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయని తేల్చిచెప్పారు.
టారిఫ్‌లపై అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం ఇచ్చిన హాస్యాస్పదమైన, పేలవమైన, అసాధారణ అమెరికా వ్యతిరేక తీర్పు తర్వాత అన్ని అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న దేశాలపై తొలుత 10 శాతం టారిఫ్‌లు ప్రకటించానని తెలిపారు. తాను అధికారంలోకి వచ్చేదాకా ఈ దోపిడీ యథేచ్ఛగా కొనసాగిందని మండిపడ్డారు.
10 శాతం టారిఫ్‌లను చట్టబద్ధంగా 15 శాతానికి పెంచుతున్నట్లు స్పష్టంచేశారు. అమెరికా ట్రేడ్ చట్టం–1974లోని సెక్షన్ 122 ప్రకారం ఇతర దేశాల ఉత్పత్తులపై 15 శాతం దాకా టారిఫ్‌లను 150 రోజుల పాటు విధించే అధికారం అధ్యక్షుడికి ఉంది. దీనికి అమెరికా కాంగ్రెస్ అనుమతి అవసరం లేదు. అయితే, ఇది న్యాయ సమీక్షకు అతీతం కాదు.
15 శాతం టారిఫ్‌లను సవాలు చేస్తూ ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధం అంటూ అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై వెంటనే స్పందించిన ట్రంప్ విదేశాలపై 10 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. సంబంధిత కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం కూడా చేశారు.
ఒక్కరోజులోనే ఆ సుంకాలను 15 శాతానికి పెంచేశారు. తనకు 150 రోజుల గడువు ఉందని, ఈలోగా చట్టబద్ధమైన, నూతన టారిఫ్‌లను విధించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని ట్రంప్ వెల్లడించారు. తాము విజయవంతంగా ప్రారంభించిన ‘అమెరికాను మళ్లీ గొప్పగా తీర్చిదిద్దే(మాగా)’ ప్రక్రియను కొనసాగించేలా ఈ టారిఫ్‌లు ఉంటాయన్నారు.
భారత్‌పై సుంకాలు 18.5 శాతం?
ప్రపంచ దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు చెల్లుబాటు కావని అమెరికా సుప్రీంకోర్టు తేల్చిచెప్పడం, ఇతర దేశాలపై 15 శాతం సుంకాలు తాత్కాలికంగా విధిస్తున్నట్లు ట్రంప్ వెంటనే ప్రకటించిన నేపథ్యంలో భారత్‌పై టారిఫ్‌లు ఎంతశాతం అనేది చర్చనీయాంశంగా మారింది. భారత్‌పై విధించిన 50 శాతం టారిఫ్‌లను ఇటీవలే 18 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే.
భారత్, అమెరికాలు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత భారత ఉత్పత్తులపై టారిఫ్‌లు భారీగా తగ్గిపోయాయి. ప్రపంచ దేశాలపై టారిఫ్‌లను సుప్రీంకోర్టు కొట్టిపారేసిన నేపథ్యంలో ట్రంప్ ప్రకటించినట్లు భారతదేశ ఉత్పత్తులపై 15 శాతం తాత్కాలిక సుంకాలు అమల్లోకి రాబోతున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సాంకేతికంగా చూస్తే భారత్‌పై 3.5 శాతం సుంకాలు అమల్లో ఉన్నాయి. సెక్షన్ 122 కింద ట్రంప్ విధించిన 15 శాతం తాత్కాలిక సుంకాలు కూడా కలిపితే మొత్తం సుంకాలు 18.5 శాతానికి చేరుకుంటాయి. అయితే, దీనిపై అమెరికా వైట్‌హౌస్ ఇంకా పూర్తి స్పష్టత ఇవ్వలేదు. భారత్‌పై మొత్తం సుంకాలు ఎంత అనేది అతి త్వరలో తేలిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కొన్ని ఉత్పత్తులకు మినహాయింపు
విదేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకొనే అన్ని ఉత్పత్తులపైనా 15 శాతం తాత్కాలిక సుంకాలు విధించే అవకాశం లేదు. కొన్నింటికి మినహాయింపు ఇవ్వబోతున్నారు. అరుదైన ఖనిజాలు, కరెన్సీ తయారీలో ఉపయోగించే లోహాలు, ఇంధనం, ఇంధన ఉత్పత్తులు, అమెరికాలోని లేని, తయారు చేసుకోలేని సహజ వనరులు, ఎరువులు, పశువుల మాంసం, టొమాటోలు, నారింజ పండ్లు, కొన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులు, ఫార్మా ఉత్పత్తులు, ఎల్రక్టానిక్స్, ప్యాసింజర్ వాహనాలు, తేలికపాటి రవాణా వాహనాలు, బస్సులు, ప్యాసింజర్ వాహనాల విడిభాగాలపై పన్ను ఉండదు.
