బిల్‌ గేట్సూ... మన నైతికత! | Sakshi Editorial On Bill Gates Issue | Sakshi
Sakshi News home page

బిల్‌ గేట్సూ... మన నైతికత!

Feb 20 2026 1:43 AM | Updated on Feb 20 2026 8:29 AM

Sakshi Editorial On Bill Gates Issue

దాదాపు 48 గంటల ఊగిసలాట తర్వాత ఎట్టకేలకు ఢిల్లీలో భారీ యెత్తున జరుగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) శిఖరాగ్ర సదస్సులో గురువారం కీలక ప్రసంగం చేయాల్సిన మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ వెనక్కి తగ్గారు. చిన్నారులపై లైంగిక నేరాలకు పాల్పడ్డాడని ఆరోపణలొచ్చి, ఒక కేసులో శిక్ష కూడా పడి జైల్లో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సాన్నిహిత్యం ఉందని వెల్లడైనప్పటి నుంచి గేట్స్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. అందుకే ఈ భంగపాటు. గురువారం నాటి ఏఐ సదస్సు కార్యక్రమం గురించి నిర్వాహకులు వెబ్‌సైట్‌లో మంగళవారం ఉంచిన జాబితాలో గేట్స్‌ పేరు లేదు. ఇక అక్కడినుంచి మొదలైంది ప్రహసనం! ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో ప్రస్తావన ఉంది గనుక ఆయన హాజరు కాబోరని ప్రభుత్వ వర్గాలు చెప్పడం, అదేం కాదు... వస్తున్నారంటూ గేట్స్‌ ఫౌండేషన్‌ వివరణ, ఆ వెంటనే వెబ్‌సైట్‌లో మళ్లీ ఆయన పేరు దర్శనమీయటం, కేంద్ర సమాచార మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సైతం తప్పించుకునే ధోరణిలో జవాబీయటం పెద్ద చర్చకు దారితీసింది. 

తెరవెనుక ఏం జరిగిందోగానీ... గేట్స్‌ హాజరు కాబోరని చివరి నిమిషంలో నిర్ధారణ అయింది. చిత్రమేమంటే... ఈలోగా సోమవారం ఆయన విశిష్ట అతిథిగా అమరావతిలో ప్రత్యక్షం కావటం, చంద్రబాబు పాలనను చూసి పొంగిపోయి ఉదారంగా ప్రశంసలు కురిపించటం పూర్తయిపోయింది. ఆయన్ను ‘తీసుకు రాగలినందుకు’ కూటమి పక్షాలన్నీ చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్న తరుణంలోనే పిడుగుపాటులా ఏఐ సదస్సు ఎపిసోడ్‌ వెల్లడై పరువు పాతాళానికి పడిపోయింది. అలాంటి వ్యక్తిని ఆహ్వానించినందుకు సామాజిక మాధ్యమాల్లో చీవాట్లు మొదలయ్యాయి. ఆయన నేపథ్యాన్ని గమనించకుండా తీసుకొచ్చి పొగిడించుకున్నంత మాత్రాన భ్రమల్లో పడేదెవరు? ‘అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుక...’ అన్న నానుడి బాబు మరిస్తే ఎలా?

అయిదేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నా, ఇప్పటికీ ఎప్‌స్టీన్‌ ప్రేతాత్మ అనేకుల్ని వెన్నాడుతోంది. 30 లక్షల పేజీలున్న ‘ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌’ను అమెరికా న్యాయశాఖ గత నెలలో బట్టబయలు చేసినప్పటినుంచీ పీఠాలు కదులుతున్నాయి. శిఖరాలు కూలు తున్నాయి. ఇందులో ఆడ, మగ కూడా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్, మాజీ అధినేత క్లింటన్, ఇజ్రాయెల్‌ మాజీ ప్రధాని ఎహుద్‌ బరాక్‌ తదితరుల పేర్లున్నాయి. బ్రిటన్‌ రాజు చార్లెస్‌ సోదరుడు ప్రిన్స్‌ ఆండ్రూ గురువారం అరెస్టయ్యారు. బ్యాంకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మాన్‌ శాక్స్‌ న్యాయ సలహాదారు క్యాథరిన్‌ రుమెల్లర్‌ పదవికి రాజీనామా చేశారు. ఎంతో అయిష్టంగా ఆమె రాజీనామాను ఆమోదిస్తున్నానన్నందుకు ఆ సంస్థ చీఫ్‌ డేవిడ్‌ సోలొమాన్‌కు చీవాట్లు పడుతున్నాయి. 

ప్రముఖ నౌకా రవాణా నిర్వహణ సంస్థ డీపీ వరల్డ్‌ చీఫ్‌ సుల్తాన్‌ అహ్మద్‌ బిన్‌ సులేయమ్‌ తప్పుకున్నారు. అమెరికా ప్రముఖ న్యాయ సహాయ సంస్థ పాల్‌వీస్‌ చీఫ్‌ బ్రాడ్‌ కార్ప్‌ రాజీనామా చేశారు. ఇంకా బ్రిటన్‌ మాజీ రాయబారి, ఎంపీ లార్డ్‌ పీటర్‌ మాండెల్సన్, శత కోటీశ్వరురాలైన బ్యాంకర్‌ అరియానే డి రోత్స్, ఆర్థికవేత్త లారీ సమ్మర్స్, గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్‌ వగైరాల పేర్లున్నాయి. ఆఖరికి మన కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి అమెరికాలో రాయబారిగా ఉండగా ఆయనతో సంభాషించినందుకు ఈ ఫైల్స్‌లోకెక్కారు. వీరంతా ఎప్‌స్టీన్‌ నేరాల్లో భాగస్వాములని కాదు. ఈ మెయిళ్లలో అతన్ని ‘విలాస పురుషుడి’గా ప్రశంసించినవారు మొదలుకొని, అతగాడు అడిగిన పనులు చేసిపెట్టినవారి వరకూ ఎందరో ఉన్నారు. 

ఎవరినుంచి అయినా సమాజం నైతిక విలువలు ఆశిస్తుంది. అవి లోపించాయని గ్రహిస్తే ఎంతటివారినైనా తృణీకరిస్తుంది. బిల్‌ గేట్స్‌కు ఏపీలో నీరాజనాలు పట్టడం చూసినా, ఏఐ సదస్సులో ఆయన పాల్గొనటంపై బాహాటంగా బయటపడిన ఊగిసలాట గమనించినా ఈ విషయంలో మనం పాశ్చాత్య దేశాలకన్నా వెనకబడి ఉన్నామా అన్న సంశయం ఏర్పడి విచారం కలిగిస్తుంది. మన పురాణాలు, ఇతిహాసాలు మాత్రమే కాదు... మన రాజ్యాంగం సైతం మహిళల పట్ల ఎంత బాధ్యతాయుతంగా మెలగాలో చెబుతుంది. కానీ బిల్‌ గేట్స్‌ ఎపిసోడ్‌ ఆ విషయంలో మనకంతగా పట్టింపులేదన్న అభిప్రాయం కలిగిస్తుంది.  

Advertisement
 
Advertisement
Advertisement