కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడనున్న తరుణంలో బెంగాల్ ప్రజల మనోగతం ఎలా ఉందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా వెలువడిన ‘ఓట్ వైబ్’ (Vote Vibe) సర్వే ఫలితాలు ఎంతో ఆసక్తి కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠంపై మమతా బెనర్జీ పట్టు ఏ మేరకు ఉన్నదనేది ఈ సర్వే తేల్చిచెప్పింది.
దీదీకే జై కొడుతున్న జనం!
తాజా సర్వే వివరాల ప్రకారం బెంగాల్ ముఖ్యమంత్రిగా 42 శాతం మంది మమతా బెనర్జీ వైపే మొగ్గు చూపారు. ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారికి కేవలం 19 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఐప్యాక్ (ఐ-పాక్)సంస్థపై ఈడీ దాడులు జరిగినప్పటికీ, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పర్సెప్షన్ యుద్ధంలో గెలిచిందని, ముఖ్యంగా ముస్లిం ఓటర్ల మద్దతును పదిలపరుచుకుందని సర్వే పేర్కొంది.
ప్రభుత్వ పనితీరుపై మిశ్రమ స్పందన
మమత ప్రభుత్వ పనితీరుపై జనం భిన్నంగా స్పందిస్తున్నారు. సుమారు 34 శాతం మంది ‘అద్భుతం’ అని కితాబివ్వగా, 18 శాతం మంది మాత్రం ‘చాలా దారుణం’ అంటూ పెదవి విరిచారు. సర్వేలో అధికార పార్టీకి కొన్ని హెచ్చరికలు కూడా వెలువడ్డాయి. దాదాపు 36 శాతం మంది ఓటర్లు నిరుద్యోగాన్ని ప్రధాన సమస్యగా భావిస్తున్నారు. మరోవైపు టీఎంసీ.. అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందన్న బీజేపీ ప్రచారాన్ని 47 శాతం మంది నమ్ముతుండటం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, యువ ఓటర్లు టీఎంసీకి దూరమయ్యే అవకాశం ఉందని సర్వే హెచ్చరించింది.
ఎన్నికల నగారాకు అంతా సిద్ధం
వచ్చే వారం రోజుల్లో పశ్చిమ బెంగాల్‌తో పాటు కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ ఇప్పటికే 294 నియోజకవర్గాలకు రిటర్నింగ్ అధికారులను నియమించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటన ముగిసిన వెంటనే ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉన్నదని సమాచారం. 2021లో భారీ మెజారిటీతో గెలిచిన దీదీ, ఈసారి నాలుగోసారి అధికారాన్ని దక్కించుకుంటారా? లేక బెంగాల్ కోటను బీజేపీ బద్దలు కొడుతుందా? అనేది వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: శబరిమల వివాదం.. కేరళ సర్కార్ ‘యూ టర్న్’


