జనతంత్రం
తెలంగాణకు సంబంధించినంతవరకు ‘నేనే రాజును, నేనే మంత్రిన’ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించుకున్నారు. మునిసిపాలి టీలు, కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు ప్రకటించ డానికి సరిగ్గా ఒకరోజు ముందు ఢిల్లీలో ఆయనీ ప్రకటన చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రజలే రాజులనేది ఒక ప్రాథమిక అవగాహన. భారత రాజ్యాంగాన్ని ప్రకటించుకున్నది కూడా ప్రజల పేరుతోనే కదా! ఈ కోణం నుంచి చూసినప్పుడు ముఖ్యమంత్రి ప్రకటనలో స్వాతిశయం మోతాదు మించినట్టే కనిపిస్తుంది. మరుసటి రోజు ప్రకటించబోయే ఎన్నికల ఫలితాల్లో భారీ విజయాన్ని నమోదు చేయబోతున్నామనే జోష్ ఇందుకు కారణం కావచ్చు.
ఓట్ల లెక్కింపు పూర్తి కాకముందే భారీ విజయం దక్కినట్టు ఎలా భావిస్తారు? అదంతే! మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికారంలో ఉన్న పార్టీ తలచుకుంటే స్థానికసంస్థల ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగానే ఉంటున్నాయి. అర్థబలం, అంగబలం అధికార పార్టీకి దండిగా ఉండడం ఒక కారణం. అధికార యంత్రాంగం పూర్తిగా చెప్పుచేతల్లోఉంటుంది. అంకితభావంతో ఒక పార్టీకి జెండా మోసే కార్య కర్తల ప్రభావం ఇప్పుడు అన్ని పార్టీల్లో తగ్గుముఖం పట్టింది.
వారి స్థానాన్ని నాలుగురాళ్లు వెనకేసుకున్నవారు, పైరవీకార్లు ఆక్రమిస్తున్నారు. అంకితభావంతో ఉండే కార్యకర్తల మాదిరిగా తెగించి పోరాడే తత్వం ఈ నయా శ్రేణులకు తక్కువ. లెఫ్ట్, బీజేపీల్లో ఈ జాడ్యం కొంత తక్కువ కావచ్చు కానీ, మిగిలిన పార్టీలేవీ మినహాయింపు కాదు. దానికితోడు ఇంకో రెండు మూడేళ్లు అధికారంలో ఉండే పార్టీనే గెలిపిస్తే కొద్దోగొప్పో అభివృద్ధి జరుగుతుందనే ఆశాభావం కూడా ఓటర్లలో ఉండే అవకాశం ఉన్నది.
ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఓట్ల లెక్కింపునకు ముందే భారీ విజయాన్ని ముఖ్యమంత్రి ఊహించడం, 90 శాతం మునిసిపాలిటీలు గెలవబోతున్నామని ప్రకటనలు చేయడం అసహజమేమీ కాకపోవచ్చు. ఇంతకుముందు 2020లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి పాలక పార్టీ 93 శాతం మునిసిపాలిటీలను గెలుచుకున్న ఉదాహరణ కూడా ఉన్నది.
కాకపోతే ఆ స్థాయి ఫలితాల్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సాధించిందా అనేదే ప్రశ్న. 116 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యత 66 చోట్ల లభించింది. అంటే 57 శాతం. 36 మునిసిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ 36 త్రిశంకు కౌన్సిళ్లలో 13 చోట్ల కాంగ్రెస్ పార్టీ పెద్ద పార్టీగా అవతరించింది. ఇవి కూడా పార్టీ ఖాతాలో పడితే సంఖ్య 79కి, శాతం 68కి చేరుతుంది.
ఇంకో ఆరు మునిసిపాలిటీల్లో రెండు పార్టీలకు చెరి సమానంగా సీట్లు వచ్చాయి. ఐదుచోట్ల కాంగ్రెస్ – బీఆర్‌ఎస్‌కు మధ్య, ఒకచోట బీఆర్‌ఎస్ – బీజేపీకి నడుమ ఈ టై ఏర్పడింది. 12 హంగ్ మునిసిపాలిటీల్లో బీఆర్‌ఎస్ పెద్దపార్టీగా గెలిచింది. నాలుగు మునిసిపాలిటీల్లో బీజేపీ, ఒకచోట ఎమ్‌ఐఎమ్‌లు పెద్దన్నలుగా ఉన్నాయి. ఈ మొత్తం 23 చోట్ల అధికార దన్నుతో సగానికి సగం కాంగ్రెస్ లాక్కోగలిగినా గరిష్ఠంగా దాని బలం 90 మునిసిపాలిటీలకు చేరుతుంది.
