హార్వర్డ్​ నుంచి సీఎం రేవంత్‌నకు అరుదైన ఆహ్వానం | Harvard Kennedy School Invites CM Revanth Reddy to AI Policy Symposium | Sakshi
Sakshi News home page

హార్వర్డ్​ నుంచి సీఎం రేవంత్‌నకు అరుదైన ఆహ్వానం

Feb 22 2026 9:11 PM | Updated on Feb 23 2026 9:03 AM

Harvard Kennedy School Invites CM Revanth Reddy to AI Policy Symposium

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నుంచి అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించమని ముఖ్యమంత్రికి లేఖ పంపింది. ఈ కార్యక్రమం మార్చి 27న హార్వర్డ్‌ స్కూల్‌ క్యాంపస్‌లో జరగనుంది.

భారత్‌ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకోవడం విశేషం. “AI as Infrastructure & Compute Power: Impact on Livability & Workforce” అనే ప్యానెల్‌లో పాల్గొని ప్రసంగించమని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సెషన్‌లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది.

ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భూమి, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణ, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ముఖ్యమంత్రి ప్రసంగించాలని నిర్వాహకులు ప్రత్యేకంగా కోరారు.

ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా కలిసి సింపోజియంపై చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమియా రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఏఐ పాలన, జియోపాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, ఎనేబ్లింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు హార్వర్డ్‌ అధికారులు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement