ఏఐకి మానవ్‌ విజన్‌!  | PM Narendra Modi unveils MANAV vision at New Delhi AI Impact Summit 2026 | Sakshi
Sakshi News home page

ఏఐకి మానవ్‌ విజన్‌! 

Feb 20 2026 12:48 AM | Updated on Feb 20 2026 8:32 AM

PM Narendra Modi unveils MANAV vision at New Delhi AI Impact Summit 2026

విలువలతో కూడిన వాడకమే కీలకం 

నియంత్రణ మన చేతుల్లోనే ఉండాలి 

ఏఐ వాడకంలో కీలక కూడలిలో నిలిచాం 

సరైన దిశగా వెళ్లినప్పుడే ప్రపంచ ప్రగతి 

ఏఐ విప్లవానికి సారథ్య స్థానంలో భారత్‌ 

ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో ప్రధాని మోదీ 

హాజరైన దేశాధినేతలు, ప్రముఖులు 

అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాల సీఈఓలు

న్యూఢిల్లీ: ‘‘మానవాళి చరిత్రలో అతి గొప్ప పరివర్తనశీల అధ్యాయానికి ఏఐ నాంది పలికింది. అందులో భారత్‌ కేవలం ఒక భాగస్వామిగా మిగిలిపోలేదు. ఏఐ విప్లవానికి సారథ్యం వహించి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతోంది’’అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కృత్రిమ మేధ వినియోగంలో మానవాళి ఇప్పుడు కీలక కూడలి వద్ద నిలిచిందని ఆయన అభిప్రాయపడ్డారు.

 ‘‘ఏఐ ప్రస్థానాన్ని నేడు మనం ఏ దిశగా తీసుకెళ్తామన్నది మన రేపటిని, అంటే మానవాళి భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. కృత్రిమ మేధ (ఏఐ) వెల్లువలో అంతిమంగా మనిషి కేవలం ముడిసరుకుగా మిగిలిపోయే పరిస్థితి తలెత్తరాదు. జీపీఎస్‌ వంటి నావిగేషన్‌ టూల్స్‌ మనం ఏయే దారుల్లో వెళ్లొచ్చో సూచిస్తాయి. వాటిలో ఏ దారిని ఎంచుకోవాలన్న నిర్ణయం మాత్రం మనమే తీసుకుంటాం. అలాగే ఏఐ వాడకానికి ఆకాశమే హద్దు కావాలి. 

కానీ దాని నియంత్రణ మాత్రం నిత్యం మన చేతుల్లోనే ఉండాలి. అది జరగాలంటే ఏఐ వాడకాన్ని ప్రజాస్వామీకరించాలి. మనిషే ప్రధాన కేంద్రంగా దాని వినియోగం ఉండేలా సమగ్ర విధానాలు రూపొందించుకోవాలి’’అని పిలుపునిచ్చారు. గురువారం ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్‌ సదస్సును మోదీ లాంఛనంగా ప్రారంభించారు. 

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రాన్, బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిస్‌ ఇనాషియో లులా డసిల్వాతో పాటు పలువురు దేశాధినేతలు, పలు దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులు సదస్సులో పాల్గొన్నారు. వారందరికీ స్వాగతం పలుకుతూ ప్రధాని ప్రారం¿ోపన్యాసం చేశారు. ఏఐని అపారమైన శక్తి సామర్థ్యాలతో కూడిన పెన్నిధిగా ఆయన అభివరి్ణంచారు.

 ‘‘ఏఐ వాడకం ఆశించిన దిశగా సాగకుండా దారి మళ్లితే లక్ష్యసాధనకు బదులు వినాశనానికే దారితీస్తుంది. సజావుగా వాడినప్పుడు మాత్రమే మానవాళి ఎదుర్కొంటున్న పెను సమస్యలకు పరిష్కారాలు చూపి ప్రగతికి బాటలు పరుస్తుంది. అలా జరగాలంటే టెక్నాలజీ మనపై పెత్తనం చేయకూడదు. మనమే టెక్నాలజీని నియంత్రించాలి. 

అందుకోసం అన్ని రంగాల్లోనూ నానాటికీ కీలకంగా మారుతున్న అత్యాధునిక ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన రీతిలో వాడుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ సమగ్ర విధానాలను రూపొందించుకోవడం చాలా ముఖ్యం’’అని సూచించారు. ఇందుకోసం ‘మానవ్‌’విజన్‌ను ఆవిష్కరిస్తున్నట్టు ప్రధాని ప్రకటించారు.

 అంటే ‘నైతిక వ్యవస్థలు (మోరల్, ఎథికల్‌ సిస్టమ్స్‌–ఎం), జవాబుదారీతనంతో కూడిన పాలన (అకౌంటబుల్‌ గవర్నెన్స్‌–ఏ), దేశాల సార్వ¿ౌమత్వం (నేషనల్‌ సావర్నిటీ–(ఎన్‌), అందుబాటులో, సమ్మిళిత (యాక్సిసబుల్, ఇంక్లూజివ్‌–ఏ), ఆమోదయోగ్య, చట్టబద్ధ (వాలీడ్‌ అండ్‌ లెజిటిమేట్‌–వీ)’అని వివరించారు. ఈ విలువలు ఏఐ సమర్థ వాడకానికి దేశాలన్నింటికీ దారి చూపుతాయని ఆశాభావం వెలిబుచ్చారు. 