స్ట్రయిక్ రేట్ 80 శాతాన్ని దాటే అవకాశం లేదు. అయినా, ఇదేమీ చిన్న విజయం కాదు. ఐదింట నాలుగొంతుల మునిసిపాలిటీలను కాంగ్రెస్ స్వాధీనం చేసుకుంటుంది. కాకపోతే ఐదేళ్ల కింద అప్పటి అధికార బీఆర్‌ఎస్ ఇంతకంటే పెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత మూడేళ్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయింది. ఈ గుణపాఠాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదని ‘నేనే రాజు, నేనే మంత్రి’ ప్రకటన స్పష్టం చేసినట్లయింది.
2020లో కాంగ్రెస్ పార్టీకి నాలుగు మునిసిపాలిటీలే దక్కాయి. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ 13 మునిసి పాలిటీలను స్పష్టమైన మెజారిటీతో గెలుచుకున్నది. ఇంకో పన్నెండు హంగ్ పట్టణాల్లో పెద్ద పార్టీగా గెలిచింది. ఐదుచోట్ల కాంగ్రెస్‌తో, ఒకచోట బీజేపీతో సమాన వార్డులు గెలవడంతో అక్కడ టై ఏర్పడింది. మొత్తంగా 31 మునిసిపాలిటీల్లో బీఆర్‌ఎస్ తన బలాన్ని ప్రదర్శించింది.
ఆ పార్టీ తన ‘దర్బార్ సంస్కృతి’ నుంచి బయటపడి ఉన్నట్లయితే మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని క్షేత్రస్థాయి రిపోర్టులు సూచిస్తు న్నాయి. పార్టీకి కేంద్రంలో మాదిరిగానే నియోజకవర్గాల స్థాయిలో కూడా దర్బార్ సంస్కృతి అలవాటైంది. అక్కడ పార్టీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్‌ఛార్జిలే పార్టీకి కేరాఫ్ అడ్రస్!
పదేళ్లు అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్యేలకు సమాంతరంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బీఆర్‌ఎస్ చేపట్టలేక పోయింది. ఫలితంగా చాలా ప్రాంతాల్లో తెగించి పోరాడే కార్యకర్తలు కరువయ్యారు. ఈ పరిణామం నగర కార్పొ రేషన్లలో, పెద్ద పట్టణాల్లో స్పష్టంగా కనిపించింది. పార్టీ అధినేత మీద జనసామాన్యంలో ఉండే అభిమానం ఇక్కడ పోలైన ఓట్లలో ప్రతిఫలించలేదు. ఎన్నికలు జరిగిన ఏడు నగర కార్పొ రేషన్లలో పెద్దవైన నిజామాబాద్, కరీంనగర్‌లలో బీజేపీ ఆధిక్యత కనబరిచింది. కరీంనగర్ మేయర్ పీఠాన్ని అదిదక్కించుకోవచ్చు.
నిజామాబాద్‌లో బీజేపీ గణనీయంగా 28 డివిజన్లు దక్కించుకున్నప్పటికీ, కాంగ్రెస్ – ఎమ్‌ఐఎమ్ కలిసి ఆ పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టే అవకాశాలున్నాయి. ఈ రెండు పట్టణాల్లోనూ బీజేపీకి గట్టి పునాదే ఉన్నది. రెండు పార్లమెంట్ స్థానాలు కూడా ఆ పార్టీవే. బీజేపీ విస్తృత ప్రచార వ్యూహాలతో వోటర్లలో పోలరైజేషన్ సృష్టించి లాభపడింది. ఈ ట్రెండ్‌కు ఎదురీదేంత సంస్థాగత బలం, నాయకత్వం లేక బీఆర్‌ఎస్ ఆ మేరకు నష్టపోయింది.
కొత్తగూడెం ఫలితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. కాంగ్రెస్‌తో పొత్తులో కొత్తగూడెం శాసనసభ్యునిగా ఎన్నికైన సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు తన నాయకత్వ ప్రతిభను ఈ ఎన్నికల్లో చాటుకున్నారు. కాంగ్రెస్‌తో సమానంగా 22 సీట్లను సీపీఐ గెలిచింది. ఆ పార్టీ మేయర్ అభ్యర్థికి బీఆర్‌ఎస్ మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధికార చాతుర్యం ప్రదర్శించి అడ్డుపుల్లలు వేయకపోతే సీపీఐకి మేయర్ పీఠం ఖాయం.
అదే జరిగితే మన ప్రజాస్వామ్య వ్యవస్థకు అదొక శుభసూచకం. ఎందుకంటే, అన్యాయాన్ని ఎదిరించే శక్తులకూ, ప్రశ్నించే గొంతులకూ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా కమ్యూనిస్టు పార్టీలు ఆదర్శమే కనుక! మిగిలిన నాలుగు కార్పొరేషన్లు నల్లగొండ, మహబూబ్‌నగర్, రామగుండం,మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ తన ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌పై విజయం సాధించింది.
