ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్ష అంతం కావటానికీ, సమానత్వం సిద్ధించటానికీ అనుసరించాల్సిన విధానాలను సూచిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) విడుదల చేసిన మార్గదర్శకాలను నిరసిస్తూ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీల్లో విద్యార్థుల ఆందోళనలు సాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో బరేలీ మేజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి కొలువుకు రాజీనామా చేయగా, దాన్ని నిరాకరించిన ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. బీజేపీ నాయకులు ఒకరిద్దరు యూజీసీ తీరును నిరసిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. విద్యార్థుల ఆందోళనకు ఆధిపత్య కుల సంఘాలు మద్దతు పలుకుతున్నాయి.
కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని యూజీసీ ఇటువంటి మార్గదర్శకాలు జారీచేయటాన్ని బీజేపీలోని ఆధిపత్య కులాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా ఎస్సీ, ఎస్టీలతోపాటు ఓబీసీ వర్గాలను సైతం ఈ పరిధిలోకి తీసుకురావటం వారికి ఆగ్రహం కలిగిస్తోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలవుతున్నా కులాన్ని అంతం చేయటం సంగతలా ఉంచి, కుల వివక్షను రూపుమాపేందుకు జరిగే ప్రయత్నాలకు సైతం వ్యతిరేకత ఎదురు కావటం వర్తమాన స్థితిగతులకు అద్దం పడుతుంది. వివక్ష ఎంతగా బాధిస్తుందో, పర్యవసానాలెలా ఉంటాయో దాన్ని అనుభవించేవారికి తప్ప అన్యులకు తెలిసే అవకాశం లేదు. అందుకే కుల వివక్షయినా, లింగ వివక్షయినా అవేమంత పెద్ద విషయాలు కాదన్నట్టు వాదించేవారు కనబడతారు.
చదువు సంస్కారాన్ని నేర్పుతుందనీ, జ్ఞానం పరిధి విస్తరించేకొద్దీ అందరూ కుల, మతాల పరిమితులు అధిగమిస్తారనీ సంస్కర్తలు ఆశించారు. విజ్ఞాన కేంద్రాలుగా భాసిల్లవలసిన ఉన్నత విద్యాసంస్థల్లో కులవివక్ష రూపుమాపటం సంగతలా ఉంచి, దాన్ని ప్రోత్సహించే ధోరణులు కనబడటం చేదు నిజం. యూజీసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారమే ఇటీవలి కాలంలో క్యాంపస్‌లలో కుల వివక్ష పెరిగింది. మొత్తంగా అయిదేళ్లలో 704 విశ్వవిద్యాలయాల నుంచి, 1,553 కళాశాలల నుంచి 1,160 ఫిర్యాదులు అందాయి. మొత్తంగా అంతక్రితం సంవత్సరాలతో పోలిస్తే అయిదేళ్లలో ఇలాంటి ఫిర్యాదుల శాతం 118.4 శాతం పెరిగింది. విద్యాసంస్థలు మాత్రమే కాదు, ఉద్యోగాలు, ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరుగుతోందని ఓబీసీ ఉద్యోగ సంఘాలు ఆరోపించటం కనబడుతూనే ఉంది. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు కుల వివక్ష అవాస్తవమని వాదించటం ఆత్మవంచన.
యూజీసీ తనకు తానుగా ఈ మార్గదర్శకాలు రూపొందించలేదు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 2016 జనవరిలో ఆత్మహత్య చేసుకున్న యువ దళిత విద్యార్థి రోహిత్ వేముల తల్లి రాధిక, 2019లో ముంబైలో పీజీ చేస్తూ ప్రాణం తీసుకున్న డాక్టర్ పాయల్ తాడ్వీ అనే ఆదివాసీ యువతి తల్లి అబేదా దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఇవి వెలువడ్డాయి. వాస్తవానికి 2012లోనే ఇలాంటివి రూపొందినా, అవి సలహాపూర్వకమైనవి మాత్రమే! ఉల్లంఘనలకు ఎటువంటి చర్యలుండాలో అందులో లేదు.
వివక్ష, వేధింపులకు దీటుగా శిక్ష ఉండాలని ఆ తల్లులిద్దరూ పిటిషన్‌లో అభ్యర్థించారు. తాజా మార్గదర్శకాలు పాటించని సంస్థలను యూజీసీ ప్రోగ్రాంల నుంచి దూరం పెట్టడం, కేంద్ర గ్రాంట్లు నిలిపేయటం వంటì చర్యలున్నాయి. ఫిర్యాదుల విషయంలో ఎలా వ్యవహరించాలో నిర్దేశించారు. వివిధ స్థాయుల్లో కమిటీల ఏర్పాటును సూచించారు. ఫిర్యాదులపై వెనువెంటనే దర్యాప్తు చేయటం తప్పనిసరి చేశారు.
ఈ మార్గదర్శకాల వల్ల జనరల్ క్యాటగిరీ విద్యార్థులు వేధింపులకు గురవుతారన్నది ఆందోళన చేస్తున్నవారి వాదన. బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకునే కావొచ్చు... ఆర్థికంగా బలహీన వర్గాలకూ, అంగవైకల్యం ఉన్నవారికీ కూడా వివక్ష, వేధింపుల నుంచి రక్షణ కల్పించారు. ఈ మార్గదర్శకాలపై ఉన్న అపోహల్ని తొలగిస్తామనీ, ఇవి దుర్వినియోగమయ్యే అవకాశమే లేదనీ కేంద్రం చెబుతోంది. ఏదేమైనా కుల, మత, లింగ వివక్షలు ఉండరాదంటున్న రాజ్యాంగ అధికరణం 15కు ఈ మార్గదర్శకాలు అనుగుణంగానే ఉన్నాయి. వివక్ష, దాని ఆధారంగా వేధింపులు కళ్లెదుట కనబడుతుండగా ఇలాంటి నిబంధనల్ని వ్యతిరేకించటం, దుర్వినియోగమవుతుందన్న సాకు చెప్పటం ధర్మం కాదు. ఆచరణలో లోటుపాట్లుంటే చక్కదిద్దటానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది.