సార్వత్రిక సంక్షేమం, అందరికీ ఆనందమే ఏఐ వినియోగం విషయంలో భారత్‌ నిర్దేశించుకున్న ప్రమాణమని పేర్కొన్నారు. కనుకనే దాన్ని సదస్సు ఇతివృత్తంగా ఎంపిక చేసినట్టు వివరించారు. ‘‘ఏఐ అన్నివిధాలుగా అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. అప్పు డు మాత్రమే అది సర్వ మానవాళికీ మేలు చేస్తుంది. ఇది నా నిశి్చతాభిప్రాయం’’అని స్పష్టం చేశారు. 

భారత్‌ సిద్ధం 
ఏఐ విప్లవాన్ని అందిపుచ్చుకునేందుకు భారత్‌ ఏ మాత్రమూ వెనకాడటం లేదని మోదీ చెప్పారు. పైగా ఈ టెక్నాలజీని ఒక గొప్ప సంపదగా, బంగారు భవిష్యత్తుకు నమూనాగా పరిగణిస్తోందని దేశాధినేతలతో పాటు సభికులందరి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. ఏఐ రంగంలో సూపర్‌ పవర్‌గా నిలిచేందుకు అవసరమైన నైపుణ్యం, వనరులు, విధాన స్పష్టత తదితరాలన్నీ భారత్‌ సొంతమని పేర్కొన్నారు.

 ‘‘ప్రస్తుత సదస్సులోనే మూడు భారత కంపెనీలు తమ సరికొత్త ఏఐ మోడళ్లను, యాప్‌లను ఆవిష్కరించాయి. భారత యువతలో దాగున్న ప్రతిభకు ఇదే నిదర్శనం’’అని వివరించారు. ‘‘ఏఐ మన వ్యవస్థలన్నింటినీ మరింత తెలివైనవిగా, సమర్థంగా, ప్రభావవంతంగా మారుస్తుంది. యువత, వృత్తి నిపుణులు మరింత సృజనాత్మక బాధ్యతలు చేపట్టేందుకు అపారమైన అవకాశాలను అందుబాటులోకి తెస్తుంది. ఇన్నొవేషన్లకు, పారిశ్రామికతకు, కొత్త పరిశ్రమల స్థాపనకు ఒక గొప్ప అవకాశంగా ఏఐ నిలుస్తోంది. 

ఏఐ టూల్స్‌ను అతి గోప్యంగా అభివృద్ధి చేయాలని కొన్ని దేశాలు భావిస్తున్నాయి. కానీ భారత్‌ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. ఏఐ సాంకేతికతను అందరితోనూ పూర్తిస్థాయిలో పంచుకోవాలన్నది మా విధానం. అప్పుడే కోట్లాది మంది యువతీ యువకులు మరింతగా ఎదుగుతారు. తద్వారా సార్వత్రిక ప్రగతి, ప్రపంచ శ్రేయస్సు సాధ్యమన్నది మా విశ్వాసం’’అని మోదీ వివరించారు.

 ‘‘మన భావి తరాలకు ఎటువంటి ఏఐ నమూనాను అందిస్తమన్నది చాలా ముఖ్యం. అది సాధికారత, సమ్మిళిత భావనతో కూడుకుని ఉండేలా చూసుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిపైనా ఉంది’’అంటూ పిలుపునిచ్చారు. స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు గై పర్మెలిన్, శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సనాయకె, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ గోబ్గే, మారిషస్‌ ప్రధాని నవీన్‌చంద్ర రాంగులామ్, క్రొయేషియా ప్రధాని ఆంద్రెజ్‌ ప్లెంకోవిక్, సెర్బియా అధ్యక్షుడు అలెక్జాండర్‌ వుకిక్, సీషెల్స్‌ ప్రధాని సెబాస్టియన్‌ పిళ్లై, ఎస్టోనియా అధ్యక్షుడు అలర్‌ కరిస్, ఫిన్లండ్‌ ప్రధాని పెటెరీ ఓర్పో తదితర దేశాధినేతలు ఏఐ సదస్సులో పాల్గొన్నారు.

ఏఐ.. మేలిమలుపు 
‘‘మానవ చరిత్రలో పలు కీలక మైలురాళ్లున్నాయి. శతాబ్దాల పాటు అవి మన చరిత్రను తీర్చిదిద్దాయి. మన నాగరికతలను, అభివృద్ధి వేగాన్ని నిర్దేశించాయి. ఏఐ కూడా అలాంటి కీలక మార్పే’’అని మోదీ అన్నారు. ‘‘ప్రపంచ జనాభాలో ఆరో వంతుకు భారత్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో యువత ఇక్కడే ఉంది. టెక్నాలజీపరంగా అతి పెద్ద టాలెంట్‌ పూల్‌కు భారత్‌ నిలయం. కనుక ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు భారత్‌లో జరుగుతుండటం చాలా సముచితంగా ఉంది’’అని మోదీ అన్నారు.

సైగల భాషలో ప్రత్యక్ష తర్జుమా! 
న్యూఢిల్లీ:  ఏఐ ఇండియా ఇంపాక్ట్‌ సదస్సులో ఆసక్తికరమైన దృశ్యం అందరినీ ఆకర్షించింది. గురువారం సదస్సును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం ఏఐ ఆధారిత సైన్‌ లాంగ్వేజ్‌ ఇంటర్‌ప్రెటేషన్‌ పరిజ్ఞానం సాయంతో 11 భాషల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. అంతేగాక ప్రసంగాన్ని సైగల భాషలోకి కూడా అనువదించి వేదికపై ఏర్పాటు చేసిన డిజిటల్‌ బోర్డుపై ప్రదర్శించడం విశేషం.

Advertisement
 
Advertisement
Advertisement