తరాలు మారినంత మాత్రాన గాయాలు తొలగిపోవు. నెత్తుటి చరిత్రను అంత సులభంగా చెరిపేయడం సాధ్యపడదు. బంగ్లాదేశ్ తాజా ఎన్నికల ఫలితాలు దీన్నే బలంగా చాటుతున్నాయి. బంగ్లాదేశ్‌లో అవినీతికీ, ఆశ్రిత పక్షపాతానికీ, అణచివేతకూ వ్యతిరేకంగా ఉద్యమించిన జెన్–జీ తరాన్ని అడ్డుపెట్టుకుని దేశాన్ని ఛాందసవాదం ఊబిలోకి నెట్టాలని, యాభై అయిదేళ్ల క్రితం బంగ్లా ప్రజానీకాన్ని ఊచకోత కోసిన పాక్‌తో అంట కాగాలని తహతహలాడిన మతతత్వ శక్తులు గురువారం నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలయ్యాయి.
ఫలితాలు ఇంకా అధికారికంగా వెలువడాల్సే ఉన్నా 300 స్థానా లున్న పార్లమెంటులో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) ఆధ్వర్యంలోని కూటమి 216 స్థానాలు గెల్చుకుందని వార్తలు వస్తున్నాయి. జమాతే ఇస్లామీ నేతృత్వంలోని కూటమికి 76 స్థానాలు లభించాయి. ఇంకా కౌంటింగ్ కొనసాగుతున్న చాలా స్థానాల్లో బీఎన్‌పీ కూటమి ఆధిక్యతలో ఉన్నదని సమాచారం.
పెద్ద మనిషిలా కనబడే ఆర్థిక నిపుణుడు మహ్మద్ యూనస్‌ను తాత్కాలిక ప్రభుత్వా నికి ప్రధాన సలహాదారుగా నియమిస్తే, ఆయన కాస్తా మతోన్మాదాన్ని రెచ్చగొట్టడమే ధ్యేయమన్నట్టు ప్రవర్తించారు. మైనారిటీ హిందూ పౌరులపైనా, అవామీ లీగ్ నేతల పైనా, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలపైనా ఉన్మాద గుంపులు దాడులు చేస్తుంటే, హతమారుస్తుంటే పట్టనట్టు ప్రవర్తించారు. మతాచారాలు పాటించటం లేదంటూ నడి రోడ్లపై మహిళలను హింసిస్తుంటే కళ్లు మూసుకున్నారు.
వాటిని అతిగా చిత్రిస్తున్నారని మీడియాపై విరుచుకుపడ్డారు. హసీనా వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిని చేరదీసి, నేషనల్ సిటిజన్ పార్టీ(ఎన్‌సీపీ)ని ఏర్పాటు చేయించిందీ, జమాతేతో సర్దుబాటు చేయించిందీ ఆయనే. దేశంలో కొత్త పొద్దు పొడవబోతోందని గురువారం నాటి యూనస్ హుషారు మాటల అర్థం వేరు. జమాతే, ఎన్‌సీపీ మెజారిటీ స్థానాలు సాధిస్తాయని ఆయన విశ్వసించారు. అవామీ లీగ్‌పై ఎటూ నిషేధం ఉంది. బీఎన్‌పీ గత చరిత్ర సైతం అవినీతిమయమే. కనుక రెండు పార్టీల కథ ముగిసినట్టేనని అంచనా కొచ్చారు. కానీ బంగ్లా ప్రజలు వివేకవంతమైన తీర్పునిచ్చి ఆయనకూ, ఆ బాపతు శక్తు లకూ చెంప ఛెళ్లుమనిపించారు.
దేశంలో సుస్థిరమైన, స్వతంత్రమైన ప్రజాస్వామిక ప్రభుత్వం ఏర్పడాలని జనం కోరుకుంటున్నట్టు రాజకీయ నిపుణులు ముందే చెప్పారు. అయితే ఎన్నికలతోపాటు రాజ్యాంగ సంస్కరణలపై నిర్వహించిన రిఫరెండమ్ విషయంలో ప్రజాస్వామిక శక్తులు అప్రమత్తంగా ఉండకతప్పదు. వాటిల్లో అవాంఛనీయమైన అంశాలు చొరబడే ప్రమాదం లేకపోలేదు. చూడటానికి వాటి సారాంశం మెరుగ్గానే ఉంది. ప్రధాని పదవికి రెండు దఫాల పరిమితి, స్వతంత్ర న్యాయవ్యవస్థ, మహిళలకూ, యువతకూ పటిష్టమైన ప్రాధాన్యత, పార్లమెంటుకు రెండు సభల ఏర్పాటు అందులో ఉన్నాయి.
ఈ సంస్కరణల అమలు బాధ్యత జనం బీఎన్‌పీకి కట్టబెట్టారు. భావోద్వేగాలతో ముడిపడే ఎన్నికలతో, ఎంతో ఆలోచించి ఓటేయాల్సిన రిఫరెండమ్‌ను జత చేయటం సరికాదు. పైగా బీఎన్‌పీ గత చరిత్ర ఘనమైనదేమీ కాదు. కాబోయే ప్రధాని తారిఖ్ రెహ్మాన్ తల్లి ఖలీదా జియా రెండు దఫాల ఏలుబడిలో మతతత్వ, భారత వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహాన్నందించారు. ఇప్పటికైతే రెహ్మాన్ ఆలోచనా ధోరణి భిన్నంగా ఉన్నట్టు ఆయన ప్రసంగాలు చెబుతున్నాయి.
బంగ్లా విముక్తి యుద్ధానికి కొత్త భాష్యాలు చెప్పినవారికీ, పాక్ పాలకులను నెత్తి నెక్కించుకున్నవారికీ ఈ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. నిషేధంలోవున్న అవామీలీగ్ కార్యకర్తలు ఈ ఎన్నికల్లో పోటీచేయలేదన్న మాటేగానీ, ఆనాటి పాక్ దుష్కృత్యాలను ప్రజానీకానికి గుర్తుచేయటంలో విజయం సాధించారు. హసీనా అవినీతి పాలన పుణ్యమా అని జెన్–జీ తరానికి దేశ చరిత్ర గురించి తెలియకుండా పోయింది.
భారత్ అనుకూలతకు దూరంగా ఉండాలని, హసీనాను వెనక్కి రప్పించే యత్నం చేయాలని, నీటి వాటాలపై రాజీ పడొద్దని రెహ్మాన్‌పై జమాతే పార్టీ ఒత్తిళ్లు తెస్తుంది. వ్యర్థ వివాదా లతో కాలక్షేపం చేయకుండా, నిజాయితీగా పాలిస్తే రెహ్మాన్ రాజకీయంగా నిలదొక్కుకుంటారు. లేనట్టయితే ఇప్పుడు ఓటమిపాలైన శక్తులు మున్ముందు బలపడే ప్రమాదంఉంటుంది.


