తెలుగులో ఇటీవల అత్యధికంగా అమ్ముడుపోయిన పుస్తకం ‘అమ్మ డైరీలో కొన్ని పేజీలు’. దీనికంటే ముందు ‘నా ఇష్టం’, ‘విజయానికి ఐదు మెట్లు’ లాంటివి బెస్ట్ సెల్లర్స్. అత్యధిక పునర్ముద్రణలు పొందినవాటిల్లో ‘మహాప్రస్థానం’, ‘వేయి పడగలు’ లాంటివి ఉంటాయి. పోటీ పరీక్షలకు చదవాల్సి వచ్చేవో, ఉపవాచకాలుగా నిర్దేశించినవో కూడా మంచి అమ్మకాలే సాధిస్తాయి. కానీ ఇవన్నీ మినహాయింపులు మాత్రమే. సాధారణంగా తెలుగు సాహిత్యంలో బాగా అమ్ముడైన పుస్తకాలంటే వేసిన వెయ్యి కాపీలు మిగలకుండా పోయినవే! ఇప్పుడా వెయ్యీ లేకుండా ఐదొందలు, మూడొందలు, ఆఖరికి వంద కాపీలు ముద్రించుకునే అవకాశం వచ్చింది. లక్ష కాపీలు అమ్ముడుపోవడం అనేది ఏ తెలుగు రచయితైనా కనే పగటి కల మాత్రమే.
నిజంగానే లక్ష కాపీలు అమ్ముడైనా ఆ రచయితను మొత్తం తెలుగు జనాభాలో ఎంతమంది చదివినట్టు? సుమారు 0.1 శాతం! ఇలాంటి లెక్కల్నే ఆంగ్ల రచయితలకు అన్వయిస్తూ, ‘‘మీ పుస్తకాన్ని ఎవరూ చదవరు. ఇది అవమానించడం కాదు. ఇది లెక్కలపరమైన వాస్తవం’’ అంటారు పబ్లిషర్ స్టీఫెన్ స్పార్క్స్. ఆయన ప్రకారం, ఏ రచయిత వ్యాప్తి అయినా నామమాత్రమే. అందుకే గొప్పగా రాసివుండీ ఎవరూ చదవని రచయితల గురించి ‘రైటర్స్ నో వన్ రీడ్స్’ పేరుతో టంబ్లర్ పేజీ నడుపుతున్నాడు విల్ షొఫీల్డ్. ఈ రచయితలు గొప్ప రచయితలయ్యింది వాళ్ల అమ్మకాల వల్ల కాదు, వాళ్లది ఎంత ఒరిజినల్ రైటింగ్ అన్నదాన్నిబట్టి! ‘‘మరిచిపోయిన, నిర్లక్ష్యానికి గురైన, వదిలివేయబడిన, మరుగున పడిన, తక్కువగా అనువదింపబడిన రచయితలను వెలుగులోకి తేవడం...’’ అని షొఫీల్డ్ చెప్పింది తెలుగులోనూ చాలామంది రచయితలకు వర్తిస్తుంది.
‘మహా వేధ’ నవల రాసిన చివుకుల పురుషోత్తంను ఎవరైనా తలుచుకుంటున్నారా? కథకుడు అల్లం శేషగిరిరావుకు.. స్థాయికి తగిన గుర్తింపు ఉందా? తొలితరం యాక్టివిస్టు–రచయిత్రి కనుపర్తి వరలక్ష్మమ్మకు ఎన్ని విగ్రహాలు పెట్టారు? దళిత ఉనికితో కాకుండా నాగప్పగారి సుందర్రాజును గుర్తుచేసుకోవడం జరుగుతోందా? ‘చెంఘిజ్‌ఖాన్’ను తెలుగు నేల మీద నిలబెట్టిన తెన్నేటి సూరికి ఎవరైనా హారతులు పడుతున్నారా? గుర్తింపు ఉన్న రచయితలు అనుకునేవాళ్లకు కూడా పెద్దలెక్కల్లో ఏ గుర్తింపూ లేనట్టే! ఇక అచ్చుకే ‘నోచుకొని’ రచయితల సంగతి? ప్రపంచ వ్యాప్తంగా విస్మరించలేని రచయిత అయిన ఫ్రాంజ్ కాఫ్కా రచనలు అతడు బతికివుండగా పెద్దగా అచ్చుకాలేదు.
ఎమిలీ డికిన్సన్ కవిత్వమూ అంతే. ‘నువ్వు లేని అద్దం’ నవల ద్వారా కొత్త ఆసక్తికి కారణమైన చిత్రకొండ గంగాధర్ పుస్తకాలేవీ అతడు తన నలభైల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అచ్చుకాలేదు. మరి చదువుతారన్న గట్టి హామీ లేనప్పుడు కూడా రచయితలు ఎందుకు రాస్తున్నారు? వాళ్లను నడిపించే ఆ జీవలక్షణం ఏమిటి? ‘‘నా రచనకు ఆరంభ బిందువు ఎల్లప్పుడూ ఒక పక్షపాతం, ఒక అన్యాయ భావనే... నేను రాస్తాను– ఎందుకంటే బయటపెట్టవలసిన ఏదో అబద్ధం ఉంటుంది, చూపించ వలసిన ఏదో నిజం ఉంటుంది’’ అంటాడు జార్జ్ ఆర్వెల్. ‘‘ప్రతి వ్యక్తి ఆత్మ తాలూకు వైశిష్ట్యాన్ని స్పష్టంగా చూపించటం నవలాకారుడి బాధ్యత అని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అంటాడు హరూకీ మురకామి.
‘‘రచన నా శరీరానికి పొడిగింపు’’ అంటారు నటాలీ డయాజ్. ‘‘మనిషిగా ఉండే ఒక పార్శా్వన్ని చూపించడం’’ కోసం రాస్తానంటాడు కజువో ఇషిగురో. కీర్తి కోసం అని విలియమ్ ఫాక్‌నర్ బోల్డుగా చెప్పేయొచ్చు; నాలుగు డబ్బుల కోసం అని ఇంకో రచయిత ఒప్పేసుకోవచ్చు. కానీ ప్రతి రచయితకూ భిన్న కారణం ఉంటుంది. అసలు ఏ కారణమూ ఉండకపోవచ్చు. ‘సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు? చంద్రికలనేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?’ అని కృష్ణశాస్త్రి అన్నట్టుగా– రాయడం అనేది రచయిత సహజ లక్షణం. వాళ్లు రాయగలుగుతారు కాబట్టి రాస్తారు. రాయకుండా ఉండలేరు గనుక రాస్తారు. లోకం మీది ప్రేమతో దాన్ని జనానికి కానుక చేస్తారు.