అధ్యయనం చేస్తున్నాం..
ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్‌లు చెల్లుబాటు కావంటూ అక్కడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, అనంతరం ట్రంప్ ప్రకటించిన చర్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వం వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పు, ట్రంప్ చర్యల వల్ల తలెత్తే పరిణామాలను అంచనా వేస్తున్నామని పేర్కొంది. అమెరికా కొత్తగా విధించిన టారిఫ్‌లు, వాటి ప్రభావాలపై క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ శనివారం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. అన్ని అంశాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు తెలియజేసింది.
ఇండియాతో ట్రేడ్ డీల్‌లో మార్పు ఉండదు: ట్రంప్
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా భారత్‌తో వాణిజ్య ఒప్పందం విషయంలో ఎలాంటి మార్పు ఉండదని ట్రంప్ శుక్రవారం మీడియా సమావేశంలో స్పష్టంచేశారు. వారు(భారత్) టారిఫ్‌లు చెల్లించాల్సిందేనని, తాము మాత్రం చెల్లించబోమని వెల్లడించారు. భారత్‌తో, భారత ప్రధాని మోదీతో అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు తమకు తీవ్ర అసంతృప్తి కలిగించిందని అన్నారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మూర్ఖులు, పెంపుడు శునకాల్లాంటి వారు అంటూ నిందించారు. అమెరికాకు ఏది అవసరమో అది చేసే ధైర్యం వారికి లేదని విమర్శించారు. కోర్టు తీర్పు అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. గత ఏడాది భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం తానే ఆపేశానని మరోసారి వ్యాఖ్యానించారు. మాట వినకపోతే భారీగా టారిఫ్‌లు విధిస్తానని బెదిరించడంతో ఆ రెండు దేశాలు దారికొచ్చాయని అన్నారు. భారత్, పాక్ ఘర్షణలు 10 యుద్ధ విమానాలు నేలకూలాయని తెలిపారు.
రీఫండ్ సంగతేంటి?
ప్రపంచ దేశాలపై టారిఫ్‌లతో ట్రంప్ ప్రభుత్వం 133 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఈ టారిఫ్‌లు చట్టప్రకారం చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ సొమ్ము సంగతేమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. సుప్రీంకోర్టు ఎలాంటి సమాధానం చెప్పలేదు. వసూలు చేసిన సొమ్మును ఆయా దేశాలకు వెనక్కి ఇస్తారా? అన్న దానిపై ట్రంప్ ఇంకా స్పందించలేదు. రీఫండ్ కోసం విదేశీ కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. అయితే, అది అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. అందుకు చాలా సమయం పడుతుందని అంటున్నారు. రీఫండ్ చేయాలంటే చాలా సంస్థలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అదొక సుదీర్ఘమైన ప్రక్రియ. చాలాకాలం వేచి చూడక తప్పదు. ఈలోగా ట్రంప్ ప్రభుత్వం గనుక చట్టంలో ఏవైనా మార్పులు చేస్తే సొమ్ము వెనక్కి వచ్చే అవకాశం ఉండదు.