మునిసిపాలిటీలు, కార్పొరేషన్లు ఎవరికెన్ని, ఎంత శాతం అనేదానికన్నా వార్డులు, డివిజన్ల సంఖ్య కీలకం. ఎందుకంటే, జనం ప్రత్యక్షంగా ఓటేసి గెలిపించేది వార్డు/ డివిజన్ సభ్యులనే! మునిసిపల్ వార్డుల్లో కాంగ్రెస్‌కు 1,347, బీఆర్‌ఎస్‌కు 716, బీజేపీకి 261, ఇతరులకు 257 లభించాయి. కార్పొరేషన్ల డివిజన్లలో కాంగ్రెస్ 191, బీఆర్‌ఎస్ 63, బీజేపీ 76, ఇతరులు (సీపీఐ సహా) 83 చోట్ల గెలిచారు. ఇక ఓట్ల శాతానికి వస్తే కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు కలిపిన లెక్క అందుబాటులో ఉన్నది. దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి సుమారు 40 శాతం ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 29 శాతం, బీజేపీకి 16 శాతం, ఇండిపెండెంట్లకు 8 శాతం, ఎంఐఎంకు 3 శాతం, సీపీఐకి 1.3 శాతం, సీపీఎంకు 0.5 శాతం లభించినట్టు సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీలు ఏకపక్షంగా గెలవడం రివాజుగా మారిన ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ ప్రభావం కాంగ్రెస్ చెబుతున్నంత బలహీనంగా ఏమీ లేదని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీ సంస్థాగతమైన బలహీనతలను అధిగమించగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎంపీపీ, జడ్‌పీపీ ఎన్నికల్లో ఇంతకంటే మెరుగైన ఫలితాలనే సాధించే అవకాశాలను కొట్టి పారేయలేము.
కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ మంచి విజయాన్ని సాధించినప్పటికీ రెండు కమ్యూ నిస్టు పార్టీలకూ కలిపి రాష్ట్రవ్యాప్తంగా రెండు శాతం ఓట్లుకూడా రాకపోవడం ఒక విషాదం. ఒకప్పుడు మిలిటెంట్ పోరాటాలకు పెట్టింది పేరైన సీపీఎం పార్టీ కేవలం అరశాతం ఓట్లకు మాత్రమే పరిమితం కావడం దాని స్వయంకృతాపరాధమే!
ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది మాత్రంకాంగ్రెస్ పార్టీ వృద్ధ సింహం తాటిపర్తి జీవన్‌రెడ్డి గురించే! జగిత్యాలలో ఫిరాయింపు ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసి ఆయన అనుచరులకే ఎక్కువ భాగం టిక్కెట్లను కేటాయించడాన్ని ప్రశ్నిస్తూ, జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఆయన దృఢంగా నిలబడిన తీరు రాష్ట్రవ్యాప్తంగా అందరిదృష్టిని ఆకర్షించింది.
డబ్బూ, అధికారం తోడు లేకున్నా జీవన్ రెడ్డి చేసిన ఒంటరి పోరాటానికి జగిత్యాల జనం జైకొట్టారు. టికెట్ దొరికిన కార్యకర్తలతో పాటు ఇండిపెండెంట్లుగా నిల బెట్టిన వారితో సహా మొత్తం 18 మందిని గెలిపించుకొని రేస్‌లో నంబర్ వన్‌గా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ జీవన్‌రెడ్డి అనుచ రునికి ఛైర్మన్ పదవిని ఇస్తుందా? లేక అధికారం అండతో మేనేజ్ చేసి ఎమ్మెల్యే మనిషినే ఛైర్మన్ చేస్తుందా అనేది వేరే సంగతి. కానీ జగిత్యాల విన్నర్ మాత్రం జీవన్‌రెడ్డే!
‘నేనే రాజు, నేనే మంత్రి’ అని ముఖ్యమంత్రి ప్రకటించు కోవడం దర్బార్ సంస్కృతి ప్రవేశిస్తుందనడానికి ఒక సూచికే! ఈ ప్రకటనతో ఎంతమంది రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏకీభవిస్తు న్నారో, ఎంతమంది విభేదిస్తున్నారో తెలియదు. భిన్నాభిప్రా యాలు ఇప్పటికైతే పెదవులు దాటడం లేదు. నాలుగు దశాబ్దాలకాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డున్న జీవన్‌రెడ్డి తరఫున ఒక్క గొంతు కూడా వినిపించకపోవడం నిజంగా విచిత్రమే.
ఇదంతా కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సరికొత్త సామరస్యమో, తుపాను ముందరి ప్రశాంతతో కొంతకాలం ఆగితే తప్ప తెలియదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతిమంగా ప్రజలే రాజులన్న సత్యాన్ని గ్రహించక పోతే 2023లో బీఆర్‌ఎస్‌కు ఎదురైన అనుభవమే ఎవరికైనా తప్పదు. రాజులూ ప్రజలే! వాళ్లు ఓటేసి కుర్చీలో కూర్చోబెట్టిన ప్రభుత్వ పనితీరును తూకం వేసే తరాజులూ వారే!!

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com


